ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం

భారతీయ రైల్వేలో రూ.32,500 కోట్లతో 2,399 కి.మీ. పొడవైన 7 బహుళ మార్గాల ప్రాజెక్టులకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం


ప్రస్తుత లైన్ల సామర్థ్యం పెంపు.. రైళ్ల నిర్వహణ సరళీకరణ..

రద్దీ తగ్గింపు.. ప్రయాణ/రవాణా సౌలభ్యం లక్ష్యంగా నిర్ణయం;

ఈ ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా 7.06 కోట్ల పనిదినాలతో ప్రత్యక్ష ఉపాధి సృష్టి;
సామర్థ్యం పెంపుతో అదనంగా 200 ‘ఎంటిపిఎ’ మేర సరకు రవాణాకు వీలు

Posted On: 16 AUG 2023 4:18PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్య‌వ‌హారాల సంఘం ఇవాళ భారతీయ రైల్వే మంత్రిత్వశాఖ పరిధిలో దాదాపు రూ.32,500 కోట్ల‌ విలువైన ఏడు బహుళ మార్గాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులకు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి  100 శాతం నిధులు అందుతాయి. ఈ బహుళ మార్గాల పనుల ప్రతిపాదనల మేరకు పనులు పూర్తయ్యాక రవాణా కార్యకలాపాల సౌలభ్యంతోపాటు రద్దీ కూడా తగ్గుతుంది. ఆ మేరకు భారతీయ రైల్వేల పరిధిలోని అత్యంత రద్దీ మార్గాల్లో అవసరమైన మౌలిక సదుపాయాల రూపకల్పనకు ఈ ప్రాజెక్టులు తోడ్పడతాయి.

   ఈ ఏడు ప్రాజెక్టులు 9 రాష్ట్రాలు- ఉత్తరప్రదేశ్, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిషా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌ పరిధిలోని 35 జిల్లాలకు విస్తరిస్తాయి. వీటిద్వారా ఇప్పటికేగల రైలు మార్గాల నెట్‌ వర్క్‌కు అదనంగా 2,339 కిలోమీటర్ల పొడవైన మార్గం జోడించబడుతుంది. ఈ పనులతో ఆయా రాష్ట్రాల్లోని కార్మికులకు 7.06 కోట్ల పనిదినాల మేర ఉపాధి అవకాశాలు అందివస్తాయి.

ప్రాజెక్టుల వివరాలు:

వ.సం.

ప్రాజెక్టు పేరు

ప్రాజెక్టు స్వభావం

1

గోరఖ్‌పూర్-కంటోన్మెంట్‌-వాల్మీకి నగర్

ప్రస్తుత మార్గం డబ్లింగ్‌

2

సోన్ నగర్-ఆండాళ్‌ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్

బహుళ ట్రాకింగ్

3

నెర్గుండి-బరంగ్/ఖుర్దా రోడ్-విజయనగరం

3వ మార్గం

4

ముద్ఖేడ్-మేడ్చల్/మహబూబ్ నగర్-ధోన్

ప్రస్తుత మార్గం డబ్లింగ్‌

5

గుంటూరు-బీబీనగర్

ప్రస్తుత మార్గం డబ్లింగ్‌

6

చోపన్-చునార్

ప్రస్తుత మార్గం డబ్లింగ్‌

7

సమాఖియాలి-గాంధీధామ్

నాలుగు మార్గాలకు పెంపు

   ఆహారధాన్యాలు, ఎరువులు, బొగ్గు, సిమెంట్, ఫ్లై-యాష్, ఐరన్, ఉక్కు ఉత్పత్తులు, క్లింకర్స్, ముడిచమురు, సున్నపు రాయి, వంటనూనెలు తదితర వివిధ రకాల వస్తు రవాణాకు ఇవి కీలక మార్గాలు. ఈ మార్గాల్లో సామర్థ్యం పెంపు పనుల వల్ల ఒనగూడే అదనపు ఫలితాల్లో 200 మిలియన్‌ టన్నుల వార్షిక రవాణా (ఎంటిపిఎ) సామర్థ్యం పెరుగుదల ఒకటి. రైల్వేలు పర్యావరణ అనుకూలం మాత్రమేగాక ఇంధన పొదుపుతో కూడినవి కావడం వల్ల, వాతావరణ లక్ష్యాల సాధనతోపాటు దేశంలో రవాణా వ్యయం తగ్గింపులో తోడ్పడతాయి.

   ప్రధానమంత్రి స్వప్నిస్తున్న నవ భారతం రూపకల్పన దిశగా ఈ ప్రాజెక్టులు చేపడుతున్నారు. వీటివల్ల ఈ ప్రాంత ప్రజలకు బహుళ నైపుణ్య కల్పన ద్వారా స్వావలంబన సిద్ధిస్తుంది. అలాగే వారికి ఉపాధి/స్వయం ఉపాధి అవకాశాలు అందివస్తాయి. బహుళ-రవాణా సాధన అనుసంధానం లక్ష్యంగా అమలు చేస్తున్న ‘పిఎం-గతిశక్తి జాతీయ బృహత్తర ప్రణాళిక’కు అనుగుణంగా ఈ ప్రాజెక్టులను సమీకృత ప్రణాళిక ద్వారా అమలు చేస్తున్నారు. తద్వారా వస్తుసేవలతోపాటు ప్రజా రవాణాకు నిరంతర అనుసంధానం అందుబాటులోకి వస్తుంది.

 

*****



(Release ID: 1949512) Visitor Counter : 174