అంతరిక్ష విభాగం

భవిష్యత్తులో కీలకంగా మారే అంశాలపై పరిశోధనలు సాగించడానికి శాస్త్రవేత్తలకు అవసరమైన చంద్రుని వాతావరణం, నేల, ఖనిజాలు మొదలైన వాటి గురించి సమాచారాన్ని చంద్రయాన్-3 మిషన్ తొలిసారిగా భూమికి పంపుతుంది.. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


"విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం మిషన్ లక్ష్యాల మేరకు పని చేస్తున్నాయి.... డాక్టర్ జితేంద్ర సింగ్

చంద్రయాన్-3 చంద్రుడిపై దిగుతున్న సమయంలో జరిగిన ప్రత్యక్ష ప్రసారాన్ని పెద్ద సంఖ్యలో తిలకించిన విద్యార్థులను, సామాన్య ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు ఇస్రో ఆధ్వర్యంలో వచ్చే నెలలో దేశవ్యాప్తంగా అవగాహన ప్రచార కార్యక్రమాలు... డాక్టర్ జితేంద్ర సింగ్

"అంతరిక్షానికి పరిమితి లేదు అని ప్రధానమంత్రి చెప్పిన విధంగా అంతరిక్షాన్ని చేరుకోగల సామర్థ్యం దేశానికి ఉందని నిస్సందేహంగా వెల్లడి అయింది... ": డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 27 AUG 2023 4:56PM by PIB Hyderabad

భవిష్యత్తులో కీలకంగా మారే అంశాలపై పరిశోధనలు సాగించడానికి శాస్త్రవేత్తలకు అవసరమైన   చంద్రుని వాతావరణం, నేల, ఖనిజాలు మొదలైన వాటి గురించి సమాచారాన్ని  చంద్రయాన్-3 మిషన్ తొలిసారిగా భూమికి పంపే అవకాశం  ఉందని  కేంద్ర అంతరిక్ష వ్యవహారాల సహాయ  మంత్రి  డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు తెలిపారు.  విక్రమ్ ల్యాండర్,  ప్రజ్ఞాన్ రోవర్ నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం మిషన్ లక్ష్యాల మేరకు పని చేస్తున్నాయని ఆయన వివరించారు. 

ఒక మీడియా ఏజెన్సీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చంద్ర ఉపరితల లక్షణాలు, ఉష్ణ లక్షణాలు, చంద్ర ఉపరితల మూలకాలు (రెగోలిత్), ఉపరితలం  ప్లాస్మా పర్యావరణం తదితర అంశాలపై   చంద్రయాన్-3 లో అమర్చిన పరికరాలు ప్రత్యేక దృష్టి  పనిచేస్తాయని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు.   భూకంప కార్యకలాపాలు, చంద్రుని ఉపరితలంపై ఉల్కల ప్రభావాన్ని కూడా అంచనా వేస్తుందన్నారు. 

"ఇవన్నీ చంద్రుని సమీప-ఉపరితల వాతావరణంపై అన్వేషణ చేపట్టడానికి   ప్రాథమిక అవగాహనకు రావడానికి, భవిష్యత్తులో చంద్రుని ఆవాస ప్రాంతాలు  అభివృద్ధిని చేయడానికి చాలా అవసరం" అని కేంద్ర శాస్త్ర, సాంకేతిక, సిబ్బంది వ్యవహారాలు, పెన్షన్లు,ప్రజా ఫిర్యాదులు, అణుశాస్త్ర శాఖ సహాయ మంత్రి (పూర్తి స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్  పేర్కొన్నారు. 

విక్రమ్ ల్యాండర్ లో  సీస్మోమీటర్ (ILSA), ChaSTE, లాంగ్‌ముయిర్ ప్రోబ్ (RAMBHA-LP) , లేజర్ రిట్రోరెఫ్లెక్టర్ అర్రే పరికరాలు,  ప్రజ్ఞాన్ రోవర్ ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ (APXS), లేజర్ ప్రేరిత బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ (LIBS) పరికరాలు ఉన్నాయని డాక్టరో జితేంద్ర సింగ్ వివరించారు. 

" 2023 ఆగస్టు 24 నుంచి పని ప్రారంభించిన పరికరాలు  మిషన్ ముగిసే వరకు నిరంతర కార్యకలాపాలు నిర్వహించే విధంగా రూపొందాయి" అని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.

చంద్రమండలంపై సంభవించే   భూకంప కార్యకలాపాలు, చంద్రుని ఉపరితలంపై ప్రభావం చూపే ఉల్కల గురించి ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సీస్మిక్ యాక్టివిటీ (ILSA) నిరంతర పరిశీలన చేస్తుంది. అధిక చంద్ర అక్షాంశాల వద్ద చంద్రుని ఉపరితలంపై ప్రకంపనలను అధ్యయనం చేయడానికి పంపిన మొట్టమొదటి సీస్మోమీటర్ ILSA అని మంత్రి వెల్లడించారు. 

 

"ఉల్కాపాతం, భూకంప కార్యకలాపాల వల్ల కలిగే ప్రమాదాలను గుర్తించడానికి పరిశోధనలు ఉపయోగపడతాయి. వీటి ఆధారంగా భవిష్యత్తు ఆవాసాల అభివృద్ధి కోసం కృషి జరుగుతుంది. " అని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.

ChaSTE (చంద్రాస్ సర్ఫేస్ థర్మో-ఫిజికల్ ఎక్స్‌పరిమెంట్) అనేది విక్రమ్ ల్యాండర్‌పై అమర్చబడిన మరో కీలక పరికరం అని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ChaSTEలో మార్చిన పది హై-ప్రెసిషన్ థర్మల్ సెన్సార్‌లు, ఉష్ణోగ్రత వైవిధ్యాలను అధ్యయనం చేయడానికి చంద్రుని పై మట్టిని తవ్వుతాయి. ChaSTE అనేది చంద్రుని ఉపరితలం  మొదటి 10 సెం.మీ యొక్క థర్మో ఫిజికల్ లక్షణాలను అధ్యయనం చేసే మొట్టమొదటి ప్రయోగం అని మంత్రి తెలిపారు. 

చంద్రుని ఉపరితలంపై  చంద్రుని పగలు, రాత్రి సమయంలో గణనీయమైన ఉష్ణోగ్రత వైవిధ్యాలు నమోదవుతాయి. రాత్రి సమయంలో  కనిష్ట ఉష్ణోగ్రతలు <-100 ℃ వరకు  మధ్యాహ్న సమయంలో >100℃ వరకు ఉంటాయి.  చంద్ర ఉపరితల మట్టి (సుమారు ~5-20 మీటర్ల మందం కలిగి ఉంటుంది) ఒక అద్భుతమైన ఇన్సులేటర్‌గా ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. . ఈ ఇన్సులేటింగ్ లక్షణం,  గాలి లేకపోవడం వల్ల   పై ఉపరితలం,  లోపలి మధ్య చాలా ముఖ్యమైన ఉష్ణోగ్రత వ్యత్యాసం .ఉంటుందని అంచనా. 

" తక్కువ సాంద్రత , అధిక థర్మల్ ఇన్సులేషన్ లక్షణాలు కలిగిన చంద్రుడి ఉపరితల భాగం (రెగోలిత్) భవిష్యత్ ఆవాసాలకు ఒక ప్రాథమిక నిర్మాణ సౌకర్యంగా ఉంటుంది. , అయితే విస్తృత శ్రేణి ఉష్ణోగ్రత వైవిధ్యాల అంచనా మనుగడకు కీలకం" అని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.

చంద్రుని ఉపరితల ప్లాస్మా, దాని సమయ వ్యత్యాసాల అధ్యయనం లాంగ్‌ముయిర్ ప్రోబ్ ద్వారా జరుగుతుంది.  సూర్యుని ఎలివేషన్ కోణం తక్కువగా ఉండే అధిక చంద్ర అక్షాంశంలో సమీప-ఉపరితల ప్లాస్మా మరియు దాని రోజువారీ వైవిధ్యం అంశాలపై  మొట్టమొదటి పరిశీలనను  RAMBHA-LP చేపడుతుందని  డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.

భవిష్యత్తులో మానవ సహిత మిషన్ కోసం చంద్రుడి ఉపరితల గట్టిదనాన్ని  అంచనా వేయడానికి ఈ అధ్యనాలు ఉపయోగపడతాయని  ఆయన చెప్పారు.

ప్రగ్యాన్‌పై అమర్చిన ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ (APXS) , లేజర్ ప్రేరిత బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోపీ (LIBS), రోవర్ ట్రాక్‌లో స్టాప్ పాయింట్ల వద్ద (సుమారు 4.5 గంటలకు ఒకసారి) చంద్ర ఉపరితల మూలకాల కొలతలను చేస్తుంది. అధిక అక్షాంశాలలో చంద్రుడి ఉపరితల మూలక కూర్పుపై  అధ్యయనంచేయడం ఇదే తొలిసారని  డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.

"ఈ కొలతలు సంభావ్య ఉపరితల భూభాగ కూర్పు పై  అవగాహన  కలిగిస్తాయి, ఇది భవిష్యత్తులో స్వీయ-నిరంతర ఆవాస అభివృద్ధికి సహాయపడుతుంది" అని ఆయన చెప్పారు.

ల్యాండర్, రోవర్‌పై అమర్చిన పరికరాలతో పాటు, చంద్రయాన్-3 మిషన్ చంద్రుని ప్రొపల్షన్ కక్ష్యలో నివాసయోగ్యమైన ప్లానెట్ ఎర్త్ (షేప్) స్పెక్ట్రోపోలారిమెట్రీని అమర్చారు. 

"భవిష్యత్తులో భూమి లాంటి ప్రాంతాలను  గుర్తించడంలో ఇది సహాయపడుతుంది" అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు,. "ప్రాథమిక విశ్లేషణ, ఏకీకరణ తర్వాత సమాచారం  విద్యార్థులకు, ప్రజలకు అందుబాటులో ఉంటుందని మంత్రి తెలిపారు. 

 14 ఎర్త్ డేస్‌తో సమానమైన ఒక చంద్ర రోజు పాటు పని చేసేలా  ల్యాండర్,  రోవర్ లను నిర్మించారని మంత్రి తెలిపారు. 14 రోజుల తర్వాత  విక్రమ్, ప్రజ్ఞాన్ నిద్రాణ స్థితిలో ఉంటాయని  డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఒక మూన్ నైట్ లేదా 14 ఎర్త్ డేస్ తర్వాత తిరిగి పనిచేసే విధంగా  ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేస్తారని  తెలిపారు.  అత్యంత శీతల రాత్రి ఉష్ణోగ్రతల నుండి బయటపడి, మిగిలిన బ్యాటరీ మరియు వారి సోలార్ ప్యానెల్స్‌ని ఆన్ చేయడం ద్వారా ల్యాండర్, రోవర్‌ తిరిగి పని ప్రారంభించే విధంగా శాస్త్రవేత్తలు కృషి చేస్తారన్నారు. 

 7 పేలోడ్ (పరికరాలు)తో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) XLని ఉపయోగించి సెప్టెంబర్ మొదటి వారంలో ఆదిత్య-L1 మిషన్‌ను ప్రయోగించడానికి సిద్ధమవుతోంది. ఆదిత్య L1 అనేది సూర్యుని గురించి అధ్యయనం చేసే మొదటి అంతరిక్ష ఆధారిత భారతీయ మిషన్. అంతరిక్ష నౌకను భూమి నుండి 1.5 మిలియన్ కి మీ దూరంలో ఉన్న సూర్య-భూమి వ్యవస్థ  లాగ్రాంజ్ పాయింట్ 1 (L1) చుట్టూ ఒక శూన్య  కక్ష్యలో  ఉంచుతారు. . L1 పాయింట్ చుట్టూ తిరిగే  ఆర్బిట్‌లోఏర్పాటు చేసిన పరికరాలు  అవాంతరాలు  లేకుండా సూర్యుడిని నిరంతరం వీక్షించే ప్రధాన ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది.

 మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్  ఇస్రో చేపట్టనున్న  అతిపెద్ద ప్రాజెక్టు అని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.

“ మానవ సహిత మిషన్ చేపట్టే ముందు ఇస్రో  కనీసం రెండు మిషన్‌లను చేపడుతుంది.  బహుశా సెప్టెంబరు లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో మొదటి మిషన్‌ చేపడతారు.ఖాళీ అంతరిక్ష నౌకను  పంపుతాము. కొన్ని గంటలు ప్రయాణించిన తర్వాత నౌక తిరిగి వస్తుంది.  ఎటువంటి నష్టం లేకుండా సురక్షితంగా తిరిగి నీటిలో దిగే విధంగా ఈ ప్రయోగం జరుగుతుంది. ప్రయోగం  విజయవంతం అయితే  వచ్చే ఏడాది వ్యోమ్ మిత్ర అనే రోబోను పంపి  సామర్థ్యాన్ని పరీక్షించడానికి రెండు ప్రయోగాన్ని ఇస్రో నిర్వహిస్తుంది.   రెండవప్రయోగం  విజయవంతమైతే మానవ మిషన్ అయిన చివరి మిషన్‌ను పంపుతాము. ఇది బహుశా 2024 ద్వితీయార్థంలో జరిగే అవకాశం ఉంది. మొదట్లో  2022 లో ఈ ప్రయోగాన్ని నిర్వహించాలని భావించాము. అయితే,   కోవిడ్ కారణంగా ఆలస్యమైంది, ”అని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. 

ప్రధానమంత్రిగా శ్రీ నరేంద్ర మోదీ భాద్యతలు స్వీకరించిన తర్వాత  మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగాలకు అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయడం ప్రారంభమైంది అని తెలిపిన  డాక్టర్ జితేంద్ర సింగ్ గత తొమ్మిది సంవత్సరాల కాలంలో ఈ దిశలో అభివృద్ధి సాధించామని అన్నారు.

“2013 సంవత్సరం వరకు సంవత్సరానికి సగటున దాదాపు 3 ప్రయోగాలతో 40 లాంచ్ వెహికల్ మిషన్‌లు అమలు జరిగాయి. ఈ సంఖ్య గత 9 సంవత్సరాలలో రెట్టింపు అయ్యింది.  53 లాంచ్ వెహికల్ మిషన్‌లతో సంవత్సరానికి సగటున 6 ప్రయోగాలు జరిగాయి" అని ఆయన అన్నారు, " 2013 వరకు ఇస్రో 35 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇది గత 9 సంవత్సరాల కాలంలో ఇస్రో  400 విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి పంపింది" అని మంత్రి తెలిపారు. 

గత 9 సంవత్సరాల కాలంలో  వ్యూహాత్మక, పౌర అవసరాలను తీర్చడానికి  స్వంత ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ దేశంలో అభివృద్ధి అయింది అని  డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. అంతరిక్ష రంగ సంస్కరణలు ప్రారంభించిన శ్రీ నరేంద్ర మోదీ అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలకు ప్రవేశం కల్పించారు అని తెలిపిన  మంత్రి  సమగ్ర భారతీయ అంతరిక్ష విధానం 2023 విడుదల చేశామని అన్నారు. 

అంతరిక్ష రంగంలో   ప్రస్తుతం దాదాపు 200 స్టార్టప్‌లు పనిచేస్తున్నాయని, 2014 తర్వాత మాత్రమే స్పేస్ సెక్టార్ స్టార్టప్‌ల ఆవిర్భావాన్ని దేశం చూడడం ప్రారంభించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. అంతరిక్ష రంగ సంస్కరణలు అమలు జరిగిన తర్వాత  మొట్టమొదటి భారతీయ ప్రైవేట్ ఉపగ్రహ  ప్రయోగం ఇటీవల జరిగింది అని మంత్రి వివరించారు. 

“అంతరిక్షానికి పరిమితి లేదు అని ప్రధానమంత్రి ప్రకటించిన విధంగా  అంతరిక్షాన్ని చేరుకోగల  సామర్థ్యం తనకు ఉందని భారతదేశం ఇప్పుడు నిస్సందేహంగా నిరూపించింది. విశ్వంలోని అన్వేషించని ప్రాంతాలను కనుగొనడానికి  అంతరిక్షాన్ని దాటి  భారతదేశం పరిశోధనలు నిర్వహిస్తోంది.  ”అని డాక్టర్ జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. 

చంద్రయాన్-3 చంద్రుడిపై దిగుతున్న సమయంలో జరిగిన  ప్రత్యక్ష ప్రసారాన్ని పెద్ద సంఖ్యలో తిలకించిన   విద్యార్థులను, సామాన్య ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు ఇస్రో ఆధ్వర్యంలో వచ్చే నెలలో దేశవ్యాప్తంగా అవగాహన ప్రచార కార్యక్రమాలు జరుగుతాయని మంత్రి తెలిపారు. 

చంద్రయాన్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఒకేసారి 8 మిలియన్లకు పైగా ప్రజలు చూసారని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. యూ ట్యూబ్ లో ఒకేసారి అత్యధిక సంఖ్యలో ప్రజలు చూసిన కార్యక్రమంగా చంద్రయాన్ ప్రతీక్ష ప్రసారం రికార్డు సృష్టించిందని మంత్రి తెలిపారు.  ప్రపంచ కప్ 2022 క్వార్టర్ ఫైనల్స్‌లో బ్రెజిల్ , దక్షిణ కొరియా మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ ను  6.1 మిలియన్ల మంది చూశారు. . చంద్రయాన్-3 ల్యాండింగ్‌ను దాదాపు 70 మిలియన్ల మంది వీక్షకులు వీక్షించారు.అని మంత్రి తెలిపారు.  ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాటు చేయడంతో వీక్షించిన ప్రజల సంఖ్య మరింత ఎక్కువగా ఉందని అన్నారు. 

అవగాహన ప్రచారం సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభమవుతుంది.  స్పేస్ స్టార్టప్‌లు, టెక్ పార్టనర్ కంపెనీలపై దృష్టి సారించి ఫ్లాష్‌మాబ్‌లు, మెగా టౌన్ హాల్స్, క్విజ్ పోటీలు, ఉత్తమ సెల్ఫీలతో సహా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. 

 

****



(Release ID: 1952745) Visitor Counter : 180