ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జిఎస్‌టి మండలి 50వ సమావేశం సిఫారసులు


క్యాసినో.. గుర్రపు పందాలు.. ఆన్‌లైన్ గేమింగ్ల పూర్తి
ముఖ విలువపై ఏకరీతిన 28 శాతం పన్ను విధింపు;

జిఎస్‌టి అప్పిలేట్ ట్రిబ్యునల్ 01.08.2023 నుంచి
అమలయ్యేలా నోటిఫికేషన్ ఇవ్వాలని కేంద్రానికి సూచన;

కేన్సర్... ఇతర అరుదైన వ్యాధుల సంబంధిత మందులతోపాటు ప్రత్యేక వైద్య అవసరాలకు వాడే ఆహార ఉత్పత్తులకు వస్తుసేవల పన్ను మినహాయింపు;

నాలుగు ఉత్పత్తులు- ఉడికించని/వేయించని/ఎక్స్‌ట్రూడెడ్ చిరుతిండి
గుళికలు.. సాల్యుబుల్ ఫిష్ పేస్ట్.. బ్లాస్ట్ ఫర్నేస్ శ్లాగ్‌తో సమానమైన
ఎల్‌డి శ్లాగ్.. అనుకరణ జరీదారంపై పన్ను 18 నుంచి 5 శాతానికి తగ్గింపు;

జిఎస్‌టి నియమ-నిబంధనల అనుసరణ విధానాల క్రమబద్ధీకరణ

Posted On: 11 JUL 2023 9:18PM by PIB Hyderabad

   స్తుసేవల పన్ను (జిఎస్‌టి) మండలి 50వ సమావేశం ఇవాళ ఇక్కడ కేంద్ర ఆర్థిక-కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ మైలురాయి సమావేశానికి సంకేతంగా గౌరవనీయ కౌన్సిల్ సభ్యుల సమక్షాన ‘జిఎస్‌టి మండలి పయనంలో 50 అడుగులు’ పేరిట రూపొందించిన లఘు చిత్రాన్ని చైర్‌పర్సన్‌ హోదాలో మంత్రి ఆవిష్కరించారు. జిఎస్‌టి మండలి ఏర్పాటు నుంచి ఇప్పటిదాకా సాగించిన ప్రయాణాన్ని ఈ లఘు చిత్రం వివరిస్తుంది. దీన్ని ఆంగ్లం, హిందీ సహా 11 ప్రాంతీయ భాషలలో రూపొందించారు. దీంతోపాటు మండలి చైర్‌పర్సన్, సభ్యులకు ఢిల్లీలోని చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఒక ప్రత్యేక కవర్‌ సహా ప్రత్యేకంగా ముద్రించిన ‘మై స్టాంప్’ తొలి సెట్‌ను కూడా అందజేశారు.

   జిఎస్‌టి మండలి 50వ సమావేశం సందర్భంగా వస్తుసేవల పన్ను శాతాల్లో మార్పులు, వాణిజ్య సౌలభ్యంతోపాటు జిఎస్‌టి క్రమబద్ధీకరణ దిశగా చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి మండలి సిఫారసులు కిందివిధంగా ఉన్నాయి:

జిఎస్‌టి పన్ను శాతాల్లో మార్పులు:

  1. వస్తువులపై జిఎస్‌టి శాతాలకు సంబంధించి సిఫారసులు

ఎ. వస్తువులపై జిఎస్‌టి పన్ను శాతాల్లో మార్పులు

  1. పేరుతో నిమిత్తం లేకుండా ఉడికించని/వేయించని గుళికల రూపంలోని చిరుతిండి పదార్థాలపై పన్ను 5 శాతానికి తగ్గింపు; అలాగే వీటికి సంబంధించి మునుపటి సరుకుమీద జిఎస్‌టి చెల్లింపు క్రమబద్ధీకరణను ‘ఎలా ఉన్నది అలా’ ప్రాతిపదికన చేపట్టాలి.

బి. వస్తువులకు సంబంధించి ఇతరత్రా మార్పులు

1. వ్యక్తిగత వినియోగం కోసం దిగుమతి చేసుకునే ‘డైనుటక్సిమాబ్ (ఖార్జిబా) ఔషధానికి జిఎస్‌టి నుంచి మినహాయింపు.

2. ప్రస్తుత నిబంధనలకు అనుగుణంగా అరుదైన వ్యాధుల జాతీయ విధానం-2021 కింద నిర్దేశించిన అరుదైన వ్యాధుల చికిత్సకు వాడే మందులు, ప్రత్యేక వైద్య అవసరాల కోసం వినియోగించే ఆహారం (ఎఫ్‌ఎస్‌ఎంపి)పై ఐజీఎస్టీ మినహాయింపు; వీటిని వ్యక్తిగత ఉపయోగం కోసం దిగుమతి చేసుకున్నప్పుడు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది. అలాగే వ్యక్తులతోపాటు అరుదైన వ్యాధుల చికిత్స కేంద్రాలు లేదా గుర్తించబడిన ప్రత్యేక సంస్థల సిఫారసు మేరకు ఆయా కేంద్రాలు స్వయంగా ‘ఎఫ్‌ఎస్‌ఎంపి’ని దిగుమతి చేసుకున్నప్పుడు కూడా ఐజీఎస్టీ మినహాయింపు వర్తిస్తుంది.

3. వ్యవసాయదారులు సహకార సంఘాలకు కాలా (సేంద్రియ) పత్తిసహా ముడి పత్తి  సరఫరా చేసినపుడు ‘రివర్స్ ఛార్జ్ మెకానిజం’ కింద పన్ను విధించబడుతుందని, గత కాలం సంబంధిత అంశాలను “ఎలా ఉన్నది అలా” ప్రాతిపదికన క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది.

4. వ్యాపార పరిభాషలో ఏ పేరుతో వ్యవహరించినప్పటికీ అనుకరణ జరీదారం లేదా నూలుపై పన్నును 12 నుంచి 5 శాతానికి తగ్గించాలని, గతకాలపు లావాదేవీలపై పన్ను చెల్లింపును “ఎలా ఉన్నది అలా” ప్రాతిపదికన క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది.

5. యుటిలిటీ వాహనాలను ఏ పేరుతో వ్యవహరించినప్పటికీ అవి 4000 మిల్లీ మీటర్లకన్నా ఎక్కువ పొడవు, 1500 సిసి మించిన ఇంజన్ సామర్థ్యం, 170 మిల్లీ మీటర్లు/అంతకన్నా ఎక్కువ ‘గ్రౌండ్ క్లియరెన్స్’ కలిగి ఉంటే అలాంటి వాహనాలన్నిటికీ వర్తించేలా పరిహారం సెస్ నోటిఫికేషన్‌లోని ఎంట్రీ ‘52బి’ని సవరించాలని నిర్ణయించింది. ‘గ్రౌండ్ క్లియరెన్స్’ను ‘లోడు లేని స్థితి’ ప్రాతిపదికన పరిగణించాలని స్పష్టం చేసింది.

6. ‘ఎల్‌డి శ్లాగ్‌’ వినియోగాన్ని ప్రోత్సహించడంతోపాటు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈ ఉత్పత్తిపై పన్నును 18 నుంచి 5 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది.

7. వాస్తవిక వివరణాత్మక అంశాల దృష్ట్యా 18.07.2022కి ముందు కాలానికిగాను  గాయం, వెన్నెముక, ఆర్థోప్లాస్టీ ఇంప్లాంట్‌ సంబంధిత అంశాలను “ఎలా ఉన్నది అలా” ప్రాతిపదికన క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది.

8. సాల్యుబుల్‌ ఫిష్‌ పేస్ట్‌పై పన్నును 18 నుంచి 5 శాతానికి తగ్గించడంతోపాటు గత కాలపు పన్ను చెల్లింపు అంశాన్ని “ఎలా ఉన్నది అలా” ప్రాతిపదికన క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది.

9. ఎండు కొబ్బరికి సంబంధించి వాస్తవిక వివరణాత్మక అంశాల దృష్ట్యా 1.7.2017 నుంచి 27.7.2017 వరకు “ఎలా ఉన్నది అలా” ప్రాతిపదికన క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది.

10. చట్టబద్ధంగా చిల్లర విక్రయ ధర ప్రకటించాల్సిన అవసరం లేని పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులు తదితరాలపై పరిహారం సెస్ విధింపు ఆదేశాల జారీలో 2023 మార్చి 31న వర్తించే మునుపటి ‘యాడ్ వెలోరమ్’ శాతాన్ని ప్రకటించవచ్చునని నిర్ణయించింది.

11. బంగారం, వెండి లేదా ప్లాటినం దిగుమతులపై ఐజీఎస్టీ మినహాయింపు పొందుతున్న నిర్దిష్ట బ్యాంకుల జాబితాలో ‘ఆర్‌బిఎల్‌’ బ్యాంకు, ‘ఐసిబిసి’ బ్యాంకులను చేర్చాలని, విదేశీ వాణిజ్య విధానం-2023 అనుబంధం ‘4బి’ (హెచ్‌బిపి)కి అనుగుణంగా ఐజీఎస్టీ మినహాయింపు అర్హతగల బ్యాంకులు/సంస్థల జాబితాను నవీకరించాలని నిర్ణయించింది.

12. కొత్త విదేశీ వాణిజ్య విధానం-2023 నేపథ్యంలో పరిణామాలకు అనుగుణంగా నోటిఫికేషన్లలో మార్పులు చేయవచ్చు.

13. పోకచెట్టు ఆకులతో 01.10.2019కి ముందు తయారుచేసిన ప్లేట్లు, కప్పులపై జిఎస్‌టి సంబంధిత అంశాలను క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది.

14. బయోమాస్ దిమ్మెలపై 01.7.2017 నుంచి 12.10.2017 వరకు జిఎస్‌టి విధింపు సంబంధిత అంశాలను క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది.

  1. సేవలపై జిఎస్‌టి శాతాలకు సంబంధించి సిఫారసులు

ఎ. సేవలపై జిఎస్‌టి పన్ను శాతాల్లో మార్పులు

1.    ఉపగ్రహ ప్రయోగ సేవలపై ఇస్రో, యాంట్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐఎల్) సంస్థలకు ఇస్తున్న జిఎస్‌టి మినహాయింపును అదేతరహా సేవలందించే ప్రైవేట్ రంగ సంస్థలకూ వర్తింపజేయాలని, అలాగే ఈ రంగంలో అంకుర సంస్థలను ప్రోత్సహించాలని నిర్ణయించింది.

బి. సేవలకు సంబంధించి ఇతరత్రా మార్పులు

సేవలు

1.   వాణిజ్యహిత చర్యల్లో భాగంగా ‘జిటిఎ’లు ఫార్వర్డ్‌ ఛార్జ్ కింద జిఎస్‌టి చెల్లించేందుకు ఏటా డిక్లరేషన్ సమర్పించాల్సిన అవసరం లేదని సమావేశం నిర్ణయించింది. ఏదైనా నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో ఈ వెసులుబాటును వాడుకుంటే, (తాము రివర్స్ ఛార్జ్ మెకానిజం-‘ఆర్‌సిఎం’కి తిరిగి వెళ్తామని డిక్లరేషన్‌ దాఖలు చేయని పక్షంలో) తదుపరి సంవత్సరాల్లోనూ ఇదే పద్ధతిని ఆ సంస్థలు అనుసరిస్తున్నట్లు పరిగణించబడుతుంది.

2.   అలాగే ‘జిటిఎ’లు ఫార్వర్డ్‌ ఛార్జ్ కింద జిఎస్‌టి చెల్లించేందుకు చివరి తేదీగా మార్చి 15కు బదులు మునుపటి ఆర్థిక సంవత్సరం మార్చి 31గా నిర్ణయించింది. ఈ వెసులుబాటును వాడుకునేందుకు మునుపటి ఆర్థిక సంవత్సరం జనవరి 1 ప్రారంభ తేదీగా ఉంటుంది.

3.   ఏదైనా కంపెనీ లేదా కార్పొరేట్‌ సంస్థ శాఖ డైరెక్టర్‌ ప్రైవేటుగా లేదా వ్యక్తిగత హోదాలో సదరు కంపెనీకి లేదా కార్పొరేట్‌ సంస్థ శాఖకు స్థిరాస్తిని అద్దెకివ్వడం వంటి సేవలందిస్తే వాటిపై ‘ఆర్‌సిఎం’ కింద పన్ను విధించబడదని వివరణ ఇస్తూ సమావేశం నిర్ణయించింది. అయితే, 28.06.2017 నాటి నోటిఫికేషన్ నంబర్ 13/2017-CTR (Sl. No. 6) ప్రకారం సదరు డైరెక్టర్‌ ఆ హోదాలో లేదా వ్యక్తిగతంగా అందించిన సేవలకు మాత్రమే ‘ఆర్‌సిఎం’ కింద పన్ను విధించబడుతుందని స్పష్టం చేసింది.

4.   సినిమా హాళ్లలో ఆహారం, పానీయాల సరఫరాను రెస్టారెంట్‌ సేవగా పరిగణించి (ఎ) సేవ ద్వారా లేదా అందులో భాగంగా సరఫరా చేసినంత కాలం పన్ను విధించబడుతుందని స్పష్టం చేస్తూ సమావేశం నిర్ణయం ప్రకటించింది. అదేవిధంగా…

(బి) సినిమా ప్రదర్శన సేవలో భాగంగా స్వతంత్రంగా సరఫరా చేయబడినప్పుడు.. అంటే-  టికెట్ల విక్రయంతోపాటు ఆహారం, పానీయాల సరఫరా మిశ్రమ సరఫరాగా పరిగణనలోకి  వచ్చేవిధంగా పరస్పరం ముడిపడి ఉంటే, సినిమా ప్రదర్శన సేవసహా సరఫరా సూత్రం ప్రాతిపదికన ఈ సేవలన్నిటిపైనా వర్తించే శాతంతో పన్ను విధించబడుతుంది.

  1. క్యాసినోలు.. రేస్ కోర్సులు.. ఆన్‌లైన్ గేమింగ్‌పై మంత్రుల బృందం (జిఎం) రెండో నివేదిక

   క్యాసినోలు, గుర్రపు పందాలు, ఆన్‌లైన్ గేమింగ్‌పై పన్ను విధింపు సంబంధిత అంశాల పరిశీలన కోసం మంత్రుల బృందం (జిఒఎం) ఏర్పాటు చేయబడింది. ఈ బృందం 2022 జూన్‌ నెలలో తన తొలి నివేదికను సమర్పించగా దాన్ని జిఎస్‌టి మండలి 47వ సమావేశం ముందుంచారు. అయితే, దీన్ని ‘జిఒఎం’ పునఃపరిశీలించాలని సమావేశం నిర్ణయించింది. తదనుగుణంగా ‘జిఒఎం’ తన రెండో నివేదికను సమర్పించగా, దాన్ని ప్రస్తుత 50వ జిఎస్‌టి మండలి సమావేశం ముందుంచారు. ఆన్‌లైన్ గేమింగ్, గుర్రపు పందాలు, క్యాసినోల కార్యకలాపాల్లో పందెం పూర్తి ముఖ విలువ లేదా ‘జిజిఆర్‌’పై 28 శాతం పన్ను విధింపు విషయంలో తమకు ఏకాభిప్రాయం కుదరలేదని పేర్కొంది. అందువల్ల ఈ అంశంలో మండలి నిర్ణయం తీసుకోవచ్చునని సిఫారసు చేసింది. ఈ మేరకు మండలి దీనిపై చర్చించి కింది సిఫారసులు చేసింది:

  • ఆన్‌లైన్ గేమింగ్, గుర్రపు పందాలను షెడ్యూల్-IIIలో పన్ను విధించదగిన క్లెయిమ్‌లుగా చేర్చడానికి వీలుగా చట్టాన్ని తగినవిధంగా సవరించాలి.
  • క్యాసినో, ఆన్‌లైన్ గేమింగ్, గుర్రపు పందాలు మూడింటిపైనా 28 శాతం ఏకరీతి పన్ను విధించాలి.
  • కాసినోలలో కొనుగోలు చేసే చిప్‌ల పూర్తి ముఖ విలువపైన, గుర్రపు పందాల్లో బుక్‌మేకర్/టోటలైజేటర్‌తో పెట్టిన పందెం పూర్తి ముఖ విలువపైనా, ఆన్‌లైన్‌ గేమింగ్‌ విషయంలో పందెపు మొత్తం పూర్తి ముఖ విలువపైనా పన్ను వర్తిస్తుంది.

వాణిజ్య సౌలభ్యం దిశగా చర్యలు:

  1. వస్తుసేవల పన్ను (జిఎస్‌టి) అప్పిలేట్ ట్రైబ్యునల్ (అధ్యక్షుడు, సభ్యుల నియామకం-షరతులు) నిబంధనలు-2023: ప్రతిపాదిత పునర్విచారణ ధర్మాసనం (అప్పిలేట్‌ ట్రైబ్యునల్) ఏర్పాటు, విధి నిర్వహణ సజావుగా సాగేందుకు వీలుగా అధ్యక్ష, సభ్యుల నియామకాన్ని నియంత్రించే నియమనిబంధనలను మండలి సిఫారసు చేసింది. అలాగే జిఎస్‌టి అప్పిలేట్ ట్రైబ్యునల్‌కు సంబంధించి ఫైనాన్స్ యాక్ట్-2023 నిబంధనలు 01.08.2023 నుంచి అమలులోకి వచ్చేలా నోటిఫికేషన్‌ జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. తద్వారా దీన్ని వీలైనంత త్వరగా అమలులోకి తేవచ్చునని అభిప్రాయపడింది. సీజీఎస్టీ చట్టం-2017లోని సెక్షన్ 110(4)(బి)(iii) ప్రకారం అధ్యక్ష, సభ్యుల అన్వేషణ-ఎంపిక కమిటీలో ఒక సభ్యుడుగా మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నియమించాలని మండలి సిఫారసు చేసింది. ఇక రాష్ట్ర స్థాయి ధర్మాసనాల సంఖ్య-ఏర్పాటు అంశాన్ని దశలవారీగా చేపట్టాలని నిర్ణయించింది.
  2. ఆర్థిక సంవత్సరం 2022-23 వార్షిక రిటర్నులు: ఆర్థిక సంవత్సరం 2021-22లో ‘జిఎస్‌టిఆర్‌-9’, ‘జిఎస్‌టిఆర్‌-9సి’ ఫారాల్లోని వివిధ పట్టికలకు సంబంధించి ఇచ్చిన సడలింపులను 2022-23లోనూ కొనసాగించాలని మండలి సిఫారసు చేసింది. అలాగే వార్షిక టర్నోవర్‌ రూ.2 కోట్లదాకాగల చిన్న పన్ను చెల్లింపుదారులకు చట్ట అనుసరణ భారం నుంచి ఉపశమనం దిశగా (జిఎస్‌టిఆర్‌-9/9ఎ’ ద్వారా) వార్షిక రిటర్న్ దాఖలు నుంచి మినహాయింపును 2022-23లోనూ కొనసాగించాలని సూచించింది.
  3. జిఎస్‌టి చట్టంలోని ప్రస్తుత నిబంధనల ప్రకారం మూడో పక్షం నుంచి స్వీకరించే సార్వత్రిక ఉత్పాదక సేవలపై ‘ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌’ (ఐటీసీ)ను నిర్దిష్ట వ్యక్తులకు పంపిణీ చేయడం కోసం ‘ఇన్‌పుట్ సర్వీసెస్ డిస్ట్రిబ్యూటర్’ (ఐఎస్‌డి) యంత్రాంగం  తప్పనిసరి కాదని ఒక సర్క్యులర్ ద్వారా స్పష్టం చేయాల్సిందిగా మండలి సిఫారసు చేసింది. అలాగే ఒక నిర్దిష్ట వ్యక్తి మరొక నిర్దిష్ట వ్యక్తికి అందించిన అంతర్గత ఉత్పాదక సేవలపై పన్ను విధింపు సంబంధిత అంశాలను కూడా వివరించాలని సూచించింది. మూడో పక్షం నుంచి స్వీకరించే సార్వత్రిక ఉత్పాదక సేవలపై ‘ఐటీసీ’ పంపిణీ కోసం  ‘ఐఎస్‌డి’ యంత్రాంగాన్ని తప్పనిసరి చేయాలని భావిస్తే జిఎస్‌టి చట్టాన్ని సవరించవచ్చునని మండలి సిఫారసు చేసింది.
  4. జిఎస్‌టి చెల్లింపు సంబంధిత వివిధ అంశాలపై స్పష్టత దిశగా ఒక సర్క్యులర్ జారీ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే వినియోగదారుల నుంచి ఎటువంటి ప్రతిఫలం స్వీకరించకుండా వారంటీ వ్యవధిలో విడిభాగాల మార్పిడి, మరమ్మతు సేవల సంబంధిత ఉదంతాల్లో ‘ఐటీసీ’ రద్దు బాధ్యతపైనా సర్క్యులర్‌ జారీకి సూచన చేసింది. ఆ మేరకు సదరు విడిభాగాల మార్పిడి/మరమ్మతు సేవపై తయారీదారు జిఎస్‌టి విధించే వీల్లేదు కాబట్టి ‘ఐటీసీ’ స్థాయిని మార్చాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
  5. సర్క్యులర్‌ జారీ ద్వారా స్పష్టత ఇవ్వాల్సిన వివిధ పన్ను వాపసు సంబంధిత అంశాలు:

(ఎ) సీజీఎస్టీ నిబంధనలు-2017లోని నిబంధన 36(4) సవరణ 01.01.2022 నుంచి అమలులోకి వచ్చిన నేపథ్యంలో సెక్షన్‌ 54(3) కింద పోగుపడిన ‘ఐటీసీ’ వాపసును సదరు పన్ను వ్యవధి లేదా ఏదైనా మునుపటి పన్ను వ్యవధి సంబంధిత ‘జిఎస్‌టిఆర్‌-2బి’ ఫారంలో నమోదు చేసే సరఫరాల స్వీకరణపై ‘ఐటీసీ’కి పరిమితం చేయాల్సి ఉంటుంది.

(బి) “సర్దుబాటు చేసిన మొత్తం టర్నోవర్”ను లెక్కించేటప్పుడు అందులో చేర్చాల్సిన ఎగుమతి వస్తువుల విలువను సీజీఎస్టీ నిబంధనల్లోని 89(4)కు 05.07.2022 నాటి నోటిఫికేషన్ ‘నం.14/2022- సిటి’కి అనుగుణంగా చేర్చబడిన వివరణలో పేర్కొన్న సూత్రం ప్రాతిపదికగా నిర్ణయించాలి.

(సి) వస్తువులు లేదా సేవల ఎగుమతిపై చెల్లింపు స్వీకరణ వంటి సందర్భాల్లో సీజీఎస్టీ నిబంధనలు-2017లోని 96ఎ నిబంధన నిర్దేశిత కాలపరిమితి తర్వాత వాపసు ఆమోదానికి సంబంధించి స్పష్టత ఇవ్వబడుతుంది.

  1. వస్తువులు లేదా సేవలు లేదా రెండింటి సరఫరాపై ఒకే లావాదేవీలో బహుళ ఇ-కామర్స్ సంస్థ (ఇసిఒ)ల ప్రమేయంగల సందర్భాల్లో సీజీఎస్టీ చట్టం-2017లోని సెక్షన్ 52 ప్రకారం ‘టిసిఎస్‌’ బాధ్యతపై స్పష్టీకరణ దిశగా సర్క్యులర్ జారీ చేయబడుతుంది.
  2. పన్ను చెల్లింపుదారులపై నిబంధనల అనుసరణ భారం తగ్గించడం కోసం సీజీఎస్టీ చట్టం-2017లోని 46వ నిబంధన కిందగల నియమం (ఎఫ్) సవరించబడింది. పన్ను చట్టం కింద నమోదుకాని గ్రహీతకు ‘ఇసిఒ’ద్వారా లేదా ‘ఒఐడిఎఆర్‌’ సేవల సరఫరాదారు ద్వారా పన్ను విధించదగిన సేవలను సరఫరా చేసిన సందర్భాల్లో బిల్లుపై గ్రహీత పేరు, పూర్తి చిరునామా రాయాల్సిన అవసరం లేదు. కేవలం గ్రహీత రాష్ట్రం పేరు మాత్రమే నమోదు చేస్తే సరిపోతుంది.
  3. వివిధ సమస్యలపై అస్పష్టత, చట్టపరమైన వివాదాల తొలగింపు దిశగా కింద సర్క్యులర్ల జారీ; తద్వారా పన్ను చెల్లింపుదారులకు విస్తృత ప్రయోజనం:

(ఎ) ‘టీడీఎస్‌’ ప్రయోజనానికి మాత్రమే నమోదు చేయబడిన ప్రభుత్వ విభాగాలు లేదా సంస్థలకు/ప్రభుత్వ సంస్థలు/స్థానిక/ప్రభుత్వరంగ సంస్థలు వగైరాలకు చేసిన సరఫరాలపై ఇ-ఇన్వాయిస్‌ జారీ కోసం నిర్దేశించిన పరిమితికి మించి టర్నోవర్ గల నమోదిత వ్యక్తి- సీజీఎస్టీ నిబంధనలలోని 48(4) నియమం ప్రకారం ఇ-ఇన్వాయిస్‌ జారీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేయబడింది.

(బి) తప్పుగా పొందిన-వినియోగించుకున్న ఐజీఎస్టీ క్రెడిట్‌ మొత్తంపై సీజీఎస్టీ చట్టం-2017లోని సెక్షన్‌ 50(3) కింద చెల్లించాల్సిన వడ్డీని లెక్కించే పద్ధతిపై స్పష్టత ఇవ్వబడింది. ఆ మేరకు ఐజీఎస్టీ క్రెడిట్‌ను తప్పుగా పొందిన సందర్భాల్లో సీజీఎస్టీ నిబంధనలు-2017లోని 88బి నిబంధన ప్రకారం- ఐజీఎస్టీ, సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ పద్దులన్నిటి కింద ఎలక్ట్రానిక్‌ క్రెడిట్‌ లెడ్జర్‌లోగల ‘ఐటీసీ’ నిల్వ మొత్తాన్నీ పరిగణనలోకి తీసుకుని వడ్డీ బకాయిని లెక్కించాల్సి ఉంటుంది.

(సి) ఒక హోల్డింగ్ కంపెనీ తన అనుబంధ కంపెనీకి చెందిన సెక్యూరిటీలను కలిగి ఉన్నంతమాత్రాన దాన్ని సేవల సరఫరాగా పరిగణించే వీల్లేదని, అందువల్ల జిఎస్‌టి కింద పన్ను విధించబడదని స్పష్టం చేయబడింది.

  1. ఆర్థిక సంవత్సరాలు 2017-18తోపాటు 2018-19లో ‘జిఎస్‌టిఆర్‌-2ఎ’ ఫారమ్ ప్రకారం అందుబాటులోగల ‘ఐటీసీ’కి, ‘జిఎస్‌టిఆర్‌-3బి’ ఫారమ్ ద్వారా పొందిన ‘ఐటీసీ’కి  మధ్య వ్యత్యాసం ఉన్నపుడు దాన్ని తనిఖీ చేసే విధానాన్ని నిర్దేశిస్తూ మండలి తన 48వ సమావేశంలో సిఫారసు చేసింది. దీనికి అనుగుణంగా నం.183/15/2022-జిఎస్‌టి’తో 2022 డిసెంబర్ 27న నోటిఫికేషన్‌ జారీ చేయబడింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు మరింత ఉపశమనం కల్పిస్తూ 01.04.2019 నుంచి 31.12.2021 మధ్యకాలానికి కూడా ‘ఐటీసీ’ ధ్రువీకరణ కోసం ‘జిఎస్‌టిఆర్‌-2ఎ’, ‘జిఎస్‌టిఆర్‌-3బి’ ఫారాల్లో నమోదైన ‘ఐటీసీ’ మొత్తాల వ్యత్యాసాన్ని తనిఖీ చేసేందుకు నాటి నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధానాన్నే పాటించేలా తాజా సర్క్యులర్‌ జారీ చేయాలని ప్రస్తుత మండలి సమావేశం సిఫారసు చేసింది.
  2. నమోదిత వ్యక్తుల ‘ట్రాన్‌-1/ ట్రాన్‌-2’ క్లెయిములపై సముచిత అధికారులు జారీచేసిన ఆదేశాలను సవాలు చేస్తూ ప్రత్యక్ష అప్పీల్ దాఖలుకు సీజీఎస్టీ చట్టం-2017లోని సెక్షన్ 148 కింద ప్రత్యేక విధానం నిర్దేశించబడుతుంది. కేంద్ర ప్రభుత్వం-ఫిల్కో ట్రేడ్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య వ్యాజ్యంలో గౌరవనీయ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఈ మేరకు నిర్ణయించింది.
  3.  నిర్దిష్ట, ప్రత్యేక పరిస్థితులలో ప్రత్యక్షంగా అప్పీలు దాఖలు చేయడం కోసం సీజీఎస్టీ నిబంధనలు-2017లోని 108(1), 109(1) నిబంధనలు సవరించబడతాయి.
  4.  ఫారమ్ ‘జిఎస్‌టిఆర్‌-4’, ‘జిఎస్‌టిఆర్‌-9’తోపాటు ‘జిఎస్‌టిఆర్‌-10’ కింద రిటర్న్‌లు దాఖలు చేయనివారికి 31.03.2023 నాటి నోటిఫికేషన్ల ద్వారా ప్రకటించిన క్షమాభిక్ష పథకాలను పొడిగించాలని, అలాగే సీజీఎస్టీ చట్టం-2017లోని సెక్షన్ 62 కింద జారీ చేసిన రిజిస్ట్రేషన్‌ రద్దు, అసెస్‌మెంట్‌ ఉపసంహరణ ఆదేశాలను 31.08.2023 వరకు నిలిపివేయాలని కూడా మండలి సిఫారసు చేసింది.
  5.  మణిపూర్‌లో ప్రస్తుత కల్లోల పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలోని నమోదిత వ్యక్తులు 2023 ఏప్రిల్, మే, జూన్‌ నెలలకుగాను దాఖలు చేయాల్సిన ఫారం ‘జిఎస్‌టిఆర్‌-1’, ‘జిఎస్‌టిఆర్‌-3బి’, ‘జిఎస్‌టిఆర్‌-7’ల సమర్పణ గడువును 31.07.2023 వరకు పొడిగించాలని మండలి సిఫారసు చేసింది.

జిఎస్‌టి నిబంధనల కట్టుబాటు క్రమబద్ధీకరణ చర్యలు:

  1. అధ్యాయం 71 కింద బంగారం/అమూల్యమైన రాళ్ల తరలింపు నిమిత్తం ఇ-వే బిల్లు జారీ నిబంధన అమలుపై మంత్రుల బృందం (జిఒఎం) సిఫారసుల మేరకు సీజీఎస్టీ చట్టం-2017లో 138ఎఫ్‌ నిబంధనను చేర్చాలని మండలి సిఫారసు చేసింది. అలాగే ఆయా రాష్ట్రాలు ఇదేవిధంగా అంతర్రాష్ట్ర తరలింపులో ఇ-వే బిల్లు జారీని అమలు తప్పనిసరి చేయడంపై ఎస్జీఎస్టీ నిబంధనలు-2017లోనూ నిబంధనను చేర్చాలని సూచించింది.
  2. సామర్థ్య ఆధారిత పన్నులు, ప్రత్యేక కంపోజిషన్‌ పథకంపై మంత్రుల బృందం (జిఒఎం) సిఫారసులను మండలి తన 49వ సమావేశంలో ఆమోదించడంతోపాటు కింది సిఫారసులు చేసింది:

(i) సీజీఎస్టీ చట్టం-2017లోని సెక్షన్ 148 ప్రకారం పొగాకు, పాన్ మసాలా, ఇతర సారూప్య వస్తు తయారీదారులు యంత్రాల నమోదు, ప్రత్యేక నెలవారీ రిటర్నుల దాఖలుకు అనుసరించాల్సిన ప్రత్యేక విధానాన్ని నిర్దేశిస్తూ నోటిఫికేషన్ జారీ;

(ii) సదరు తయారీదారులు యంత్రాలను నమోదు చేయని పక్షంలో ప్రత్యేక జరిమానా విధించేలా సీజీఎస్టీ చట్టం-2017లో సెక్షన్‌ 122ఎ జోడింపు;

(iii) ఫైనాన్స్ యాక్ట్-2021లోని సెక్షన్ 123 నిబంధనలు, ఐజీఎస్టీ చట్టంలో సెక్షన్ 16 సవరణ 01.10.2023 నుంచి అమలులోకి వచ్చేలా ఐజీఎస్టీ చట్టం-2017లోని సెక్షన్ 16(4) కింద నోటిఫికేషన్ జారీ చేయబడుతుంది. పొగాకు, పాన్ మసాలా, ఇతర సారూప్య వస్తువులుసహా మెంథా ఆయిల్ ఎగుమతులకు సంబంధించి ఐజీఎస్టీ వాపసు మార్గం పరిమితిని ఈ సవరణలు సూచిస్తాయి.

  1. రిజిస్ట్రేషన్‌కు సంబంధించి సీజీఎస్టీ నిబంధనలు-2017లో సవరణ: రిజిస్ట్రేషన్ ప్రక్రియ బలోపేతం, జిఎస్‌టి కింద నకిలీ-మోసపూరిత రిజిస్ట్రేషన్లను సమర్థంగా నిరోధించడం కోసం సీజీఎస్టీ నిబంధనలు-2017లో కింది సవరణలను మండలి సిఫారసు చేసింది:

(ఎ) రిజిస్ట్రేషన్ మంజూరు చేసిన 30 రోజుల్లోగా లేదా ఇతర ప్రదేశాలకు అమ్మకాల నివేదిక దాఖలుకు ముందు వీటిలో ఏది ముందైతే ఆ నాటికి సీజీఎస్టీ చట్టంలోని సెక్షన్ 37 కింద నమోదిత వ్యక్తి పేరు, ‘పాన్‌’, బ్యాంక్ ఖాతా వివరాలను ఫారం ‘జిఎస్‌టిఆర్‌-1/ఐఎఫ్‌ఎఫ్‌’ ద్వారా సమర్పించేలా 10ఎ నిబంధనలో సవరణ.

(బి) పైన పేర్కొన్న నిబంధన ప్రకారం నిర్దేశిత గడువులోగా ‘10ఎ నిబంధన’ ప్రకారం చెల్లుబాటయ్యే బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించని నమోదిత వ్యక్తుల రిజిస్ట్రేషన్‌ను వ్యవస్థ నిర్దేశిత పద్ధతిలో నిలిపివేయడానికి వీలుగా 21A(2ఎ) నిబంధనలో సవరణ.

(సి) నిబంధన ‘10ఎ’ కింద వ్యవస్థ నిర్దేశిత రిజిస్ట్రేషన్‌ నిలిపివేతను స్వయంచలితంగా ఉపసంహరించేలా 21ఎ(4) నిబంధనలో 3వ నియమం జోడింపు.

(డి) నిబంధన ‘10ఎ’ ప్రకారం నమోదిత వ్యక్తి చెల్లుబాటయ్యే బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించని పక్షంలో ఫారం ‘జిఎస్‌టిఆర్‌-1’ లేదా ‘ఐఎఫ్‌ఎఫ్‌’ ద్వారా ఇతర ప్రదేశాలకు అమ్మకాల నివేదిక దాఖలుపై అనుమతి నిరాకరణకు వీలు కల్పించేలా నిబంధన 59(6)కు సవరణ.

(ఇ) వ్యాపార ప్రాంగణాల ప్రత్యక్ష ధ్రువీకరణ ప్రక్రియ దరఖాస్తుదారు సమక్షంలో నిర్వహించాలనే నిబంధన తొలగింపుతోపాటు ఆధార్ ప్రామాణీకరణ ఉన్నప్పటికీ అధిక ముప్పున్న సందర్భాల్లో భౌతిక తనిఖీకి వీలు కల్పిస్తూ 9, 25 నిబంధనలకు  సవరణ.

  1.  కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ముప్పు-ఆధారిత, బయోమెట్రిక్‌ ఆధారిత ఆధార్‌ ప్రామాణీకరణ దిశగా దరఖాస్తుదారుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు. పుదుచ్చేరితోపాటు గుజరాత్ రాష్ట్రంలోనూ ఈ వ్యవస్థ సంసిద్ధతను పరీక్షించిన తర్వాత ఈ ప్రయోగంలో పాలుపంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ కూడా ఆసక్తి వ్యక్తం చేసింది.
  2. నిబంధన 88సి(3) కింద పన్నుతోపాటు వడ్డీ వసూలు విధానం: జిఎస్‌టి మండలి 17.12.2022నాటి 48వ సమావేశం సందర్భంగా చేసిన సిఫారసుల మేరకు 26.12.2022 నుంచి అమలులోకి వచ్చేవిధంగా సీజీఎస్టీ నిబంధనలు-2017లో నిబంధన ‘88సి’ జోడించబడింది. నమోదిత వ్యక్తి నిర్దిష్ట నెలలో ఫారం ‘జిఎస్‌టిఆర్‌-1’ పరంగా వెల్లడించిన అవుట్‌పుట్ పన్ను బకాయి అదే నెల ఫారం ‘జిఎస్‌టిఆర్‌-3బి’ రిటర్నులో పేర్కొన్న నిర్దిష్ట పరిమితికన్నా ఎక్కువగా ఉంటే సదరు వ్యక్తికి వ్యవస్థ ఆధారిత సమాచారం ఇవ్వడం కో్సం ఈ నిబంధన ఉద్దేశించబడింది. ఈ విధంగా ‘88సి’ నిబంధన కింద సమాచారం ఇచ్చినప్పటికీ పన్ను చెల్లించకపోవడమేగాక తగిన వివరణ కూడా ఇవ్వకపోతే పన్ను మొత్తంతోపాటు దానిపై వడ్డీ వసూలుకు ఓ ప్రక్రియను ప్రస్తుత మండలి సమావేశం నిర్దేశించింది. ఈ మేరకు ఫారమ్ ‘జిఎస్‌టి డిఆర్‌సి-01డి’ ద్వారా పన్ను బకాయి, వడ్డీ రాబట్టేందుకు సీజీఎస్టీ నిబంధనలు-2017లో ‘142బి’ నిబంధనను జోడించాలని సిఫారసు చేసింది.
  3. ఫారమ్ ‘జిఎస్‌టిఆర్‌-2బి’ ఫారమ్‌ ‘జిఎస్‌టిఆర్‌-3బి’ మధ్య ‘ఐటీసీ’లో వ్యత్యాసాల నిర్వహణ యంత్రాంగం: ‘ఐటీసీ’కి సంబంధించి ‘జిఎస్‌టిఆర్‌-2బి’ ద్వారా లభ్యమయ్యే మొత్తం కన్నా ఎక్కువగా పన్ను చెల్లింపుదారు నిర్దిష్ట పరిమితికి మించి ‘జిఎస్‌టిఆర్‌-3బి’ ద్వారా వినియోగించుకుంటే వారికి వ్యవస్థాధారిత సమాచారం ఇవ్వడం కోసం ఒక యంత్రాంగం ఏర్పాటు చేయాలని మండలి సిఫారసు చేసింది. ఈ మేరకు వ్యత్యాసానికి గల కారణాలు వివరించడం లేదా పన్న చెల్లింపుదారు స్వయంచాలకంగా ఆ తేడా సంబంధిత పరిష్కార చర్యలు తీసుకునే వీలు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం సీజీఎస్టీ నిబంధనలు-2017లోని 59(6) నిబంధనను సవరించడమేగాక నిబంధన ‘88డి’ సహా, ఫారం ‘డిఆర్‌సి-01సి’ని చేర్చాలని సూచించింది. ఇది జిఎస్‌టిలో ‘ఐటీసీ’ అసమతౌల్యాన్ని సరిదిద్దడంతోపాటు ‘ఐటీసీ’ సదుపాయం దుర్వినియోగం కాకుండా తోడ్పడుతుంది.
  4. రిటర్నుల దాఖలులో క్రమశిక్షణ మెరుగుదిశగా గడువులోగా ఫారమ్ ‘జిఎస్‌టిఆర్‌-9’ లేదా ఫారమ్ ‘జిఎస్‌టిఆర్‌-9ఎ’ ద్వారా వార్షిక రిటర్ను సమర్పణలో నమోదిత పన్ను చెల్లింపుదారు విఫలమైతే వారికి నోటీసు జారీ చేయడం కోసం ఫారమ్‌ ‘జిఎస్‌టిఆర్‌-3ఎ’ సవరించబడుతుంది.
  5. ‘ఒఐడిఎఆర్‌’ సేవా ప్రదాతలు దేశంలోని నమోదిత వ్యక్తులకు సరఫరా చేసిన సేవల వివరాలను ఫారమ్‌ ‘జిఎస్‌టిఆర్‌-5ఎ’ రిటర్ను ద్వారా సమర్పించేందుకు వీలుగా  సీజీఎస్టీ నిబంధనలు-2017లోని నిబంధన 64సహా ఫారమ్‌ ‘జిఎస్‌టిఆర్‌-5ఎ’ కూడా  సవరించబడాలి. ‘ఒఐడిఎఆర్‌’ సేవా ప్రదాతల నుంచి స్వీకరించిన సరఫరాలకు సంబంధించి దేశంలోని నమోదిత వ్యక్తుల నుంచి రివర్స్ ఛార్జ్ ప్రాతిపదికన పన్ను చెల్లింపును గమనించేందుకు ఇది సహాయపడుతుంది.
  6. ‘ఐటీసీ’ వాపసు రద్దు నిమిత్తం అంతర్జాతీయ విమానాశ్రయాల్లోని అరైవల్ టెర్మినల్ వద్ద తిరిగొచ్చే ప్రయాణికులకు సుంకం రహిత దుకాణాల నుంచి సరఫరా అయిన సరుకుల విలువను మినహాయింపు సరఫరాల విలువలో చేర్చేలా సీజీఎస్టీ నిబంధనలు-2017లోని నిబంధన 43 తర్వాత వివరణ 3ను జోడించాల్సి ఉంటుంది.
  7. సీజీఎస్టీ చట్టం-2017లోని సెక్షన్ 132 ప్రకారం వివిధ అపరాధాలపై చెల్లించాల్సిన జరిమానా మొత్తాన్ని సూచించడం కోసం ఆ చట్టంలోని నిబంధన 162కింద ఉప-నిబంధన (3ఎ) చేర్చబడుతుంది.
  8. ఉమ్మడి పోర్టల్‌లోగల నమోదిత వ్యక్తుల సమాచారాన్ని సమ్మతి ఆధారితంగా ఇతర వ్యవస్థలతో పంచుకునే విధానం-షరతుల రూపకల్పన దిశగా సీజీఎస్టీ చట్టం-2017లో  నిబంధన 163ను జోడించాలని మండలి సిఫారసు చేసింది. అదేవిధంగా “అకౌంట్‌  అగ్రిగేటర్లను” ఉమ్మడి పోర్టల్ ద్వారా సమాచారం పంచుకునే వ్యవస్థలుగా ప్రకటించడం కోసం సీజీఎస్టీ చట్టం-2017లోని సెక్షన్ 158ఎ కింద నోటిఫికేషన్ జారీ చేయాలని మండలి సిఫారసు చేసింది.
  9.  నమోదుకాని వ్యక్తులకు వస్తువుల సరఫరా విషయంలో సరఫరా ప్రదేశం నిర్ధారణకు ఐజీఎస్టీ చట్టం-2017లోగల సెక్షన్ 10 పరిధిలోని ఉప-సెక్షన్ (1)లో నియమం (సిఎ)ని జోడించాలని మండలి సిఫారసు చేసింది.
  10.  జిఎస్‌టి సంబంధిత అంశాలపై అవగాహనను పంచుకోవడం, పరిపాలన-నివారణ చర్యలపై సమన్వయ కృషి కోసం కేంద్ర/రాష్ట్ర జిఎస్‌టి యంత్రాంగాల నుంచి అధికారులతో రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీ ఏర్పాటుకు మండలి సిఫారసు చేసింది.
  11.  ఐటీ వ్యవస్థ సంస్కరణలపై మంత్రుల బృందం (జిఒఎం) 2వ మధ్యంతర నివేదికపైనా మండలి చర్చించింది. జిఎస్‌టిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ బలోపేతం, ముప్పు నిర్వహణ కోసం మూడో పక్షం సమాచారాన్ని ఎక్కువగా వాడుకోవడం, సరఫరా శృంఖలంలో నకిలీ ‘ఐటీసీ’ ప్రవాహ నియంత్రణ కోసం వ్యవస్థ ఆధారిత చర్యల ద్వారా జిఎస్‌టి మోసాలను అరికట్టడానికి చేపట్టాల్సిన వివిధ చర్యలను ‘జిఒఎం’ సిఫారసు చేసింది.

గమనిక: జిఎస్‌టి మండలి సిఫారసులతో సమావేశ నిర్ణయాల ప్రధానాంశాలను జోడించి భాగస్వాముల సమాచారం కోసం సరళ భాషలో వివరించబడింది. ఇది సంబంధిత సర్క్యులర్లు/నోటిఫికేషన్లు/చట్ట సవరణల ద్వారా ఇవన్నీ అమలులోకి వస్తాయి… వీటికి మాత్రమే చట్టబద్ధత ఉంటుంది.

*****


(Release ID: 1939115) Visitor Counter : 346