మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

ఆరు మైనారిటీ వర్గాల సామాజిక-ఆర్థిక, విద్య సాధికారత కోసం అమలు చేస్తున్న పథకాలు

Posted On: 27 JUL 2023 2:08PM by PIB Hyderabad

దేశంలోని మైనారిటీల కోసం, ముఖ్యంగా సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన, బడుగు వర్గాలు సహా ప్రతి వర్గం సంక్షేమం, అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు అమలు చేస్తోంది. నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ,  సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ, జౌళి మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, మహిళ & శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖల ద్వారా ఈ పథకాలు అమలవుతున్నాయి.

మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ప్రత్యేకంగా ఆరు గుర్తించిన మైనారిటీ వర్గాల సామాజిక-ఆర్థిక, విద్య సాధికారత కోసం దేశవ్యాప్తంగా ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, మెరిట్-కమ్-మీన్స్ ఉపకార వేతనాల పథకాలు సహా వివిధ పథకాలను అమలు చేస్తోంది. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పీఎస్‌యూ అయిన నేషనల్ మైనారిటీ డెవలప్‌మెంట్ & ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎన్‌ఎండీఎఫ్‌సీ), మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడానికి తక్కువ వడ్డీ రేటుతో విద్యా రుణాలు అందిస్తోంది. పధో పరదేశ్ పథకం కింద లబ్ధిదారులకు లభించే వడ్డీ రాయితీ ప్రయోజనాలు పరిమితంగా ఉన్నాయని; అర్హత కలిగిన మైనారిటీ వర్గాల విద్యార్థుల కోసం సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న సారూప్య పథకాలతోనూ కలిసిపోతున్నాయని గమనించడం జరిగింది. ఇలా కలిసిపోవడం, పరిమిత ప్రయోజనాలు, విద్యా రుణాలను సులభంగా పొదడం, తక్కువ వడ్డీ రేటు దృష్ట్యా, 2022-23 నుంచి పధో పరదేశ్ పథకాన్ని నిలిపివేయాలని నిర్ణయించారు. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి 20,365 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరింది. ప్రస్తుతం, పధో పరదేశ్ పథకాన్ని పునరుద్ధరించే ప్రతిపాదన లేదు.

కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ ఇవాళ లోక్‌సభలో లిఖితపూర్వక రూపంలో ఈ సమాచారాన్ని అందించారు.

 

****



(Release ID: 1943474) Visitor Counter : 154


Read this release in: English , Urdu , Punjabi , Tamil