అంతరిక్ష విభాగం

చంద్రయాన్-3 అమావాస్య చీకటినుంచి ప్రపంచానికి వెలుగు బాట పరుస్తుంది: డాక్టర్‌ జితేంద్ర సింగ్


“యావత్ ప్రపంచం చంద్రయాన్-3 కోసం ఎన్నో అంచనాలు.. ఆకాంక్షలు..
ఆశలతో నిరీక్షిస్తోంది; చంద్రుని కొత్త రూపురేఖలతోపాటు మరిన్ని విశ్వ
రహస్యాల ఆవిష్కరణ కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోంది”;

“చంద్రయాన్‌-3తో చంద్రునికి మరో అడుగు చేరువయ్యే సంకేతాలు”;

Posted On: 11 JUL 2023 5:58PM by PIB Hyderabad

   చంద్రయాన్-3 ప్రయోగం అమావాస్య చీకటి నుంచి ప్రపంచానికి కొత్త వెలుగు బాట పరుస్తుందని కేంద్ర శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వశాఖ, ప్రధాని కార్యాలయ, ప్రజా ఫిర్యాదులు- సిబ్బంది-పెన్షన్లు, అణుశక్తి-అంతరిక్ష శాఖల (స్వతంత్ర బాధ్యత) సహాయ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్ చెప్పారు.

   ఈ మేరకు ఇవాళ ‘ఇటి (ఎకనమిక్‌ టైమ్స్‌) గవర్నెన్స్‌’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. చంద్రయాన్-1 ప్రయోగం ద్వారా చంద్రునికి సంబంధించిన వివిధ అంశాలు వెలుగులోకి వచ్చాయని ఆయన గుర్తుచేశారు. ఇందులో భాగంగా చంద్రుని ఉపరితలంపై నీటి ఉనికిని తొలిసారి ప్రపంచానికి నిరూపించింది. ఈ నేపథ్యంలో చంద్రయాన్-3 కోసం యావత్‌ ప్రపంచం ఎన్నో అంచనాలు, ఆకాంక్షలు, ఆశలతో ఎదురుచూస్తున్నదని పేర్కొన్నారు. అదే సమయంలో చంద్రుని కొత్త రూపురేఖలతోపాటు మరిన్ని విశ్వ రహస్యాల వెల్లడిపై ఆసక్తి ప్రదర్శిస్తున్నదని తెలిపారు.

   ప్రయోగం చంద్రునివైపు మన పయనాన్ని మరో అడుగు చేరువ చేస్తుందని డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ అన్నారు. తద్వారా ప్రపంచ దేశాలతో పోలిస్తే చంద్రునిపై అన్వేషణలో భారత్‌ ఏమాత్రం వెనుకబడలేదనే వాస్తవాన్ని రుజువు చేస్తుందన్నారు. చంద్రుని నుంచి చంద్రుని పరిశీలనతోపాటు భూగోళ పరిశీలన కూడా సాగటమే తాజా ప్రయోగం ప్రత్యేకత అని తెలిపారు. తద్వారా చంద్రునిపై పరిశోధనలో అగ్రస్థానంలోగల మూడు నాలుగు దేశాల జాబితాలో చేరుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అమెరికాలో పర్యటించిన సందర్భంగా అంతరిక్ష పరిశోధనల్లో భారత్‌ను సమాన భాగస్వామిగా, సహాయకారిగా ఆ దేశం పరిగణిస్తున్నట్లు స్పష్టమైందని డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తుచేశారు. అంతేకాకుండా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ నేడు భారత వ్యోమగాములను స్వాగతిస్తోందని, ఆర్టెమిస్‌ ఒప్పందంపై సంతకం చేసిన దేశాల్లో భారత్‌ కూడా ఒకటి కావడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.

   భారత అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం కేవలం రాకెట్ల ప్రయోగానికి పరిమితం కాదని, ఆయా రంగాలవారీగా వృద్ధితోనూ ముడిపడి ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆరు దశాబ్దాల జాతీయ అంతరిక్ష కార్యక్రమంలో భారత్‌ తన అంతరిక్ష సాంకేతికత అనువర్తన సామర్థ్యాన్ని రుజువు చేసుకున్నదని తెలిపారు. ఆ మేరకు శాస్త్ర-సాంకేతిక, టెలికమ్యూనికేషన్, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, విపత్తు హెచ్చరికలు-ఉపశమనాలు, వాతావరణ మార్పు, నౌకాయానం, రక్షణ-పాలన వగైరాలు సహా మానవ జీవితంలోని అన్ని రంగాలనూ నేడు అంతరిక్ష రంగం ప్రభావితం చేస్తున్నదని వివరించారు.

   రాబోయే 25 ఏళ్ల అమృత కాలంలో భారత శిఖరారోహణ అంతరిక్షం ద్వారా ప్రారంభమైందని డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ చెప్పారు. భవిష్యత్తులో ఆర్థికాభివృద్ధికి అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ఓ కీలక స్తంభం కాగలదని అన్నారు. భారత్‌ ఇప్పటిదాకా ప్రయోగించిన 424 విదేశీ ఉపగ్రహాలలో 389 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం హయాంలో గత తొమ్మిదేళ్ల వ్యవధిలో ప్రయోగించబడ్డాయని తెలిపారు. తద్వారా ఆర్జించిన 174 మిలియన్‌ డాలర్లలో 157 మిలియన్లు గత తొమ్మిదేళ్లలో వచ్చాయన్నారు. అలాగే ఇప్పటివరకు ఆర్జించిన 256 మిలియన్ యూరోలలో, 223 మిలియన్లు ప్రధాని మోదీ హయాంలో ఈ తొమ్మిదేళ్ల కాలంలోనే వచ్చాయని విశదీకరించారు.

   డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ ఈ సందర్భంగా ఒక ప్రశ్నకు జవాబిస్తూ- అంతరిక్ష సాంకేతికత బోధనా మాధ్యమంగా మారిందన్నారు. భౌగోళిక-భౌతికశాస్త్రం, దూరవైద్యం, వంటివాటికి  విశేషంగా దోహదపడిందని తెలిపారు. అంతేగాక నేడు వైఫై మాధ్యమంలో అంతరిక్ష సాంకేతికత ద్వారా కూడా విద్యాభ్యాసం సాగుతున్నదని పేర్కొన్నారు. అంతరిక్ష రంగం ద్వారాలను తెరవడంలో ప్రధాని మోదీ దార్శనికతను మంత్రి కొనియాడారు. గిరిగీసుకుని పనిచేసే రోజులు పోయాయని, ఏకీకరణే నేటి కొత్త మంత్రమని డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ స్పష్టం చేశారు. మెరుగైన ఫలితాల కోసం జాతీయ స్థాయిలోనేగాక అంతర్జాతీయంగానూ ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం తప్పనిసరి అన్నారు.

*****(Release ID: 1938813) Visitor Counter : 235