రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

25వ కార్గిల్ విజయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 'ఇండియన్‌ ఆర్మీ క్విజ్‌ 2023 - బాటిల్ ఆఫ్ మైండ్స్’ ప్రారంభం

Posted On: 16 AUG 2023 5:10PM by PIB Hyderabad

దేశ యువతలో విజ్ఞానం, ఆత్మవిశ్వాసం పెంచడం కోసం 'బ్యాటిల్ ఆఫ్ మైండ్స్ - ఇండియన్‌ ఆర్మీ క్విజ్‌ 2023’ను భారతీయ సైన్యం ఈ రోజు దిల్లీ కంటోన్మెంట్‌లోని మానెక్‌షా సెంటర్‌లో ప్రారంభించింది. ఆకర్షణీయమైన లోగోను కూడా ఆవిష్కరించింది. 25వ సంవత్సరం కార్గిల్ విజయ్ దివస్‌ వేడుకలను ఈ క్విజ్‌ ద్వారా సైన్యం ప్రారంభించింది. కార్గిల్ యుద్ధంలో భారత సాయుధ దళాలు సాధించిన విజయాన్ని ఈ క్విజ్‌ స్మరిస్తుంది. దేశానికి విజయాన్ని తెచ్చి పెట్టిన సైనికుల ధైర్యానికి హృదయపూర్వక నివాళి అర్పిస్తుంది. దేశ యువతలో మేధను పెంపొందించడంలో & స్ఫూర్తిని రగిలించడంలో సైన్యం చూపే నిబద్ధతను కొత్తగా ఆవిష్కరించిన లోగో ప్రతిబింబిస్తుంది. గతాన్ని గుర్తు చేయడం, రేపటి నాయకులను రూపొందించడం ఈ కార్యక్రమం లక్ష్యం.

వైస్ చీఫ్ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్, లెఫ్టినెంట్ జనరల్ ఎంవీ సుచీంద్ర కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్విజ్ పోటీల లోగోను ఏడబ్ల్యూడబ్ల్యూఏ అధ్యక్షురాలు శ్రీమతి అర్చన పాండే ఆవిష్కరించారు. పరమవీర చక్ర అవార్డు గ్రహీతలు సుబేదార్ మేజర్ (గౌరవ కెప్టెన్) యోగేంద్ర సింగ్ యాదవ్ (రిటైర్డ్), సుబేదార్ మేజర్ సంజయ్ కుమార్, దేశంలోని 36 రాష్ట్రాలు & కేంద్రపాలిత ప్రాంతాల పాఠశాలల ప్రిన్సిపాళ్లు కూడా హాజరయ్యారు.

దేశంలోని అన్ని జిల్లాల ప్రాతినిధ్యంతో సుమారు 1.5 లక్షల పాఠశాలలకు ఈ క్విజ్‌ చేరువవుతుంది. కనీసం 15,000 పాఠశాలల నమోదు ఈ కార్యక్రమం లక్ష్యం. దేశం నలుమూలల నుంచి సుమారు 1.5 కోట్ల మంది విద్యార్థులు పాల్గొంటారని అంచనా. ప్రతి పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థులు, రిజర్వ్‌లో ఒకరితో కూడిన బృందం క్విజ్‌లో పాల్గొంటుంది. కో-ఎడ్యుకేషన్‌ పాఠశాలల బృందాల్లో కనీసం ఒక విద్యార్థినిని ఉండాలి. పాల్గొనేవారు 10 నుంచి 16 సంవత్సరాల వయస్సులో (ఆరు నుంచి పది తరగతుల వాళ్లు) ఉంటారు. ఈ పోటీని హైబ్రిడ్‌ పద్ధతిలో, అంటే ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్‌ మార్గాల్లో నిర్వహిస్తారు. ప్రాంతీయ కమాండ్ స్థాయిలో ప్రారంభమై ఇంటర్-కమాండ్‌కు చేరుకుంటుంది. చివరకు జాతీయ స్థాయిలో ముగుస్తుంది.

'బ్యాటిల్ ఆఫ్ మైండ్స్- ఇండియన్‌ ఆర్మీ క్విజ్‌ 2023’ రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశ ఆన్‌లైన్‌లో జరుగుతుంది. ఇక్కడ విద్యార్థుల మేధస్సుకు పరీక్ష ఉంటుంది. ఆన్‌లైన్ రౌండ్‌లో విజయం సాధించిన పాఠశాలలు రెండో దశకు చేరుకుంటాయి. అంటే, ప్రాంతీయ కమాండ్ స్థాయి ఆఫ్‌లైన్ పోటీ గ్రాండ్ ఫినాలేతో ముగుస్తుంది. ఇక్కడ, జ్ఞానం, సామర్థ్యానికి సంబంధించిన పరీక్షలను విద్యార్థులు ఎదుర్కొంటారు, అత్యంత అర్హులైన విజేతలు తదుపరి దశకు వెళ్తారు.

ఐదు కీలక అంశాల ఆధారంగా ఇండియన్ ఆర్మీ క్విజ్ 2023 జరుగుతుంది. అవి,

భాగస్వామ్యం - ఆంగ్ల భాష ప్రాథమిక, ద్వితీయ బోధన మాధ్యమంగా ఉన్న అన్ని పాఠశాలలు ఈ క్విజ్‌లో పాల్గొనవచ్చు

సమాన  అవకాశం   - సమానత్వం కోసం ప్రతి కో-ఎడ్యుకేషన్‌ పాఠశాల నుంచి ఒక విద్యార్థిని ఉంటారు


న్యాయబద్ధమైన అవకాశం - సమాచారాన్ని అందుబాటులో ఉంచడం ద్వారా యోగ్యతను పెంచడం

ఉచిత నమోదు

ఆకర్షణీయమైన బహుమతులు - పాఠశాలలు, విద్యార్థులు, వారితో పాటు వచ్చే ఉపాధ్యాయులకు 4 కోట్ల రూపాయలకు పైగా బహుమతులు అందుతాయి. తొలి 12 పాఠశాలలకు బస్సులు, విద్యార్థులు & ఉపాధ్యాయులకు 360కి పైగా ల్యాప్‌టాప్‌లు అందిస్తారు.

'టీచ్ ఇండియా' ద్వారా, బోధన ఆధారిత అభ్యాసానికి ప్రాధాన్యతనిచ్చే విస్తృత సందేశం ఈ క్విజ్‌ ద్వారా ప్రచారం అవుతుంది. దేశ నిర్మాణంలో భారత సైన్యం పాత్ర, కార్గిల్ విజయం, భారత సైన్యంలో వచ్చిన మార్పుల గురించి కూడా ఈ క్విజ్‌ సమాజానికి చాటి చెబుతుంది.

విద్యార్థుల సాధారణ అవగాహనను పరీక్షించడం అనే విషయానికి మించి ఈ క్విజ్ జరుగుతుంది. సంస్కృతి, శాస్త్రం & సాంకేతికత, ఆవిష్కరణల జ్ఞానాన్ని పరీక్షించుకోవడానికి క్షేత్రస్థాయిలో ఒక శక్తివంతమైన వేదికను దేశ యువతకు ఈ క్విజ్‌ అందిస్తుంది. భవిష్యత్తులో, దేశ నిర్మాణంలో తాము పోషించాల్సిన పాత్రపైనా విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంది.

'ఇండియన్‌ ఆర్మీ క్విజ్‌ 2023' లోగో, పేరు, ట్యాగ్‌లైన్ భారతీయ సైన్యం ఘన వారసత్వాన్ని, ప్రాముఖ్యతను సూచిస్తాయి. లోగో ఆకారం ఐక్యత, క్రమశిక్షణను గుర్తు చేస్తాయి. లోగో రంగులు బలం, స్థితిస్థాపకతను ప్రతిబింబిస్తాయి.


(Release ID: 1949689) Visitor Counter : 299