ఆర్థిక మంత్రిత్వ శాఖ
నిబంధనలు పాటించనందుకు 'చండీగఢ్ హౌసింగ్ బోర్డు'పై నిలుపుదల ఉత్తర్వు జారీ చేసిన సీసీఐ
Posted On:
23 AUG 2023 4:59PM by PIB Hyderabad
పోటీ చట్టం-2002లోని సెక్షన్ 4(2)(ఎ)(ఐ) నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), చండీగఢ్ హౌసింగ్ బోర్డుపై (సీహెచ్‌బీ) నిలుపుదల ఉత్తర్వును జారీ చేసింది. పోటీ చట్టంలోని సెక్షన్ 27 కింద, ఈ నెల 22వ తేదీన ఈ ఉత్తర్వు జారీ చేసింది.
2010 సంవత్సరంలో సీహెచ్‌బీ ప్రారంభించిన స్వయం-సహాయక గృహ నిర్మాణ పథకం ('స్కీమ్') లబ్ధిదారు రమేష్ కుమార్ సమర్పించిన సమాచారం ఆధారంగా కేసు ప్రారంభమైంది.
కేటాయింపుదార్లపై అన్యాయమైన నిబంధనలు విధించడం ద్వారా పోటీ చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం సీహెచ్‌బీ తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసిందని, సీహెచ్‌బీ తరపున నివాస స్థలాన్ని స్వాధీనం చేసుకునే తేదీని బ్రోచర్ లేదా యాక్సెప్టెన్స్-కమ్-డిమాండ్ లెటర్‌లో (ఏసీడీఎల్) వెల్లడించలేదని రమేష్ కుమార్ ఆరోపించారు. నగదు చెల్లింపు ఒక రోజు ఆలస్యమైనా పూర్తి నెల వడ్డీని జరిమానాగా విధించారని ఆరోపించారు.
చండీగఢ్ మార్కెట్‌లో ఉన్న పోటీని తట్టుకుని స్వతంత్రంగా పని చేయగల ఆధిపత్య స్థానంలో సీహెచ్‌బీ ఉన్నట్లు కమిషన్ గుర్తించింది. లబ్ధిదార్లకు స్థలం స్వాధీనం తేదీని వెల్లడించకపోవడం, వాయిదా కట్టడంలో ఒక రోజు జాప్యానికి పూర్తి నెల వడ్డీని జరిమానాగా విధించడం వంటివి చట్టంలోని సెక్షన్ 4(2)(ఎ)(ఐ) ప్రకారం ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేయడం అని కమిషన్ పేర్కొంది.
సీహెచ్‌బీ ఇప్పటికే దిద్దుబాటు చర్యలు తీసుకోవడంతో, సీసీఐ సీహెచ్‌బీపై ఎలాంటి నగదు జరిమానా విధించలేదు.
సీసీఐ ఉత్తర్వు ప్రతి సీసీఐ వెబ్‌సైట్ www.cci.gov.inలో అందుబాటులో ఉంది.
***
(Release ID: 1951977)
Visitor Counter : 101