నౌకారవాణా మంత్రిత్వ శాఖ

వ్లాదివోస్టోక్‌లో జరగనున్న ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొనడానికి రష్యాకు బయలుదేరిన శ్రీ సర్బానంద సోనోవాల్


చెన్నై-వ్లాదివోస్టోక్ మార్గాన్ని ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గంగా ఉపయోగించేందుకు ‘తూర్పు సముద్ర కారిడార్’ సమావేశంలో ప్రసంగించనున్న శ్రీ సోనోవాల్

Posted On: 11 SEP 2023 11:51AM by PIB Hyderabad

రష్యాలోని ఓడరేవు నగరమైన వ్లాదివోస్టోక్‌లో జరుగుతున్న 'ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరం'లో భారత్‌ తరపున ప్రాతినిధ్యం వహించడానికి, కేంద్ర ఓడరేవులు, నౌకారవాణా & జల మార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ రష్యాకు బయలుదేరారు. పర్యటనలో భాగంగా, వివిధ రంగాల ప్రముఖులతో పాటు ఇద్దరు రష్యన్‌ మంత్రులతోనూ శ్రీ సోనోవాల్ సమావేశం అవుతారు. భారత్‌-రష్యా మధ్య బలమైన సంబంధాలను కొనసాగించడం, వివిధ రంగాల్లో వ్యూహాత్మక, వాణిజ్య, రవాణా సహకారాన్ని పెంచుకోవడం ఈ సమావేశాల లక్ష్యం.

“ప్రతిష్టాత్మక ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరంలో మన దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించడం నాకు నిజంగా గొప్ప గౌరవం, బాధ్యతతో కూడుకున్న విషయం. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, మన దేశ వాణిజ్యం, భారత్‌-రష్యా మధ్య చారిత్రక సంబంధాలు కొత్త అడుగులు వేశాయి. వ్లాదివోస్టోక్-చెన్నై మధ్య ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాన్ని అభివృద్ధి చేయడానికి మేము కలిసి పని చేస్తున్నాం. నా పర్యటన, సమావేశాల వల్ల రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, వాణిజ్య, రవాణా రంగాల్లో సహకారం పెరగడమే గాక, ఈ ముఖ్యమైన ప్రాజెక్టులో మనం పురోగతి సాధించగలమని నేను నమ్ముతున్నాను" అని మంత్రి చెప్పారు.

'ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరం'లో భాగంగా, 'ఇండియా రష్యా బిజినెస్‌ డైలాగ్‌'లో శ్రీ సోనోవాల్ ప్రసంగిస్తారు. భారత్‌-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యంలో స్థిరత్వం, సుస్థిరతను పెంచడంలో వ్యాపారం, వాణిజ్యం పోషించే కీలక పాత్ర గురించి వివరిస్తారు. తూర్పు సముద్ర కారిడార్‌పై నిర్వహించే కార్యక్రమంలోనూ మంత్రి మాట్లాడతారు. ఉత్తర సముద్ర మార్గంలో అవకాశాలను అన్వేషించడం, బంగాళాఖాతంలో రవాణా కేంద్రం ఏర్పాటు సహా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాన్ని మరింత బలోపేతం చేసే అవకాశాలపై రష్యన్ సీనియర్ మంత్రులతోనూ భారతదేశ నౌకా రవాణా మంత్రి సమావేశం అవుతారు.

తూర్పు సముద్ర కారిడార్, రెండు దేశాల మధ్య రవాణా సమయాన్ని తగ్గిస్తుంది. నోవోరోసిస్క్ నౌకాశ్రయానికి చేరే 30 రోజులతో పోలిస్తే, తూర్పు సముద్ర కారిడార్‌ వల్ల, భారతీయ ఓడరేవుల నుంచి రష్యన్ దూర తీరాలకు చేరడానికి కేవలం 24 రోజుల సమయం పడుతుంది. ఈ కారిడార్‌ వల్ల భారత్‌-రష్యా మధ్య వాణిజ్యం & సహకారం రంగాల్లో కొత్త అవకాశాలు ఆవిర్భవిస్తాయి.

ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరం, 2023 గురించి: 8వ ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరం 2023, ఈ నెల 10-13 తేదీల్లో వ్లాదివోస్టోక్‌లోని ఫార్ ఈస్టర్న్ ఫెడరల్ యూనివర్సిటీ ప్రాంగణంలో జరుగుతోంది. రష్యా, ప్రపంచ పెట్టుబడి సంస్థలతో సంబంధాలను ఏర్పరుచుకోవడానికి & బలోపేతం చేయడానికి, అధునాతన ప్రత్యేక ఆర్థిక మండళ్లలోని వ్యాపార పరిస్థితులకు కీలకమైన అంతర్జాతీయ వేదికగా ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం పని చేస్తుంది.

రష్యా ఫార్ ఈస్ట్ ఆర్థిక అభివృద్ధికి, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అంతర్జాతీయ సహకారం విస్తరించుకోవడానికి 2015లో ఈస్ట్రన్‌ ఎకనమిక్‌ ఫోరం ఏర్పడింది. రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశంతో దీనిని స్థాపించారు.

 

****



(Release ID: 1956335) Visitor Counter : 146