శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంత ఆధునిక స్టీల్ రోడ్ టెక్నాలజీ అభివృద్ధి.. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


ఉక్కు కర్మాగారాల నుంచి వెలువడే వ్యర్థాలను రహదారుల నిర్మాణంలో ఉపయోగించడానికి వీలు కల్పించే విప్లవాత్మక స్టీల్ స్లాగ్ రోడ్ టెక్నాలజీని అభివృద్ధి చేసిన సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎస్ఐఆర్)
1952లో ఏర్పాటైన సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎస్ఐఆర్)

వ్యర్ధాల నుంచి సంపద సృష్టించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు కు అనుగుణంగా స్టీల్ స్లాగ్ టెక్నాలజీ అభివృద్ధి .. డాక్టర్ జితేంద్ర సింగ్

పర్యావరణం పై ఉక్కు కర్మాగారాల వ్యర్ధాలు చూపిస్తున్న దుష్ప్రభావాన్ని నూతన సాంకేతిక పరిజ్ఞానం తగ్గిస్తుంది.. డాక్టర్ జితేంద్ర సింగ్

దేశ భౌగోళిక పరిస్థితులకు తగినట్టుగా ఉండే స్టీల్ స్లాగ్ రోడ్ల జీవిత కాలం మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. నిర్మాణం వ్యయం 30% వరకు తగ్గుతుంది.. డాక్టర్ జితేంద్ర సింగ్

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశంలో రహదారుల విస్తీర్ణం గత తొమ్మిది సంవత్సరాల కాలంలో 59% పెరిగి 145 లక్షల కిలోమీటర్లకు చేరింది. . అమెరికా తర్వాత ప్రపంచంలో అత్యంత ఎక్కువ విస్తీర్ణంలో రహదారులు గల దేశంగా భారతదేశం గుర్తింపు పొందింది.. డాక్టర్ జితేంద్ర

Posted On: 17 JUL 2023 6:23PM by PIB Hyderabad

ప్రపంచంలోనే అత్యంత ఆధునిక  స్టీల్ రోడ్ టెక్నాలజీ ని భారతదేశం అభివృద్ధి చేసిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక,సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్, అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత)  డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. 1952 నుంచి న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎస్ఐఆర్) నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసిందని మంత్రి ఈరోజు వెల్లడించారు. ఉక్కు కర్మాగారాల నుంచి వెలువడే వ్యర్థాలను  రహదారుల నిర్మాణంలో ఉపయోగించడానికి వీలు కల్పించే   విప్లవాత్మక స్టీల్ స్లాగ్ రోడ్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో సీఎస్ఐఆర్ విజయం సాధించిందన్నారు. 

2022 జూన్ నెలలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గుజరాత్‌లోని సూరత్ లో పారిశ్రామిక వ్యర్థాలు ఉపయోగించి మొట్టమొదటిసారిగా రహదారి నిర్మాణం జరిగిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్,  సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కలిసి ప్రాజెక్టు అమలు చేశాయన్నారు. నీతి ఆయోగ్, ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ (హజీరా) ప్రాజెక్టు నిర్మాణంలో  సహకారం అందించాయని మంత్రి తెలిపారు. 

 ఉక్కు తయారీ ప్రక్రియలో ధాతువు నుండి కరిగిన మలినాలతో స్లాగ్ తయారవుతుంది.

వ్యర్ధాల నుంచి సంపద సృష్టించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు కు అనుగుణంగా స్టీల్ స్లాగ్ టెక్నాలజీ అభివృద్ధి చెందిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ' వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి  ఉక్కు కర్మాగారాల నుంచి వెలువడే వ్యర్థాలను  రహదారులను నిర్మించడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించడానికి అవకాశం కలుగుతుంది. ఉక్కు కర్మాగారాల నుంచి వెలువడే పారిశ్రామిక వ్యర్థాలు భూసారాన్ని దెబ్బ తీస్తాయి. రహదారి నిర్మాణంలో పారిశ్రామిక వ్యర్థాలు ఉపయోగించడానికి వీలు కల్పించే అనేక విధానాలను సీఎస్ఐఆర్ రూపొందించి, అభివృద్ధి చేసిందన్నారు. 

ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ (హజీరా) నుంచి వెలువడిన స్లాగ్ (పారిశ్రామిక వ్యర్థాలు) ఉపయోగించి ప్రయోగాత్మకంగా నిర్మించిన ఆరు లైన్ల రహదారి అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకుంది.  వేలాది భారీ ట్రక్కులు రహదారిపై ఎలాంటి సమస్య లేకుండా రహదారిపై ప్రయాణించాయని మంత్రి వివరించారు. సహజ కంకర తో నిర్మించిన రహదారి  కంటే ఉపరితలం 30% లోతు తక్కువగా ఉంది.

భారతదేశం-చైనా సరిహద్దు ప్రాంతం వెంబడి అరుణాచల్ ప్రదేశ్‌లో దీర్ఘకాలం మన్నే విధంగా  భారీ-డ్యూటీ రహదారిని నిర్మించడానికి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO)  స్టీల్ స్లాగ్‌ను ఉపయోగించింది. స్టీల్ స్లాగ్ ను టాటా స్టీల్ లిమిటెడ్ ఉచితంగా సరఫరా చేసింది.  జంషెడ్‌పూర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్‌కు భారత రైల్వేలు  ఉచితంగా  స్టీల్ స్లాగ్ ను రవాణా చేశాయి.జాతీయ రహదారి 66 (ముంబై-గోవా)లో స్లాగ్ రోడ్ టెక్నాలజీ ని దేశంలో అతిపెద్ద రహదారి నిర్మాణ సంస్థగా గుర్తింపు పొందిన  నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా స్టీల్  విజయవంతంగా పరీక్షించింది.

ఈరోజు  సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ని  డాక్టర్ జితేంద్ర సింగ్ సందర్శించారు. స్టీల్ స్లాగ్ రోడ్డు నిర్మాణ ఖర్చు దాదాపు  30% తక్కువగా ఉంటుంది. అన్ని వాతారణ పరిస్థితులను తట్టుకుని ఈ రహదారులు  ఎక్కువ కాలం  వినియోగంలో వుంటాయని మంత్రి వివరించారు. 

" తారు ఉపయోగించి వేసే రోడ్లు జీవిత కాలం మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు ఉంటుంది.  స్టీల్ స్లాగ్ రోడ్డు జీవిత కాలం పది సంవత్సరాల వరకు ఉంటుంది. దీనివల్ల నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. స్టీల్ స్లాగ్ ఉపయోగించి   సూరత్‌లో నిర్మించిన రహదారి సముద్ర వాతావరణాన్ని ఎదుర్కొంటుందని వెల్లడయింది. చలి, మంచు, కుండపోత వర్షాలు ఉండే  హిమాలయ భూభాగంలో నిర్మించిన స్టీల్ స్లాగ్ రోడ్లు ఎక్కువ కాలం మన్నికలొ ఉన్నాయని తేలింది " అని మంత్రి  చెప్పారు.

భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారు. ప్రతి టన్ను ఉక్కు ఉత్పత్తికి దాదాపు 200 కిలోల స్టీల్ స్లాగ్ ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి.  దేశంలో స్టీల్ స్లాగ్ (ఘన వ్యర్థాలు)ఉత్పత్తి సంవత్సరానికి 19 మిలియన్ టన్నులుగా ఉంది  2030 నాటికి 60 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని అంచనా.  భారీగా వెలువడుతున్న ఘన వ్యర్థాలు ఉక్కు స్లాగ్ ఉక్కు కర్మాగారాలు, వాటి  చుట్టుపక్కల పెద్ద మట్టిదిబ్బలుగా పేరుకుపోయి గాలి, నీరు,భూమిని కలుషితం చేస్తున్నాయి.  ప్రాసెస్ చేయబడిన స్టీల్ స్లాగ్  రూపంలో రహదారి నిర్మాణంలో వాడే  సహజ కంకరకు ప్రత్యామ్నాయంగా తక్కువ  ఖర్చుతో ఉపయోగించడానికి అవకాశం కలుగుతుంది. 

సీఎస్ఐఆర్, ఉక్కు మంత్రిత్వ శాఖ, రహదారులు, జాతీయ రహదారులు, పట్టణాభివృద్ధి , గ్రామీణ అభివృద్ధి, జాతీయ రహదారుల సంస్థ లు నీతి ఆయోగ్ తో కలిసి  వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల మధ్య మరింత సమన్వయం సాధించి పనిచేయాలని డాక్టర్ జితేంద్ర సింగ్ సూచించారు.  వనరులనుసమీకరణపై దృష్టి సారించాలన్నారు.  టాటా స్టీల్, ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా, జేఎస్ డబ్ల్యు, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ వంటి ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన కర్మాగారాలతో ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐటీలు కలిసి పనిచేసి మరిన్ని నూతన ఆవిష్కరణల కోసం కృషి చేయాలన్నారు. 

“రోడ్డు నిర్మాణ కార్యక్రమాలను ఎక్కువ చేయాలి.  మార్కెట్‌కి చేరుకున్న తర్వాత  పరిశ్రమతో సమన్వయం సాధించాలి. ఉత్పత్తులను  పరిశ్రమ విక్రయిస్తుంది. దీనికోసం  తమను తాము ప్రచారం చేసుకోవాలి, ”అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 

గత తొమ్మిదేళ్లలో దాదాపు 50,000 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది.  అయితే 2014 నుండి నిర్మాణ వేగం పుంజుకుంది. రోజుకు నిర్మిస్తున్న రహదారుల విస్తీర్ణం 12 నుంచి 29 కిలోమీటర్లకు  పెరిగింది. ఈ సంవత్సరం మేలో 100 గంటల వ్యవధిలో భారతదేశం 112.5 లేన్ కిలోమీటర్ల పొడవునా తారు రోడ్లను  కాంక్రీటును వేయడం ద్వారా ఒక మైలురాయిని సాధించింది.

“భారతదేశంలో 1.45 లక్షల కి.మీ పొడవునా జాతీయ రహదారుల వ్యవస్థ ఉంది. అమెరికా   తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద జాతీయ రహదారుల వ్యవస్థ కలిగిన దేశంగా భారతదేశం గుర్తింపు పొందింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో గత తొమ్మిది సంవత్సరాల కాలంలో రహదారుల నిర్మాణం  59 శాతం పెరిగింది.  దేశంలో జాతీయ రహదారి  2022 ఆగస్టు లో 419 కిలోమీటర్ల ఉండగా  2023 జనవరి నాటికి రహదారుల 1,029 కిలోమీటర్లకు పెరిగింది." అని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. 

 పర్యటనలో భాగంగా డాక్టర్ జితేంద్ర సింగ్ సీఎస్ఐఆర్   ‘వన్ వీక్ వన్ ల్యాబ్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 'వన్ వీక్ వన్ ల్యాబ్' కార్యక్రమంలో పాల్గొన్న  విద్యార్థులతో మంత్రి మాట్లాడారు. 

రవాణా వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  శక్తిని ఉపయోగించుకునే ఏఐ  మిషన్ ప్రాజెక్ట్ కోసం పిలానిలోని సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ తో సీఎస్ఐఆర్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని   డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు. ఈ పర్యటనలో, ఎత్తైన ప్రాంతాలలో రోడ్ల నిర్మాణానికి ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ కోల్డ్ మిక్సర్-కమ్-పేవర్ , పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లను త్వరగా, పొదుపుగా మరమ్మతులు చేయడానికి వీలు కల్పించే ప్యాచ్ ఫిల్-పాటోల్ రిపేర్ మెషీన్‌ను మంత్రి పరిశీలించారు. .

 

***

 



(Release ID: 1940370) Visitor Counter : 140