గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ

‘ఎంపీలాడ్స్‌’ అమలుపై అంచనా

Posted On: 09 AUG 2023 3:48PM by PIB Hyderabad

   పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం (ఎంపీలాడ్స్‌) సవరించిన మార్గదర్శకాలు-2023 ప్రకారం ఇకపై ఎంపీలు తమ నియోజకవర్గ పరిధిలో చేయదలచిన పనులను నిర్ణయించుకునే సౌలభ్యం కల్పించబడింది. అయితే, ఆ పనులు విస్తృత సామాజిక ప్రయోజనాలు, విస్తృత ప్రజా శ్రేయస్సుకు దోహదం చేసే శాశ్వత ప్రజా ఆస్తుల కల్పనకు అనుగుణమైనవై ఉండాలి. ఈ మేరకు ఎంపీలాడ్స్‌ మార్గదర్శకాలు-2023 అనుబంధం-VIIIలోని సూచనాత్మక జాబితాలో పొందుపరచని ప్రజా ప్రయోజన పనులను, అధ్యాయం-5లో సూచించిన విధానంతోపాటు పథకం సూత్రాలన్నిటికీ లోబడి ఎంపీల సిఫారసుపై ఆ జాబితాకు జోడించవచ్చు.

   ఇకపై పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం (ఎంపీలాడ్స్‌) అమలును ప్రభుత్వం అంచనా వేస్తుంది.

   ఈ పథకం అమలుపై చివరగా 2021లో అంచనాలు తీయబడ్డాయి. ఈ మేరకు మంత్రిత్వ శాఖ 01-04-2014 నుంచి 31-03-2019 వరకు దేశంలోని 216 జిల్లాల్లో ఈ పథకం కింద సృష్టించిన పనులపై తృతీయ పక్షంతో మూల్యాంకనం నిర్వహించింది.

   మూల్యాంకనం అనంతరం తుది నివేదికలో సూచించిన సిఫారసులు ఆచరణీయమైనవిగా,  గుర్తించి, వాటిని పథకం లక్ష్యాలకు అనుగుణంగా సరిదిద్ది, తాజాగా సవరించిన ఎంపీలాడ్స్‌ మార్గదర్శకాలు-2023లో పొందుపరచబడ్డాయి.

      కేంద్ర గణాంక-కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ (ఇన్‌చార్జి), ప్రణాళిక మంత్రిత్వ శాఖ, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖల సహాయ మంత్రి శ్రీ రావు ఇంద్రజిత్ సింగ్ ఇవాళ లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని వెల్లడించారు.

 

*****



(Release ID: 1947366) Visitor Counter : 98