సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
చంద్రయాన్-3 విజయంలో ఎంఎస్‌ఎంఈ రంగం కూడా కీలక పాత్ర పోషించింది: శ్రీ నారాయణ్ రాణే
Posted On:
23 AUG 2023 8:24PM by PIB Hyderabad
చంద్రయాన్-3 విజయవంతం అయినందుకు దేశ ప్రజలకు, ఇస్రో బృందానికి కేంద్ర సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమల మంత్రి శ్రీ నారాయణ్ రాణే ట్వీట్ ద్వారా అభినందనలు తెలిపారు.
చంద్రయాన్-3 కలను సాకారం చేయడంలో శాస్త్రవేత్తలతో పాటు ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ కూడా తీవ్రంగా కృషి చేసిందని ఆయన అన్నారు.
ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని 'భువనేశ్వర్ టూల్ రూమ్', చంద్రయాన్-3 మిషన్ కోసం 437 రకాల 54,000 ఏరో-స్పేస్ విడిభాగాలను తయారు చేసిందని శ్రీ రాణే చెప్పారు. మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మరో సంస్థ ఐడీఈఎంఐ ముంబై కూడా చంద్రయాన్-3 కోసం విడిభాగాల తయారీలో కీలక పాత్ర పోషించిందని వివరించారు. ఈ మిషన్ విజయం మన దేశంతో పాటు యావత్ ప్రపంచానికి ప్రయోజనకరంగా ఉంటుందని కేంద్ర మంత్రి చెప్పారు. భారతదేశం 'ఆజాదీ కా అమృత్‌కాల్'ను జరుపుకుంటున్న ఈ తరుణంలో, చంద్రయాన్-3 విజయం దేశంలోని అంతరిక్ష, విజ్ఞాన, ఆవిష్కరణల రంగంలో కొత్త కోణాలను నెలకొల్పుతుందని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అంతరిక్ష రంగంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోందని శ్రీ నారాయణ్ రాణే అన్నారు. చరఖా నుంచి చంద్రయాన్ వరకు, ఇప్పుడు ఎంఎస్‌ఎంఈ రంగం ప్రతి చోటా ఉనికిని చాటుతోంది, దేశ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు. చంద్రయాన్-3 విజయం పట్ల శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలిపిన కేంద్ర మంత్రి, అంతరిక్ష రంగంలో భారతదేశ చరిత్ర అసాధారణమైనదని అన్నారు. భవిష్యత్తులో ప్రారంభించబోయే అంతరిక్ష యాత్రల్లోనూ ఎంఎస్‌ఎంఈ రంగం కచ్చితంగా కీలక పాత్ర పోషిస్తుందని శ్రీ నారాయణ్ రాణే అభిప్రాయం వ్యక్తం చేశారు.
*****
(Release ID: 1951974)