గనుల మంత్రిత్వ శాఖ
ప్రత్యేక ప్రచారం 2.0: స్వచ్ఛత దిశగా గనుల మంత్రిత్వ శాఖ అడుగులు
వర్షపు నీటి సంరక్షణ, సేంద్రియ ఎరువుల తయారీ, చెరువులను శుభ్రం చేయడం, పర్యావరణహిత పద్ధతుల్లో వ్యర్థాల నిర్వహణ
వ్యర్థాల అమ్మకం ద్వారా రూ.17 కోట్లకు పైగా ఆర్జన; అందుబాటులోకి 34,549 చదరపు అడుగుల నిరుపయోగ స్థలం
Posted On:
08 SEP 2023 12:39PM by PIB Hyderabad
'ప్రత్యేక ప్రచారం 2.0'లో భాగంగా, భారత గనుల మంత్రిత్వ శాఖ తన క్షేత్ర స్థాయి కార్యాలయాలతో కలిసి 2022 నవంబర్ నుంచి 2023 ఆగస్టు వరకు వివిధ కార్యకలాపాలు నిర్వహించింది. గనుల మంత్రిత్వ శాఖ తరపున, ఆ శాఖ కార్యదర్శి 2022 అక్టోబర్ 2న న్యూఢిల్లీలో ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. 116 స్వచ్ఛత కార్యక్రమాలను అమలు చేయడానికి దేశవ్యాప్తంగా 84 క్షేత్ర స్థాయి కార్యాలయాలను మంత్రిత్వ శాఖ గుర్తించింది.
ప్రత్యేక ప్రచారంలో మంత్రిత్వ శాఖ నిర్దేశించిన లక్ష్యం "ప్రకృతికి తిరిగి ఇవ్వడం". ఇందుకోసం వర్షపు నీటి సంరక్షణ, సేంద్రియ ఎరువుల తయారీ, సరస్సులు/చెరువులను శుభ్రం చేయడం, వ్యర్థాలను పర్యావరణహిత పద్ధతుల్లో నిర్వహించడం చేపట్టారు. ఈ కార్యాచరణల్లో భాగంగా, గనుల మంత్రిత్వ శాఖ కార్యాలయాల భవనాల్లో వర్షపు నీటి నిల్వ చేసే నిర్మాణాలు ఏర్పాటు చేశారు. జీవ ఎరువుల తయారీ ప్రాజెక్టుల కోసం స్థలాలను గుర్తించారు.
హెచ్‌సీఎల్ సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రం - ఐసీసీ యూనిట్, ఘట్‌శిల (ఝార్ఖండ్)
నాల్కో సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రం, దమంజోడి (ఒడిశా)
వర్షపు నీటి నిల్వ, మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్, నాగ్‌పుర్
వర్షపు నీటి నిల్వ, జీఎస్‌ఐటీఐ, హైదరాబాద్
ఖాళీ స్థలంలో వెల్‌నెస్ కేంద్రం, నాల్కో, అంగుల్ (ఒడిశా)
కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి, ప్రత్యేక కార్యక్రమం కింద చేపట్టిన పనులపై సమీక్షించారు. గనుల మంత్రిత్వ శాఖ డిపార్ట్‌మెంటల్ క్యాంటీన్‌లో వ్యర్థాలను వేరే చేసేందుకు అమలు చేస్తున్న పద్ధతిని అన్ని చోట్ల ఆచరించాలని సూచించారు. వ్యర్థాలను వేరు చేసి సేంద్రియ ఎరువు తయారీకి ఉపయోగించే కేంద్రాలకు పంపేలా, శాస్త్రి భవన్‌లోని అన్ని డిపార్ట్‌మెంటల్ క్యాంటీన్‌లకు ఇదే విధమైన మార్గదర్శకాలను జారీ చేయాలని విద్యా మంత్రిత్వ శాఖ, నోడల్ మంత్రిత్వ శాఖను జోషి అభ్యర్థించారు.
శాస్త్రి భవన్‌లోని గనుల మంత్రిత్వ శాఖ డిపార్ట్‌మెంటల్ క్యాంటీన్‌లో వ్యర్థాల విభజన
హైదరాబాద్ జీఎస్‌ఐటీఐ కూడా, తన హాస్టల్ క్యాంటీన్‌లో వ్యర్థాల విభజనను ప్రారంభించింది, వాటిని సేంద్రియ ఎరువుల తయారీకి ఉపయోగిస్తోంది. కార్యాలయ హైదరాబాద్‌లోని జీఎస్‌ఐటీఐలో సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అలాగే, నిరుపయోగంగా ఉన్న స్థలాన్ని ఉద్యోగులు/ప్రజల కోసం ఓపెన్ ఎయిర్ జిమ్‌గా మార్చారు.
జీఎస్‌ఐటీఐ, హైదరాబాద్, ఓపెన్ ఎయిర్ జిమ్
ప్రత్యేక ప్రచారం 2.0లో భాగంగా, 2022 నవంబర్ నుంచి 2023 ఆగస్టు వరకు దాదాపు 2,743 ఫైళ్లను గనుల మంత్రిత్వ శాఖ తొలగించింది. నిరుపయోగంగా ఉన్న మొత్తం 34,549 చదరపు అడుగుల స్థలాన్ని బాగు చేసింది. వ్యర్థాల అమ్మకం ద్వారా రూ.17,21,30,148 ఆదాయాన్ని ఆర్జించింది.
ఆహ్లాదకరమైన పని వాతావరణాన్ని సృష్టించేందుకు కార్యాలయాల ప్రాంతాలను ఆధునికీకరించారు. గనుల మంత్రిత్వ శాఖ నడవాలను చిత్రాలతో అలంకరించారు. ఖాళీ స్థలాలను అందంగా మార్చడానికి పూలమొక్కల కుండీలు ఏర్పాటు చేశారు. కార్యాలయ స్థలాన్ని పరిశీలించి నివేదికలు సమర్పించేందుకు డైరెక్టర్ స్థాయి అధికారులకు విధులు కేటాయించారు. గనుల మంత్రిత్వ శాఖలోని అన్ని సంస్థలు, పీఎస్‌యూల్లో ఇవే పద్ధతులు పాటించారు. ఈ చొరవ ఫలితంగా కార్యాలయాల ప్రాంగణంలో స్వచ్ఛత నెలకొంది. దీనిని ఇక్కడితో ఆపేయకుండా, 'ప్రత్యేక ప్రచారం 2.0' కింద శాశ్వత కార్యక్రమాలను చేపట్టారు.
***
(Release ID: 1955560)
Visitor Counter : 140