ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆధునీకరించిన 'నేషనల్ పెన్షన్ సిస్టమ్' ట్రస్టు వెబ్‌సైట్ ప్రారంభం
Posted On:
28 JUL 2023 2:38PM by PIB Hyderabad
ఆధునీకరించిన 'నేషనల్ పెన్షన్ సిస్టమ్' ట్రస్టు వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చింది. 'పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ & డెవలప్‌మెంట్ అథారిటీ' (పీఎఫ్‌ఆర్‌డీఏ) చైర్మన్ డా.దీపక్ మొహంతి ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. పీఎఫ్‌ఆర్‌డీఏ పూర్తి కాల సభ్యులు ప్రొఫెసర్ మనోజ్ ఆనంద్, శ్రీమతి మమతా శంకర్, ఎన్‌పీఎస్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ సూరజ్ భాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరిచేలా వెబ్‌సైట్‌ను కొత్తగా తీర్చిదిద్దారు. https://npstrust.org.in లింక్ ద్వారా ఈ సైట్‌ను చూడవచ్చు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్), అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) సమాచారాన్ని అంతరాయం లేకుండా వినియోగించుకులనేలా చేయడంలో ఎన్‌పీఎస్ ట్రస్ట్ చూపే నిబద్ధతలో ఇది ముఖ్యమైన మైలురాయి. కొత్త వెబ్‌సైట్‌ను కంప్యూటర్, చరవాణి రెండింటిలోనూ చూడవచ్చు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా కొత్త లక్షణాలు, తాజా సమాచారాన్ని ఇందులో పొందుపరిచారు.
వెబ్‌సైట్ ముఖ్య ముఖ్యాంశాలు:
- క్రమబద్ధమైన నావిగేషన్, మెను ఆకృతి
- నిర్మాణాత్మక సమాచారం
- కొత్త లక్షణాలతో మెరుగైన ఆన్‌లైన్ సేవలు
- మెరుగైన వినియోగదారు అనుభవం
- మెరుగైన శోధన సౌకర్యం
వెబ్‌సైట్ తెరవగానే 3 ముఖ్యమైన ట్యాబ్‌లు, “ఓపెన్ ఎన్‌పీఎస్ అకౌంట్”, “ప్లాన్ యువర్ రిటైర్‌మెంట్” (పింఛను కాలిక్యులేటర్), “వ్యూ మై ఎన్‌పీఎస్ హోల్డింగ్స్” కనిపిస్తాయి.

హోమ్ పేజీలో, ఈ పథకం ద్వారా వచ్చే రాబడులను సులభమైన, అర్థమయ్యే గ్రాఫిక్స్‌తో చందాదార్లు చూడవచ్చు.

ఎన్‌పీఎస్, ఏపీవై రెండింటి కోసం, మెను నిర్మాణాన్ని 6 సరళమైన విభాగాలుగా తీర్చిదిద్దారు. అవి, ఫీచర్లు & ప్రయోజనాలు, ఆన్‌లైన్ సేవలు, రాబడులు &చార్టులు, ఎన్‌పీఎస్ కాలిక్యులేటర్, ఫిర్యాదులు, ఎగ్జిట్.

ఆన్‌లైన్ సేవల కింద, ప్రాన్, పుట్టిన తేదీ, ఓటీపీని నమోదు చేయడం ద్వారా, చందాదార్లు సంబంధిత సీఆర్ఏ ద్వారా వారి ఎన్‌పీఎస్ పెట్టుబడులను కూడా చూడవచ్చు.

చూడగానే ఆకట్టుకునేలా ఎన్‌పీఎస్ ఆకృతిని తీర్చిదిద్దారు. విధులు, సంప్రదింపు వివరాలు సహా అన్ని రకాల వివరాలు ఒక్క క్లిక్‌తో చందాదార్లకు అందుబాటులోకి వస్తాయి.
ఈ వెబ్‌సైట్‌ను హిందీలో వినియోగించుకునేలా కూడా తీర్చిదిద్దారు.

సేవల్లో నాణ్యత పెంచడానికి, చందాదార్లకు అత్యుత్తమ అనుభవాన్ని అందించేలా డిజిటల్ కార్యక్రమాలను మరింత మెరుగుపరచడానికి ఎన్‌పీఎస్ ట్రస్టు కట్టుబడి ఉంది.
****
(Release ID: 1943860)
Visitor Counter : 126