రక్షణ మంత్రిత్వ శాఖ
యూఏఈ నౌకాదళంతో కలిసి ద్వైపాక్షిక 'నౌకాదళ సముద్ర భాగస్వామ్య విన్యాసాలు'లో పాల్గొన్న భారత నౌకాదళం
Posted On:
12 AUG 2023 5:49PM by PIB Hyderabad
యూఏఈ నౌకాదళంతో ద్వైపాక్షిక 'నౌకాదళ సముద్ర భాగస్వామ్య విన్యాసాలు'లో పాల్గొనేందుకు, ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ వెస్ట్రన్ ఫ్లీట్, రియర్ అడ్మిరల్ వినీత్ మెక్‌కార్టీ ఆధ్వర్యంలో, భారత నౌకాదళ నౌకలు ఐఎన్‌ఎస్ విశాఖపట్నం & ఐఎన్‌ఎస్ త్రికండ్, ఈ నెల 08న దుబాయ్‌లోని పోర్ట్ రషీద్‌కు చేరుకున్నాయి.
రెండు దేశాల నౌకాదళాలు ఈ రోజు 'నౌకాదళ సముద్ర భాగస్వామ్య విన్యాసాలు' నిర్వహించాయి. వ్యూహాలు, విధానాలు, పరస్పర శిక్షణ ద్వారా రెండు నౌకాదళాల మధ్య అవగాహన, బంధాన్ని మెరుగుపరచడం లక్ష్యం.
పర్యటనలో భాగంగా, అబుదాబి నావల్ కమాండ్‌లో యూఏఈ నావల్ ఫోర్సెస్ డిప్యూటీ కమాండర్ బ్రిగేడియర్ అబ్దుల్లా ఫర్జ్ అల్ మెహైర్బీతో రియర్ అడ్మిరల్ మెక్‌కార్టీ సమావేశం అయ్యారు. పైరసీ, వస్తువుల అక్రమ రవాణా, మానవ రవాణా వంటి సవాళ్లను కలిసి ఎదుర్కోవడానికి, సముద్ర భద్రతను మెరుగుపరచడానికి, అవసరమైతే ఉమ్మడిగా 'మానవత సాయం & విపత్తు సహాయ కార్యకలాపాలు' చేపట్టడానికి అధికారులు ఇద్దరు నిర్ణయించారు.
యూఏఈలోని భారత రాయబారి శ్రీ సంజయ్ సుధీర్‌తోనూ రియర్ అడ్మిరల్ మెక్‌కార్టీ సమావేశం అయ్యారు. భారత్ & యూఏఈ నౌకాదళాల విన్యాసాల గురించి, నేవీ-టు-నేవీ సహకారంపై ప్రణాళిక గురించి వివరించారు.
నౌకాదళ విన్యాసాల్లో భారత్‌కు చెందిన రెండు నౌకలు పాల్గొనడం, 'సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం' కింద యూఏఈతో పెరుగుతున్న రక్షణ సంబంధాలకు సూచన అని రాయబారి శ్రీ సంజయ్ సుధీర్ అన్నారు.
కెప్టెన్ అశోక్ రావు నేతృత్వంలోని ఐఎన్‌ఎస్ విశాఖపట్నం, భారత నౌకాదళంలో ఉన్న అతి పెద్ద విధ్వంసకర నౌకల్లో ఒకటి. మజగావ్ డాక్స్ లిమిటెడ్ దీనిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసింది. కెప్టెన్ ప్రమోద్ జి థామస్ నేతృత్వంలోని ఐఎన్‌ఎస్ త్రికండ్ అధునాతన స్టెల్త్ పరిజ్ఞానం ఉన్న యుద్ధనౌక. దీని సేవలు 2013లో ప్రారంభమయ్యాయి. ప్రతి అంశంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఈ నౌక రాడార్లకు చిక్కకుండా, వేగంగా, బలంగా పని చేస్తుంది.
****
(Release ID: 1948207)
Visitor Counter : 195