గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

జీ20 నేతలకు 'అధికారిక ప్రకటన' అప్పగింతతో ముగిసిన 'పట్టణ 20' (యూ20) మేయర్ల సదస్సు 'అధికారిక ప్రకటన'కు రికార్డ్‌ సంఖ్యలో ఆమోదాలు

Posted On: 10 JUL 2023 1:56PM by PIB Hyderabad

ఈ నెల 7-8 తేదీల్లో, అహ్మదాబాద్‌ నగర అధ్యక్షతన గాంధీనగర్‌లో జరిగిన రెండు రోజుల 'పట్టణ 20' మేయర్ల సదస్సు ముగిసింది. జీ20 నేతలకు 'అధికారిక ప్రకటన' అప్పగింతతో ఈ కార్యక్రమం ముగిసింది. ప్రపంచంలోని 105 నగరాలు ఈ ప్రకటనకు ఆమోదం తెలిపాయి. ఇప్పటివరకు జరిగిన యూ20 సదస్సుల్లో, 'అధికారిక ప్రకటన'కు లభించిన అత్యధిక ఆమోదాల సంఖ్య ఇది. గత సదస్సులోని సంఖ్యతో పోలిస్తే, ఇది రెండింతలు కన్నా ఎక్కువ.

యూ20 నగరాలు ఉమ్మడిగా గుర్తించిన ఆరు ప్రాధాన్యతాంశాలపై కార్యాచరణ ఎజెండా రూపొందించారు. పర్యావరణ బాధ్యత గల విధానాలను ప్రోత్సహించడం, పర్యావరణ పునరుద్ధరణ రుణాల మంజూరు వేగవంతం చేయడం, స్థానిక సంస్కృతి & ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం, జల భద్రతకు భరోసా, డిజిటల్ పట్టణ భవిష్యత్తును ప్రోత్సహించడం, పట్టణ ప్రణాళిక & పాలన విధానాలను మళ్లీ రూపొందించడం వంటివి ఈ ప్రాధాన్యతాంశాల్లో ఉన్నాయి. జీ20 నేపథ్యాంశమైన "వసుధైక కుటుంబం" లేదా "ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు" నేపథ్యాంశాన్ని బలపరిచేలా 'అధికారిక ప్రకటన' రూపొందించారు.

భారత గృహ నిర్మాణం & పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ హర్‌దీప్ సింగ్ పురి ఈ సందర్భంగా మాట్లాడారు. "సుస్థిరత, కలుపుగోలు అభివృద్ధి, వాతావరణ స్థితిస్థాపకతకు సంబంధించిన ప్రపంచ లక్ష్యాలను సాధించడంలో నగరాలు కేంద్రంగా ఉంటాయి" అని చెప్పారు. పట్ణణ నియోజకవర్గం శక్తి, ప్రపంచ అభివృద్ధి సవాళ్లపై తన అభిప్రాయాలను కేంద్ర మంత్రి పంచుకున్నారు. సుస్థిర భవిష్యత్తు కోసం నగరాలు దృష్టి సారించాల్సిన తొమ్మిది రంగాల గురించి వివరించారు:

1. స్థానిక పరిపాలనను బలోపేతం చేయడం

2. సంప్రదాయ పరిధిని మించి ప్రణాళికలు రూపొందించడం

3. ఆర్థికంగా స్వావలంబన దిశగా నగరాలను ప్రోత్సహించడం

4. ఆవిష్కరణల సంస్కృతిని ప్రోత్సహించడం

5. సమాచారం, సాంకేతికత శక్తిని వినియోగించుకోవడం

6. నియంత్రణ పరిధుల నుంచి బయటపడడం

7. ఫలితాలపై కాకుండా ప్రభావాలపై దృష్టి పెట్టడం

8. పట్టణ పరిపాలనలో పౌరులకు ప్రాధాన్యమివ్వడం

9. స్థానిక సంస్కృతి, ఆర్థిక వ్యవస్థను పెంచడం

సుస్థిర. సుసంపన్నమైన భవిష్యత్తును రూపొందించడంలో నగరాల పాత్ర గురించి జీ20 షెర్పా శ్రీ అమితాబ్ కాంత్ మాట్లాడారు. ప్రపంచంలోని మూడింట ఒక వంతు మంది ప్రజలు మాంద్యం, భౌగోళిక రాజకీయ సమస్యలు, వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ప్రస్తుత సదస్సు ప్రాముఖ్యత గురించి ఆయన ప్రధానంగా వివరించారు. యూ20 కింద చేసిన ప్రయత్నాలను మెచ్చుకున్నారు. భవిష్యత్‌ నగరాలకు తగిన మౌలిక సదుపాయాల కల్పన కోసం రుణాలు, పట్టణాల్లో వివిధ సమస్యలను పరిష్కరించడానికి మెరుగైన పట్టణ ప్రణాళిక ఉండాల్సిన అవసరం గురించి స్పష్టం చేశారు.

'అధికారిక ప్రకటన' అప్పగింత కార్యక్రమంలో యూ20 కన్వీనర్లు, సీ40 నగరాలు, యూసీఎల్‌జీ పాల్గొన్నారు. ప్రతినిధుల హర్షధ్వానాల మధ్య, శ్రీ హర్‌దీప్ సింగ్ పురి, శ్రీ అమితాబ్ కాంత్‌కు 'అధికారిక ప్రకటన'ను అహ్మదాబాద్‌ మేయర్ అందజేశారు.

భారత గృహ నిర్మాణం & పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జాతీయ పట్టణ వ్యవహారాల సంస్థ (ఎన్‌ఐయూఏ), యూ20 సాంకేతికత సచివాలయం కలిసి ఈ సదస్సును నిర్వహించాయి. జీ20 దేశాల్లోని వివిధ నగరాల నాయకులు ఈ వేదిక ద్వారా ఒకచోట కలుసుకున్నారు. ఈ సదస్సులో వివిధ అంశాలపై అనేక కార్యక్రమాలు నిర్వహించారు. పర్యావరణ పునరుద్ధరణ రుణాల వంటి పట్టణ సమస్యలపై నగర మేయర్లు, ప్రతినిధులు చర్చించారు.

ప్రస్తుత యూ20 సదస్సు, 50కి పైగా కథనాలు, 6 విస్తృత పరిశోధన పత్రాలు, ఆరు ప్రాధాన్యత రంగాలపై ఆరు శ్వేత పత్రాలు, ఆరు యూ20 బులెటిన్లను విడుదల చేసి రికార్డు సృష్టించింది. 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలను సాధించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్న అహ్మదాబాద్ నగర పర్యావరణ కార్యాచరణ ప్రణాళికపై సంక్షిప్త వివరాలు సహా చాలా సాంకేతిక పత్రాలను కూడా ఈ సదస్సులో విడుదల చేశారు.

ఈ యూ20 సదస్సు భారీ విజయాన్ని సాధించిందని, గత సదస్సుల కంటే చాలా అంశాల్లో ముందుందని నగర మేయర్లు, ప్రతినిధులు, ఉన్నతాధికారులు, విజ్ఞాన భాగస్వాములు ఏకగ్రీవంగా అంగీకరించారు.

 

****



(Release ID: 1938448) Visitor Counter : 165