విద్యుత్తు మంత్రిత్వ శాఖ
14వ పరిశుభ్ర ఇంధన మినిస్టీరియల్ (సిఇఎం), 8 వ మిషన్ ఇన్నొవేషన్ సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర విద్యుత్, ఎన్.ఆర్.ఇ శాఖమంత్రి ఆర్.కె. సింగ్
ఇంధన పరివర్తన దిశగా ముందుకు సాగుతున్న ఇండియాను అభినందించిన అమెరికా ఇంధన కార్యదర్శి.
తదుపరి సి.ఇ.ఎం, ఎం.ఐ మినిస్టీరియల్ సమావేశానికి, ఆతిథ్యం ఇవ్వనున్న బ్రెజిల్.
2024లో జి 20 సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్న బ్రెజిల్ ,పరిశుభ్ర ఇంధనం, వాతావరణ కార్యాచరణను మరింత వేగవంతం చేయనుంది.
Posted On:
21 JUL 2023 6:21PM by PIB Hyderabad
కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్.కె.సింగ్ అధ్యక్షతన 14 వ పరిశుభ్ర ఇంధన శాఖ మంత్రుల, 8 వ మిషన్ ఇన్నొవేషన్ సమావేశం 2023 జూలై 21న గోవాలో ప్రారంభమైంది.
30 కి పైగా దేశాల మంత్రులు , ప్రతినిధి బృందాల అధిపతులు,అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు మంత్రుల ప్రారంభ సెషన్కు హాజరయ్యారు.
మంత్రుల స్థాయి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్.కె. సింగ్ ఇంధన పరివర్తన మార్గంలో గల అవరోధాల గురించి, వాటిని అధిగమించడానికి గల మార్గాల గురించి ప్రస్తావించారు..
“ వాతావరణ మార్పులు అందరినీ కలవరపెడుతున్నాయి. దీనిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సానుకూల పాత్రను పోషించవలసి ఉంది. భారతదేశపు తలసరి కర్బన ఉద్గారాలు సుమారు 2.29 టన్నులుగా ఉండగా,ప్రపంచవ్యాప్తంగా ఇది సుమారు 6.3 టన్నులుగా ఉంది. భారతదేశ ప్రజల సాధారణ జీవనశైలి కారణంగా తలసరి ఉద్గారాలు తక్కువగా ఉన్నాయి. సుస్థిర భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని ఇంధన పరివర్తన మార్గంలో గల సవాళ్లను మనం గమనించాలి. వీటిని అధిగమించేందుకు మార్గాలను అన్వేషించి ముందుకు సాగాలి. శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించడంపైన, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపైన ఇండియా దృష్టిపెట్టింది. 2030 నాటికి మన ఇంధన అవసరాలలో 50 శాతం మేరకు, శిలాజేతర ఇంధన వనరులనుంచి భర్తీ చేసుకునేందుకు లక్ష్యంగా నిర్ణయించుకున్నాం.
2030 నాటికి 500 గిగా వాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తిచేసే లక్ష్యాన్ని మించి ఇండియా ఉత్పత్తి సాధించగలదు’ అని ఆయన అన్నారు.
మంత్రుల స్థాయి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ కేంద్ర మంత్రి ఆర్.కె.సింగ్, పరిశ్రమలు సుస్థి విధానాలను అనుసరించేలా ప్రోత్సహించేందుకు పనితీరు ప్రదర్శించు, సాధించు, వాణిజ్య కార్యకలాపాలు
నిర్వహించు (పి.ఎ.టి) పేరుతో ఒక పథకాన్ని చేపట్టిందని , దీనివల్ల ఏడాదికి 105 మిలియన్ టన్నుల మేరకు ఉద్గారాలు తగ్గడానికి దోహదపడినట్టు తెలిపారు.
“ ఇంధన పరివర్తనను వేగవంతం చేసేందుకు, మేం వివిధ పునరుత్పాదక ఇంధన వనరులు అంటే సౌర,పవన, హైడ్రోజన్ వంటి వాటి విషయంలోగల అవకాశాలను పరిశీలిస్తున్నాం. లైటింగ్ రంగంలో ఇంధన సామర్ధ్యంపైనా మేం దృష్టిపెట్టాం. ఇందుకు సంబంధించచి ఉజాలా,స్టార్ రేటింగ్, ఎల్.ఇ.డి వీధి బల్బుల పథకాలను తీసుకువచ్చాం.
ఇవి ఏడాదికి 278 మిలియన్ టన్నుల ఉద్గారాలను తగ్గిస్తున్నాయి” అని ఆయన తెలిపారు.
నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ విజయ్కుమార్ సారస్వత్ మాట్లడుతూ, మానవాళి సుస్థిర భవిష్యత్కు , శిలాజ ఇంధనాల తో సంబంధం లేని ఇంధనాలతో కూడిన ఇంధనాలకు మారాల్సిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. “ మనం ఇవాళ పరివర్తనాత్మక ప్రయాణాన్ని ప్రారంభించేందుకు ఇక్కడ సమావేశం అయ్యాం. అంతర్జాతీయంగా పరిశుభ్రమైన ఇంధనపరివర్తన, సుస్థిరత దిశగా సమష్టి కృషితో మన భవిష్యత్తును నిర్మించుకునే శక్తి మనకు ఉంది. సుస్థిర భవిష్యత్తుకు మానవాళికి మనం సుస్థిర ఇంధనాన్ని అందుబాటులో ఉండేట్టు చూడాల్సి ఉంది. మనం శిలాజ ఇంధనాలపై ఎక్కువగా ఆధారపడడం తగ్గించాలి. ఇందుకు మనం శిలాజేతర ఇంధనాల ఉత్పత్తి లేదా , పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తి పెంచాలి. కానీ ఇప్పటికీ శిలాజ ఇంధనాలదే పైచేయిగా ఉంది.మనం ఈ పరిస్థితిలో మార్పుతీసుకు రావాలి” అని ఆయన తెలిపారు.
అమెరికా ఇంధన శాఖ మంత్రి జెన్నిఫర్ ఎం. గ్రాన్ హోమ్ మాట్లాడుతూ, అంతర్జాతీయ ఇంధన పరివర్తనలో ఇండియా నాయకత్వాన్ని ప్రశంసించారు. వాతావరణ మార్పుల సవాలును ఎదుర్కొనేందుకు,
పరిశుభ్ర ఇంధన పరిష్కారాలను చేపట్టి వాటని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లేందుకు వివిధ దేశాల సమష్ఠి కృషి, ఆయా దేశాల భాగస్వామ్యాన్ని కూడా ఆమె ప్రశంసించారు.
ఇంధన పరివర్తనలో ఇండియా ప్రముఖంగా ముందుందని, పరిశుభ్ర ఇంధనానికి సంబంధించిన చర్యలలో ఇండియా సాధించిన ప్రగతి గురించి ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు.
అన్నిదేశాలు , వ్యాపార సంస్థలు, అన్ని నగరాలు, సంస్థలు పరిశుభ్ర ఇంధన పరిష్కారాలను ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. లక్ష్యాల సాధనకు ఇది అవసరమని చెప్పారు.
“ నెట్ జీరోలక్ష్యాన్నిసాధించడానికి అధునాతన సాంకేతికతలను వాడడం ఎంతైనా అవసరమని ఆమె అన్నారు. ఈ ఉమ్మడి లక్ష్య సాధనకు ఐక్యంగా ఉండి సాధించడం ఒక్కటేమార్గమ”న్నారు.
మిషన్ ఇన్నొవేషన్ సెక్రేరియట్ అధిపతి, డాక్టర్ ఎలనార్ వెబ్స్టర్ మాట్లాడుతూ, వాతావరణ సంక్షోభానికి స్పందించడంలో నాయకత్వ పాత్ర గురించి ప్రముఖంగా ప్రస్తావించారు.
వాతావరణ సంక్షోభ సమయంలో నాయకత్వం అనేది బాధ్యత కాదని, ఇది కీలక కార్యాచరణ అని అన్నారు. మిషన్ ఇన్నొవేషన్ అనేది, ఇతరులకు ఉదాహరణగా ఉండేలా విధానాలను అమలు జరపడమని అన్నారు.
సవాళ్ల తీవ్రతను గుర్తించేందుకు అంతర్జాతీయ స్థాయిలో సహకారం అవసరమని తెలిపారు.
బ్రెజిల్ గనులు, ఇంధన శాఖ మంత్రి అలెగ్జాండర్ సిల్వెరియా డి ఒలివీరా మాట్లాడుతూ, వచ్చే ఏడాది బ్రెజిల్ జి 20 అధ్యక్ష బాధ్యతలను చేపట్టనున్నదని, దానితోపాటుఉ ఎం.ఐ.మంత్రుల స్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఎం.ఐ. మంత్రుల స్థాయి సమావేశ నిర్వహణ బాధ్యతలను స్వీకరించనున్నట్టు ప్రకటించారు. పరిశుభ్ర ఇంధనం,వాతావరణ మార్పులపై బ్రెజిల్ ఇంధన శాఖ మంత్రి మాట్లాడుతూ, అంతర్జాతీయంగా ఇంధన పరివర్తన, సుస్థిర పునరుత్పాదక ఇంధన వనరుల దిశగా సాగుతున్న మార్పునకు బ్రెజిల్ కట్టుబడి ఉందని చెప్పారు.
పరిశుభ్ర ఇంధన పరిష్కారా ల దిశగా బ్రెజిల్ అనుసరిస్తున్న చైతన్యవంత విధానాలు , వాతావరణ మార్పులపై పోరాటంలో బ్రెజిల్ను ప్రముఖస్థానంలో నిలబెట్టాయన్నారు. “
సిఇఎం, ఎం.ఐ ఆతిథ్య బాధ్యతలను ఇండియా బ్రెజిల్కు అప్పగించనున్నందున, సిఇఎం–14, ఎం.ఐ –8 ఫోరం పరిశుభ్ర వాతావరణాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సాధించిన ప్రగతి ,సుస్థిరత
ఒక గట్టి పునాదిగా ఉండనున్నాయని ”అలెగ్జాండర్ సిల్వెరియా అన్నారు. ఈ దిశగా ఇండియా సాగించిన కృషి కి సిల్వెరియా కృతజ్ఞతలు తెలిపారు.
అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) ఎక్జిక్యూటివ్ డైరక్టర్ డాక్టర్ ఫతిహ్ బిరోల్, అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ(IRENA) డైరక్టర్ జనరల్ ఫ్రాన్సెస్కో లా కామెరా,
ఐక్యరాజ్య సమితి ఇంధన సహ అధ్యక్షులు, అందరికీ సుస్థిర ఇంధనానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి సెక్రటరీజనరల్ ప్రత్యేక ప్రతినిధి, సిఇఒ శ్రీమతి దాఇలోలా ఒగున్బియి,
అంతర్జాతీయ సౌర కూటమి(ISA) డైరక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ మాథుర్లు పరిశుభ్ర ఇంధనానికి సంబంధించిన మంత్రుల ప్రారంభ సమావేశంలో తమ అభిప్రాయాలను తెలియజేశారు.
పరిశుభ్ర ఇంధనానికి సంబంధించిన మంత్రుల సమావేశం 29 దేశాలతో కూడిన ఉన్నతస్థాయి అంతర్జాతీయ వేదిక. ఇది పరిశుభ్ర ఇంధన సాంకేతికతకు సంబంధించిన కార్యకలాపాలు, విధానాను ప్రోత్సహించేందుకు నిర్దేశించినది.
అలాగే అంతర్జాతీయంగా పరిశుభ్ర ఇందన ఆర్ధిక వ్యవస్థకు పరివర్తనను ప్రోత్సహిస్తుంది. మరోవైపు మిషన్ ఇన్నొవేషన్ (MI) అనేది, 23 దేశాలు, యూరోపియన్ కమిషన్ చేపట్టిన కార్యక్రమం. యూరోపియన్ కమిషన్ యూరోపియన్ యూనియన్ తరఫున తన బాధ్యతలు నిర్వహిస్తుంది. ఈ మిషన్, పరిశుభ్ర ఇంధన విప్లవాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడమే కాక, పారిస్ ఒప్పంద లక్ష్యాలు, నెట్ జీరోలక్యాల సాధనను వేగవంతం చేస్తుంది.
సిఇఎ, ఎం.ఐ వెబ్ సైట్‌లను ఇక్కడ చూడవచ్చు.: https://www.cem-mi-india.org/.
***
(Release ID: 1941679)
Visitor Counter : 195