సహకార మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో సి ఆర్ సి ఎస్ -సహారా రిఫండ్ పోర్టల్ ద్వారా సహారా గ్రూప్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీల నిజమైన డిపాజిటర్లకు నిధులను బదిలీ చేసిన కేంద్ర హోం , సహకార మంత్రి శ్రీ అమిత్ షా
దేశంలోని ప్రతి పేద, మధ్యతరగతి వ్యక్తి హక్కులను పరిరక్షించడానికి, సమాజంలోని నిరుపేద, అణగారిన వర్గాల సమస్యలను పరిష్కరించడానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది: శ్రీ అమిత్ షా
“డిపాజిటర్లు కష్టపడి సంపాదించిన ప్రతి ఒక్క రూపాయిని తిరిగి పొందడానికి మోదీ ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది”
“డిపాజిటర్లు డిపాజిట్ చేసిన సొమ్మును రికార్డు సమయంలోతిరిగి పొందేందుకు అన్ని ఏజెన్సీలు ప్రశంసనీయమైన కృషి చేయడంతో డిపాజిటర్లు తమ డబ్బును తిరిగి పొందుతున్నారు”
“పోర్టల్ ప్రారంభించిన సమయంలో, పోర్టల్ లో నమోదు చేసుకున్న 45 రోజుల్లో నిజమైన డిపాజిటర్లకు డబ్బు చెల్లిస్తామని తెలియజేశారు, కాని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ , భారత ప్రభుత్వానికి చెందిన అన్ని ఏజెన్సీలు ఒక నెల కంటే తక్కువ సమయంలోనే డబ్బు బదిలీ ప్రక్రియను ప్రారంభించాయి.”
112 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఈ రోజు రూ.10వేలు జమ అయ్యాయి; త్వరలోనే ఇన్వెస్టర్లందరికీ డబ్బులు తిరిగి వస్తాయి
సహకార మంత్రిత్వ శాఖ ఈ చొరవ కోట్లాది మంది పెట్టుబడిదారులలో సంతృప్తిని, విశ్వాసాన్ని నింపింది
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో , కేంద్ర హోం
Posted On:
04 AUG 2023 3:50PM by PIB Hyderabad
కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు న్యూఢిల్లీలో సిఆర్ సిఎస్-సహారా రిఫండ్ పోర్టల్ ద్వారా సహారా గ్రూప్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీల నిజమైన డిపాజిటర్లకు నిధుల బదిలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి శ్రీ బి.ఎల్.వర్మ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి శ్రీ ఆర్.సుభాష్ రెడ్డి, సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ జ్ఞానేష్ కుమార్, రిఫండ్ ప్రక్రియలో సహాయపడటానికి నియమితులైన నలుగురు సీనియర్ ఆఫీసర్స్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఒ ఎస్ డి) , రిఫండ్ లు పొందిన కొంతమంది డిపాజిటర్లు కూడా పాల్గొన్నారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం దేశంలోని ప్రతి పేద, మధ్య తరగతి వ్యక్తుల హక్కులను కాపాడడానికి, సమాజంలోని నిరుపేద, అట్టడుగు
వర్గాల సమస్యలను పరిష్కరించడానికి నిబద్ధత తో ఉందని అమిత్ షా తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ దిశలో సహకార మంత్రిత్వ శాఖ నేడు పెద్ద విజయాన్ని సాధించిందని, డిపాజిటర్లు మదుపు చేసిన డబ్బును రికార్డు సమయంలో తిరిగి పొందడానికి అన్ని ఏజెన్సీలు ప్రశంసనీయమైన కృషి చేశాయని, దీనితో డిపాజిటర్లు తమ డబ్బులను తిరిగి పొందుతున్నారని ఆయన అన్నారు. జూలై 18, 2023 న సి ఆర్ సి ఎస్- సహారా రీఫండ్ పోర్టల్ ప్రారంభించిన సమయంలో, పోర్టల్ లో రిజిస్టర్ చేసుకున్న 45 రోజుల్లో డిపాజిటర్లకు డబ్బు తిరిగి చెల్లిస్తామని చెప్పడం జరిగిందని, అయితే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ , భారత ప్రభుత్వానికి చెందిన అన్ని ఏజెన్సీలు కలిసి ముందుగానే రిఫండ్ ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రశంసనీయమైన కృషి చేశాయని శ్రీ అమిత్ షా తెలిపారు.
నెల రోజుల్లోనే నిధుల బదిలీ ప్రక్రియ ప్రారంభం కావడంతో 112 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10 వేలు జమ చేస్తున్నట్టు తెలిపారు. సహకార మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ చొరవ కోట్లాది మంది పెట్టుబడిదారుల లలో సంతృప్తి , విశ్వాసాన్ని నింపిందని శ్రీ షా అన్నారు.
సహకార మంత్రిత్వ శాఖ ఏర్పడిన సమయంలో సహకార వ్యవస్థను పునరుద్ధరించడం, 75 సంవత్సరాల క్రితం చేసిన సహకార చట్టాల్లో సకాలంలో మార్పులు చేయడం, ప్రజలలో సహకార సంఘాలపై కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి నెలకొల్పడం వంటి అనేక సవాళ్లు మంత్రిత్వ శాఖ ముందు ఉన్నాయని కేంద్ర సహకార మంత్రి తెలిపారు. ఈ సవాళ్లన్నింటినీ పరిష్కరించేందుకు సహకార మంత్రిత్వ శాఖ కృషి చేసిందని చెప్పారు. సహారా గ్రూపునకు చెందిన నాలుగు కో-ఆపరేటివ్ సొసైటీలలో గత 15 ఏళ్లుగా నిలిచిపోయిన కోట్లాది రూపాయలను తిరిగి చెల్లించడం ద్వారా దేశంలోని కోట్లాది మంది ఇన్వెస్టర్లకు సహాయం చేయడానికి ప్రయత్నాలు
జరిగాయని తెలిపారు. సి ఆర్ సి ఎస్ - సహారా రీఫండ్ పోర్టల్ లో 33 లక్షల మంది ఇన్వెస్టర్లు రిజిస్టర్ చేసుకున్నారని ఆయన తెలిపారు.
సహారా గ్రూపునకు చెందిన నాలుగు సహకార సంఘాల్లో చిక్కుకుపోయిన ఇన్వెస్టర్ల సొమ్మును తిరిగి చెల్లించేందుకు ఏడాది క్రితం సహకార మంత్రిత్వ శాఖ వరుస సమావేశాలు ప్రారంభించిందని శ్రీ అమిత్ షా తెలిపారు. భాగస్వాములందరినీ ఏకతాటి పైకి తీసుకురావడం ద్వారా సహకార మంత్రిత్వ శాఖ ఇతర అన్ని శాఖలతో కలసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసి నిజమైన డిపాజిటర్లకు రీఫండ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది.
రిఫండ్ చేయాల్సిన మొత్తంపై చిన్న ఇన్వెస్టర్లకు మొదటి హక్కు ఉన్నందున నేడు 112 మంది పెట్టుబడిదారులకు రూ. 10,000 మొత్తాన్ని చెల్లిస్తున్నట్లు సహకార మంత్రి తెలిపారు. అయితే రానున్న కాలంలో ఇన్వెస్టర్లందరికీ కచ్చితంగా డబ్బులు తిరిగి వస్తాయని హామీ ఇచ్చారు.
ఆడిట్ ప్రక్రియ పూర్తయినందున తదుపరి విడత చెల్లింపు విడుదలకు మరింత తక్కువ సమయం పడుతుందని ఆయన చెప్పారు. దేశంలోని ప్రతి పౌరుడి డిపాజిట్లను భద్రపరచడం, రాజ్యాంగం కింద ఉన్న హక్కులను ఉపయోగించుకుని నిలిచిపోయిన డిపాజిట్లను తిరిగి ఇచ్చే బాధ్యత దేశ ప్రభుత్వం, పాలనా యంత్రాంగంపై ఉందన్నారు. సహారా గ్రూపునకు చెందిన కోఆపరేటివ్ సొసైటీల పెట్టుబడిదారులు కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని తిరిగి పొందడానికి మోదీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని శ్రీ షా హామీ ఇచ్చారు. రికార్డు సమయంలో డిపాజిట్ సొమ్మును తిరిగి చెల్లించే ప్రక్రియను ప్రారంభించినందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి శ్రీ ఆర్ సుభాష్ రెడ్డి, సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ జ్ఞానేష్ కుమార్, ప్రత్యేక కార్యదర్శి శ్రీ విజయ్ కుమార్ , సహకార మంత్రిత్వ శాఖ అధికారులు , సంబంధిత ఏజెన్సీలకు శ్రీ అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో , కేంద్ర హోం , సహకార మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో తమ డబ్బును తిరిగి చెల్లించడానికి చేసిన ప్రయత్నాలకు గానూ సహకార మంత్రిత్వ శాఖకు సహారా గ్రూప్ డిపాజిటర్లు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ రోజు సహారా గ్రూప్ సహకార సంఘాలకు చెందిన 112 మంది డిపాజిటర్లకు వారి ఆధార్ లింక్డ్ బ్యాంకు ఖాతాల ద్వారా రూ.10,000 చొప్పున చెల్లించారు. మొదటి దశ విశ్లేషణ ఆధారంగా క్లెయిమ్ ల వెరిఫికేషన్ కోసం అమికస్ క్యూరీ సహాయంతో ఆడిటర్ 'ఎస్ ఒ పి (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్)' ను సిద్ధం చేస్తున్నారు.
కేంద్ర హోం , సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా 2023 జూలై 18న సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ (సిఆర్ సిఎస్)-సహారా రీఫండ్ పోర్టల్ https://mocrefund.crcs.gov.in ప్రారంభించారు. సహారా గ్రూప్ లోని సహకార సంఘాల - సహారా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, సహారాయన్ యూనివర్సల్ మల్టీపర్పస్ సొసైటీ లిమిటెడ్, హమారా ఇండియా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ , స్టార్స్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్- ల నిజమైన డిపాజిటర్లు క్లెయిమ్ లను సమర్పించడానికి ఈ పోర్టల్ ను రూపొందించారు.
సహారా గ్రూప్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీల నిజమైన డిపాజిటర్ల చట్టబద్ధమైన బకాయిల తిరిగి చెల్లింపునకు "సహారా-సెబీ రీఫండ్ ఖాతా" నుండి రూ. 5000 కోట్లను సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ (సిఆర్సిఎస్) కు బదిలీ చేయాలని గౌరవ సుప్రీంకోర్టు 2023 మార్చి 29 న తన ఉత్తర్వుల ద్వారా ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అమికస్ క్యూరీ న్యాయవాది గౌరవ్ అగర్వాల్ సహకారంతో ఈ మొత్తం ప్రక్రియను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.
రీఫండ్ ప్రక్రియలో సహాయపడటానికి పైన పేర్కొన్న ప్రతి సొసైటీకి నలుగురు సీనియర్ ఆఫీసర్స్ ఆన్ స్పెషల్ డ్యూటీ
(ఒ ఎస్ డి) లను నియమించారు.
క్లెయిమ్ ల సమర్పణ కోసం అభివృద్ధి చేసిన ఆన్ లైన్ పోర్టల్ ను యూజర్ ఫ్రెండ్లీ, సమర్థవంతమైన పారదర్శకమైనదిగా రూపొందించారు. ఈ ప్రక్రియ మొత్తం డిజిటల్ గా ఉంటుంది. నిజమైన డిపాజిటర్ల చట్టబద్ధమైన డిపాజిట్లు మాత్రమే రీఫండ్ అయ్యేలా చూడటానికి అవసరమైన తనిఖీలు, బ్యాలెన్స్ లను పోర్టల్ లో పొందుపరిచారు. సహకార మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ ద్వారా కూడా ఈ పోర్టల్ ను యాక్సెస్ చేయవచ్చు. ఈ సొసైటీల నిజమైన డిపాజిటర్లు పోర్టల్ లో అందుబాటులో ఉన్న ఆన్ లైన్ దరఖాస్తు ఫారాన్ని నింపడం ద్వారా తమ క్లెయిమ్ లను సమర్పించాలి. అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేయాలి. డిపాజిటర్ల ను ఆధార్ కార్డు ద్వారా వెరిఫికేషన్ చేసి వారి గుర్తింపును నిర్ధారిస్తారు. నియమితులైన సొసైటీ ఆడిటర్లు , ఒ ఎస్ డి ల ద్వారా క్లెయిమ్ లు, అప్ లోడ్ చేసిన డాక్యుమెంట్లను ధృవీకరించిన తరువాత, నిజమైన డిపాజిటర్లకు చెల్లింపు ను నిధుల లభ్యతకు లోబడి వారి ఆన్ లైన్ క్లెయిమ్ దాఖలు అయిన 45 రోజుల్లోగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు, వారికి ఎస్ఎంఎస్ / పోర్టల్ ద్వారా స్టేటస్ ను తెలియ చేస్తారు. సొసైటీల నిజమైన డిపాజిటర్లు తమ క్లెయిమ్, డిపాజిట్లకు రుజువుగా అవసరమైన డాక్యుమెంట్లతో పాటు ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్, బ్యాంక్ అకౌంట్ ఉండేలా చూసుకోవాలని సూచించారు.
****
(Release ID: 1945953)
Visitor Counter : 88