వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గర్వి గుజరాత్ భవన్‌లో ‘ఒక జిల్లా ఒక ఉత్పత్తి’ వాల్‌ను ప్రారంభించిన డీపీఐఐటీ, గుజరాత్ ప్రభుత్వం


గుజరాత్‌ హస్తకళలు, కళాకారులను ప్రోత్సహించేందుకు సహకారం

Posted On: 20 JUL 2023 3:08PM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్యం & పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పరిశ్రమలు & అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహ విభాగం (డీపీఐఐటీ) ప్రారంభించిన ‘ఒక జిల్లా ఒక ఉత్పత్తి’ (ఓడీఓపీ) కార్యక్రమంలో భాగంగా, గుజరాత్‌ ప్రభుత్వ సహకారంతో, దిల్లీలోని గర్వి గుజరాత్ భవన్‌లో ‘ఒక జిల్లా ఒక ఉత్పత్తి’ వాల్‌ ప్రారంభించారు. గుజరాత్‌ రాష్ట్రంలోని హస్తకళలు, కళాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో దీనిని ఆవిష్కరించారు. డీపీఐఐటీ సంయుక్త కార్యదర్శి శ్రీమతి మన్మీత్ నందా, గుజరాత్ ఆర్థిక శాఖ రెసిడెంట్ కమిషనర్ & సెక్రటరీ (ఆర్థిక వ్యవహారాలు) శ్రీమతి ఆర్తి కన్వర్ ఈ రోజు ఓడీఓపీ వాల్‌ను సంయుక్తంగా ప్రారంభించారు.

33 జిల్లాలున్న గుజరాత్, విస్తారమైన భౌగోళిక ప్రాంతానికి, విభిన్న ఉత్పత్తులకు నిలయం. ఓడీఓపీ-గుజరాత్‌లో గమ్తి బ్లాక్ ప్రింట్, మాతా-ని-పచెడి వంటి సాంప్రదాయ హస్తకళల నుంచి వేరుశనగ, జీలకర్ర వంటి వ్యవసాయ ఉత్పత్తుల వరకు 68 ప్రత్యేకత కలిగిన ఉత్పత్తులను ప్రదర్శించారు.

ఉత్పత్తులకు ట్యాగింగ్ కోసం గుజరాత్ ప్రభుత్వంతో ఓడీఓపీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనివల్ల గుజరాత్‌ ప్రత్యేక ఉత్పత్తులకు ప్రచారం, గుర్తింపు పెరుగుతుంది. ఓడీఓపీ-గుజరాత్‌ వైపు వినియోగదార్లను ఆకర్షించడం, అమ్మకాలు పెంచడం, గుజరాత్ ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించడం ఈ భాగస్వామ్యం లక్ష్యం.

ఓడీఓపీ కార్యక్రమాల్లో భాగంగా, మార్కెట్ ఉనికిని పెంచుకునేలా నిర్దిష్ట ఉత్పత్తులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఉదాహరణకు, సుజని హ్యాండ్లూమ్, జామ్‌నగర్ బంధిని, పటాన్ పటోలా కోసం ప్రభుత్వ 'ఇ-మార్కెట్‌ప్లేస్ (జీఈఎం) ఆన్‌బోర్డింగ్ డ్రైవ్‌'లు నిర్వహించారు. ఖంబత్ జిల్లాలో అగేట్ స్టోన్, భరూచ్ జిల్లాకు చెందిన సుజని కోసం 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్' (ఎఐడీ) మద్దతు ఇస్తోంది.

దేశంలోని అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందేలా చూడడం ద్వారా దేశం, ప్రజలు స్వావలంబన సాధించాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను క్షేత్ర స్థాయిలో అమలు చేయడం ఓడీఓపీ కార్యక్రమం లక్ష్యం. ఈ కార్యక్రమంలో భాగంగా, ప్రతి జిల్లా నుంచి ఒక ప్రత్యేకమైన ఉత్పత్తిని ఎంపిక చేస్తారు. దానికి గుర్తింపు కల్పించి ప్రచారం చేస్తారు. దీనివల్ల, దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లోని చేనేత, హస్తకళలు సహా వివిధ రకాల ఉత్పత్తులు జాతీయ స్థాయిలో గుర్తింపు సాధిస్తాయి. ఈ లక్ష్యాన్ని మెరుగ్గా సాధించేలా పెద్ద సంఖ్యలో వినియోగదార్లను ఆకర్షించడం కోసం, ఇదే మార్గంలో పని చేస్తున్న ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో ఓడీఓపీ బృందం కలిసి పని చేస్తోంది.

***


(Release ID: 1941183) Visitor Counter : 167