సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
మాల్దీవులకు చెందిన 26వ బ్యాచ్ సివిల్ సర్వెంట్లకు శిక్షణ పూర్తి చేసిన ఎన్ సీజీజీ
ఇంతవరకు ఎన్ సీజీజీ లో శిక్షణ పొందిన 29 మంది ఏసీసీ అధికారులు సహా మాల్దీవులకు చెందిన 818 మంది అధికారులు
ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు డిజిటల్ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి... డీజీ వి.శ్రీనివాస్ సూచన
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరచడానికి కలిసి పనిచేయడం, సమాచార మార్పిడి అవసరం.. డీజీ వి.శ్రీనివాస్
Posted On:
07 AUG 2023 10:46AM by PIB Hyderabad
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో మాల్దీవుల సివిల్ సర్వెంట్ల కోసం నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎన్ సీజీజీ) నిర్వహించిన సామర్థ్య నిర్మాణ అభివృద్ధి కార్యక్రమం (సీబీపీ) 2023 ఆగస్టు 4న న్యూఢిల్లీలో ముగిసింది. రెండు వారాల పాటు ఎన్ సీజీజీ శిక్షణా కార్యక్రమం నిర్వహించింది.
పరిపాలన, ప్రజలకు సంబంధించిన వ్యవహారాల్లో అధికారుల నైపుణ్యాలు మెరుగుపరిచేందుకు ఎన్ సీజీజీ తో మాల్దీవుల ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా మాల్దీవులకు చెందిన 1,000 మంది అధికారులకు 2024 నాటికి శిక్షణ ఇవ్వడానికి ఎన్ సీజీజీ అంగీకరించింది. ఒప్పందంలో భాగంగా ఇప్పటికే మాల్దీవులకు చెందిన 818 మంది అధికారులకు ఎన్ సీజీజీ శిక్షణ ఇచ్చింది. శిక్షణ పొందిన వారిలో మాల్దీవులకు చెందిన 29 మంది ఏసీసీ అధికారులు ఉన్నారు.
కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన, అభివృద్ధి కార్యక్రమాలు, విధానాల రూపకల్పన అమలులో ప్రజల అవసరాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి అన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సూచనలు అమలు జరిగేలా చూసేందుకు ఎన్ సీజీజీ కార్యక్రమాలు అమలు చేస్తోంది. దీనిలో భాగంగా ప్రజా అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ కార్యక్రమాలు రూపొందించి అమలు చేయడం, సమాచార మార్పిడి, ఉత్తమ పరిపాలన విధానాలు అమలు చేయడం, డిజిటల్ పరిపాలనకు ప్రాధాన్యత ఇస్తూ ఎన్ సీజీజీ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. పొరుగు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం, ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా కూడా ఎన్ సీజీజీ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి.
మాల్దీవులకు చెందిన అధికారులకు శిక్షణ పూర్తయిన సందర్భంగా ఏర్పాటైన సమావేశానికి నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్ శ్రీ వి.శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లో పొందిన శిక్షణతో అలవరచుకున్న సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకుని విధులు నిర్వర్తించాలని శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులకు ఆయన సూచించారు. సమర్థంగా విధులు నిర్వర్తించటానికి అందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. జ్ఞానాన్ని పంచుకోవాలని, బృందంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. కలిసి పని చేయడం వల్ల మంచి ఆలోచనలు వస్తాయన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరచడానికి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని శ్రీ శ్రీనివాస్ అన్నారు. ఉత్తమ విధానాలు గుర్తించి అమలు చేయాలన్నారు.
విధి నిర్వహణలో ప్రభుత్వ అధికారులు డిజిటల్ పరిపాలనకు ప్రాధాన్యత ఇవ్వాలని శ్రీ శ్రీనివాస్ అన్నారు. సరికొత్త ఐటీ ఆవిష్కరణలను ఉపయోగించి ఆరోగ్య రంగంలో భారతదేశం సాధించిన ప్రగతిని ఆయన వివరించారు. డిజిటల్ పరిపాలన వల్ల భారతదేశం కోవిడ్ 19 మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కొని ప్రజలకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించిందన్నారు. భారతదేశం అమలు చేసిన కొన్ని ప్రధాన విధానాలను గుర్తించి వాటిని తమ దేశ అవసరాలకు అనుగుణంగా మార్పు చేసి అమలు చేయడానికి కృషి చేయాలని శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులకు శ్రీ శ్రీనివాస్ సలహా ఇచ్చారు. ఈ కార్యక్రమం నుంచి తాము నేర్చుకున్న విషయాలను చక్కగా ప్రజెంటేషన్ అందించిన అధికారులను ఆయన అభినందించారు.
ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మాల్దీవుల హై కమిషనర్ శ్రీ ఇబ్రహీం షాహీబ్ తమ దేశానికి చెందిన అధికారుల సామర్ద్యాన్ని పెంపొందించడానికి సహకారం అందించిన భారతదేశానికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొని శిక్షణ పూర్తి చేసుకున్న అధికారాలను ఆయన అభినందించారు. "మాల్దీవులలో పాఠశాలల డిజిటలైజేషన్" " మాల్దీవులలో ఆసుపత్రి సేవల డిజిటలైజేషన్"పై శిక్షణ పూర్తి చేసుకున్న అధికారాలు రూపొందించిన ప్రదర్శన పట్ల హర్షం వ్యక్తం చేసిన మాల్దీవుల హై కమిషనర్ ఈ కార్యక్రమాలు దేశాభివృద్ధికి సహకరిస్తాయని అన్నారు. కలిసి పని చేసి దేశాభివృద్ధికి కృషి చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
శిక్షణ కార్యక్రమం పూర్తి వివరాలను సమన్వయకర్త డాక్టర్ బిఎస్ బిష్త్ తెలిపారు. సామర్ధ్య నిర్మాణం కోసం ఇంతవరకు 26 సార్లు ఎన్ సీజీజీ కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. దేశంలో అమలు జరుగుతున్న వివిధ కార్యక్రమాల అమలుకు ఎన్ సీజీజీ సహకారం అందించిందని తెలిపారు. మారుతున్న పాలన నమూనా, కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కారం పర్యవేక్షణ వ్యవస్థ, భారతదేశం మాల్దీవులు మధ్య సంబంధాలు, సుపరిపాలన కోసం ఆధార్, ప్రజా విధానాల అమలు, పరిపాలనలో నైతిక విలువలు, నాణ్యత నిర్వహణ , విపత్తు నిర్వహణ, ప్రభుత్వ ఇ-మార్కెట్‌ప్లేస్, స్మార్ట్ సిటీ అభివృద్ధి, వివిధ అభివృద్ధి పథకాల నుంచి ఉత్తమ పద్ధతులు, తాగునీటి కోసం తక్కువ ఖర్చుతో డీశాలినేషన్, వాతావరణ మార్పు, పర్యాటకం, ఇ-గవర్నెన్స్,డిజిటల్ ఇండియా, నాయకత్వం, సమన్వయం, కమ్యూనికేషన్, ఆరోగ్య సంరక్షణ పాలన, పారిశుధ్యం, ప్రజారోగ్య ప్రవర్తన, వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, నైపుణ్యం భారతదేశం, అవినీతి నిరోధక వ్యూహాలు లాంటి కార్యక్రమాలను సంస్థ అమలు చేసిందని వివరించారు.
శిక్షణ కార్యక్రమంలో భాగంగా అధికారులు వివిధ రకాల అభివృద్ధి ప్రాజెక్టులు, సంస్థల పనితీరు ను స్వయంగా పరిశీలించారు. స్మార్ట్ సిటీ, డెహ్రాడూన్, ప్రధాన మంత్రి సంఘాలయ, ఎయిమ్స్ తో సహా ప్రముఖ సంస్థలు , కార్యక్రమాలను పరిశీలించిన అధికారులు కార్యక్రమాల అమలుపై అవగాహన పెంపొందించుకున్నారు.
మాల్దీవుల కోర్సు కోఆర్డినేటర్ డాక్టర్.బి.ఎస్. బిష్త్, కో-కోర్సు కోఆర్డినేటర్ డాక్టర్ సంజీవ్ శర్మ, ఎన్ సీజీజీ నిపుణుల బృందం పర్యవేక్షణలో 26వ శిక్షణా కార్యక్రమాలు జరిగాయి.
***
(Release ID: 1946362)
Visitor Counter : 115