రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

హిందుస్తాన్ టర్బో ట్రైనర్ హెచ్‌టీటీ-40ని నడిపిన వైమానిక దళ ఉపాధిపతి

Posted On: 08 SEP 2023 1:27PM by PIB Hyderabad

వైమానిక దళ ఉపాధిపతి, ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ ఈ రోజు బెంగుళూరులో 'హిందుస్థాన్ టర్బో ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్-40'ని (హెచ్‌టీటీ-40) నడిపారు. ఇది, ప్రాథమిక స్థాయి శిక్షణ విమానం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌కు (హెచ్‌ఏఎల్‌) చెందిన 'ఎయిర్‌క్రాఫ్ట్ రీసెర్చ్ & డిజైన్ సెంటర్' స్వదేశీ పరిజ్ఞానంతో ఈ విమానాన్ని రూపొందించింది. భారత సాయుధ దళాల శిక్షణ అవసరాలకు అనుగుణంగా తయారు చేసింది.

హెచ్‌టీటీ-40 పూర్తిగా ఏరోబాటిక్ విమానం. నాలుగు రెక్కలు ఉన్న ఇంజిన్‌తో పనిచేస్తుంది. అత్యాధునిక గ్లాస్ కాక్‌పిట్, ఆధునిక పరికరాలు, జీరో-జీరో ఎజెక్షన్ సీటు సహా సరికొత్త భద్రత విధానాలను ఇందులో ఏర్పాటు చేశారు. ఈ విమానం గరిష్ట వేగం గంటకు 450 కిలోమీటర్లు, గరిష్టంగా ఆరు కిలోమీటర్ల ఎత్తుకు ఎగరగలదు. హెచ్‌టీటీ-40 మొదటిసారిగా 2016 మే 31న ఎగిరింది. 2022 జూన్‌ 06న వ్యవస్థల స్థాయి అనుమతి సాధించింది. పూర్తి విమానానికి అనుమతుల ప్రక్రియ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంది.

భారత వైమానిక దళం, 70 విమానాల కోసం హెచ్‌ఏఎల్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. విమానాల సరఫరా 15 సెప్టెంబర్ 2025న ప్రారంభమై 15 మార్చి 2030 వరకు కొనసాగుతుంది. భారత సాయుధ దళాలకు చెందిన పైలట్‌ల శిక్షణలో నాణ్యతను హెచ్‌టీటీ-40 మెరుగుపరుస్తుంది. వైమానిక శిక్షణకు అనుబంధంగా ఈ విమానం కోసం పూర్తి యాంత్రిక సిమ్యులేటర్ కూడా ఉంది. దీని ద్వారా, పైలట్‌లు ఆకాశంలోకి వెళ్లకుండా నేలపైనే విభిన్న గగనతల పరిస్థితులను సృష్టించుకుని శిక్షణ పొందవచ్చు.

ప్రభుత్వ దార్శనికత అయిన 'ఆత్మనిర్భర్ భారత్'కు అనుగుణంగా, భారత దేశ రక్షణ & విమానయాన రంగాల్లో మరింత స్వావలంబన దిశగా పడిన మరో అడుగుగా హెచ్‌టీటీ-40 నిలుస్తుంది.

***



(Release ID: 1955570) Visitor Counter : 124