గనుల మంత్రిత్వ శాఖ

ఖనిజ రంగంలో స్వావలంబన సాధించేందుకు చర్యలు అమలు

Posted On: 09 AUG 2023 1:21PM by PIB Hyderabad

దేశంలో ఖనిజ ఉత్పత్తిని చేసి ఖనిజ రంగంలో స్వావలంబన సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక విధాన సంస్కరణలు అమలు చేస్తోంది. దీనిలో భాగంగా గనులు మరియు ఖనిజాలు (అభివృద్ధి మరియు నియంత్రణ) (ఎంఎండీఆర్ ) చట్టం, 1957 కు అనేక సవరణలు చేసింది. 

కొన్ని ముఖ్యమైన సంస్కరణల వివరాలు:

దేశంలో ఖనిజాల ఉత్పత్తి తగ్గుదల సమస్యను పరిష్కరించడానికి 2015లో ఎంఎండీఆర్   చట్టం కింది లక్ష్యాలతో సవరించబడింది.

(i) విచక్షణను తొలగించడం;

(ii) ఖనిజ వనరుల కేటాయింపు లో పారదర్శకతను మెరుగుపరచడం;

(iii) విధానాలను సరళీకృతం చేయడం;

(iv) పరిపాలనాపరమైన  జాప్యాన్ని తగ్గించి దేశంలో లభిస్తున్న ఖనిజ సంపదను అభివృద్ధి చేసి  సమర్ధంగా పూర్తిగా వినియోగం లోకి తేవడం 

(v) ఖనిజ విలువలో ప్రభుత్వానికి  మెరుగైన వాటాను పొందడం

(vi) ఖనిజ రంగంలోకి  ప్రైవేటు పెట్టుబడి, తాజా సాంకేతికతను ఆకర్షించడం.

 ఖనిజ రంగం  సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడానికి, బొగ్గు తో సహా మైనింగ్ రంగంలో ఉపాధి,   పెట్టుబడులను పెంచడానికి, రాష్ట్రాలకు ఆదాయాన్ని పెంచడానికి,  ఉత్పత్తి ఎక్కువ చేయడానికి నిర్ణీత  కాల వ్యవధిలో గనులను వినియోగం లోకి తేవడం, లీజు కాలం ముగిసిన తర్వాత కూడా ఉత్పత్తి,కొనసాగించడానికి,ఖనిజ వనరుల అన్వేషణ మరియు వేలం వేగాన్ని పెంచడం మరియు రంగం వృద్ధిని మందగించిన దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా 2021లో ఎంఎండీఆర్ చట్టానికి మరిన్ని సవరణలు జరిగాయి.

 గనులు మరియు ఖనిజాల (అభివృద్ధి మరియు నియంత్రణ) సవరణ బిల్లు, 2023ను  28.07.2023న లోక్‌సభ , 02.08.2023న రాజ్యసభ ఆమోదించాయి. ఎక్కువ లోతులో లభించే ఖనిజాలను వెలికి తీయడం, చట్టంలోని 7వ షెడ్యూల్‌లో చేర్చిన  బంగారం, వెండి, రాగి, జింక్, సీసం, నికెల్, కోబాల్ట్, ప్లాటినం ఖనిజాల సమూహం, వజ్రాల అన్వేషణకు  లైసెన్స్‌ని ప్రవేశపెట్టడానికి ఎంఎండీఆర్ చట్టం, 1957 లో సవరణలు తేవాలని ప్రభుత్వం  ప్రతిపాదించింది.   వేలం ద్వారా మంజూరు చేయబడిన అన్వేషణ లైసెన్స్ చట్టంలోని కొత్త ఏడవ షెడ్యూల్‌లో పేర్కొన్న క్లిష్టమైన మరియు ఎక్కువ లోతులో లభించే  ఖనిజాల అన్వేషణ, తదితర  కార్యకలాపాలను చేపట్టడానికి లైసెన్స్‌దారుని అనుమతిస్తుంది. అన్వేషణ లైసెన్స్ క్లిష్టమైన, ఎక్కువ లోతులో లభించే  ఖనిజ అన్వేషణ లో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని సులభతరం చేస్తుంది. 

  ఎంఎండీఆర్ సవరణ బిల్లు 2023 చట్టంలోని మొదటి షెడ్యూల్‌లోని పార్ట్-బిలో పేర్కొన్న అణు ఖనిజాల జాబితా నుంచి లిథియం బేరింగ్ ఖనిజాలతో సహా ఆరు ఖనిజాలను తొలగించింది. ఈ ఖనిజాలు అంతరిక్షం, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఇంధనం , ఎలక్ట్రిక్ బ్యాటరీ వంటి రంగాల్లో వినియోగం అవుతున్నాయి. కర్బన ఉద్గారాలను పూర్తిగా అరికట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలలో ఈ ఖనిజాలు కీలకంగా ఉంటాయి.  అణు ఖనిజాల జాబితాలో ఇంతవరకు ఈ ఖనిజాలు ఉండడంతో  వాటి మైనింగ్ , అన్వేషణ కార్యక్రమాలను కేవలం  ప్రభుత్వ సంస్థలు మాత్రమే చేపట్టడానికి అవకాశం ఉండేది.  మొదటి షెడ్యూల్  పార్ట్-బి నుంచి  ఈ ఖనిజాలను తొలగించిన తర్వాత, ఈ ఖనిజాల అన్వేషణ, మైనింగ్ ప్రైవేట్ రంగానికి అందుబాటులోకి వస్తుంది. కొన్ని ఇతర కీలకమైన,  వ్యూహాత్మక ఖనిజాలతో పాటు అణు ఖనిజాల జాబితా నుంచి తొలగించిన  ఖనిజాలు ఇప్పుడు చట్టంలోని  మొదటి షెడ్యూల్‌లోని కొత్త భాగంలో చేర్చబడ్డాయి. ఈ ఖనిజాలను వేలం వేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అయితే, అటువంటి వేలం ద్వారా వచ్చే ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే వస్తుంది. ఫలితంగా, ఈ ఖనిజాల అన్వేషణ, మైనింగ్ దేశంలో గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు.

 

  కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వకంగా ఒక ప్రశ్నకు ఇచ్చిన  సమాధానంలో ఈ సమాచారం అందించారు.

 

 

 

 ****



(Release ID: 1947151) Visitor Counter : 111