ప్రధాన మంత్రి కార్యాలయం

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో రూ.12,100 కోట్లకుపైగా విలువైన అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవం.. శంకుస్థాపన చేసిన ప్రధాని


పండిట్‌ దీన్‌దయాళ్‌ జంక్షన్‌-సోన్‌ నగర్
ప్రత్యేక సరకు రవాణా రైలు మార్గం ప్రారంభం;

జాతీయ రహదారి-56లో 4 వరుసల విస్తరిత
‘వారణాసి-జాన్‌పూర్’ విభాగం జాతికి అంకితం;

వీటితోపాటు అనేక పథకాలకు ప్రారంభోత్సవం;

మణికర్ణిక-హరిశ్చంద్ర ఘాట్ల పునర్నవీకరణ-అభివృద్ధికి ప్రధాని శంకుస్థాపన;

కర్సారాలోని ‘సిపెట్‌’ ప్రాంగణంలో విద్యార్థుల వసతి గృహం నిర్మాణానికి పునాది;

లబ్ధిదారులకు పీఎం స్వానిధి రుణాలు.. ఆయుష్మాన్
కార్డుల పంపిణీసహా పీఎంఏవై-గ్రామీణ గృహాల అప్పగింత;

“ప్రాచీనతకు భంగం కలగకుండా కాశీకి కొత్తరూపమివ్వాలన్న
మా సంకల్పంలో భాగంగానే నేడు కొత్త పథకాలతో నగర విస్తరణ”;

“లబ్ధిదారులతో పరస్పర సంభాషణ-చర్చ’ ప్రభుత్వం ప్రారంభించిన కొత్త సంప్రదాయం; అంటే- ప్రత్యక్ష లబ్ధి.. నేరుగా ప్రజాభిప్రాయ సేకరణ”;

“సామాజిక న్యాయం.. లౌకికవాదాల వాస్తవ రూపానికి
లబ్ధిదారుల వర్గం ఒక ఉదాహరణగా మారింది”;

“పీఎం ఆవాస్.. ఆయుష్మాన్ వంటి పథకాలు పలు తరాలను ప్రభావితం చేస్తాయి”;

“పేదల ఆత్మగౌరవానికి ప్రధానమంత్రి మోదీ ఇస్తున్న భరోసా ఇదే”;

“పేదల సంక్షేమానికైనా.. మౌలిక సదుపాయాలకైనా నేడు బడ్జెట్‌ కొరత లేదు”

Posted On: 07 JUL 2023 8:01PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో రూ.12,100 కోట్లకుపైగా విలువైన అనేక అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా పండిట్‌ దీన్‌దయాళ్‌ జంక్షన్‌-సోన్‌ నగర్‌ ప్రత్యేక సరకు రవాణా రైలు మార్గంతోపాటు విద్యుదీకరణ లేదా డబ్లింగ్‌ పనులు పూర్తయిన మూడు రైలు మార్గాలను ఆయన జాతికి అంకితం చేశారు. అలాగే జాతీయ రహదారి-56 పరిధిలో నాలుగు వరుసలుగా విస్తరించిన వారణాసి-జాన్‌పూర్ విభాగంసహా నగరంలో పలు ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేశారు.

   రోవైపు 15 ‘పిడబ్ల్యుడి’ రోడ్ల నిర్మాణం-పునరుద్ధరణతోపాటు 192 గ్రామీణ తాగునీటి పథకాలకు, మణికర్ణిక-హరిశ్చంద్ర ఘాట్‌ల పునర్నవీకరణ-పునరాభివృద్ధి సహా పలు రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. వీటిలో మతపరమైన ఆరు కీలక స్నానఘట్టాల వద్ద తేలియాడే దుస్తుల మార్పు గదుల జెట్టీలు, కర్సారాలోని ‘సిపెట్‌’ ప్రాంగణంలో విద్యార్థుల వసతిగృహ నిర్మాణానికి ఆయన పునాదిరాయి వేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు పీఎం స్వానిధి రుణాలు, ఆయుష్మాన్‌ భారత్‌ కార్డుల పంపిణీతోపాటు పీఎంఏవై పథకం కింద నిర్మించిన గృహాలను లబ్ధిదారులకు ఆయన అప్పగించారు. అంతకుముందు వేదిక వద్దకు రాగానే మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్‌ల పునర్నవీకరణ-పునరాభివృద్ధి నమూనాను ప్రధాని పరిశీలించారు.

   నంతరం జనసమూహాన్ని ఉద్దేశించి ప్ర‌సంగిస్తూ- పవిత్ర శ్రావ‌ణమాస ఆరంభం నేపథ్యంలో కాశీ విశ్వ‌నాథ స్వామి, గంగామాత ఆశీర్వాదాలతోపాటు వార‌ణాసి ప్ర‌జ‌ల స‌న్నిధిలో జీవితం ధ‌న్య‌మైందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. శివునికి జలాభిషేకం చేసేందుకు వేలాది శివభక్తులు వారణాసికి వస్తున్నారని, నగరాన్ని సందర్శించే యాత్రికుల సంఖ్య దృష్ట్యా సరికొత్త రికార్డు నెలకొనడం ఖాయమని ప్రధాని అన్నారు. “వారణాసికి వచ్చేవారు సదా ఎనలేని ఆనందానుభూతితో తిరిగి వెళ్తారు” అంటూ నగరపౌరుల హార్దిక ఆతిథ్యాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. నగరంలో జి-20 సదస్సుల సందర్భంగా ప్రతినిధులకు స్వాగతం పలకడంలో, ప్రార్థన స్థల ప్రాంగణాలను పరిశుభ్రంగా/ఉన్నతంగా ఉంచడంపై కాశీ ప్రజలను ప్రధాని ప్రశంసించారు.

   వారణాసిలో రూ.12,000 కోట్లకుపైగా విలువైన పనులకు శంకుస్థాపన చేయడాన్ని ప్రధాని ప్రస్తావిస్తూ- “కొత్త పథకాలతో నేటి నగర విస్తరణ ప్రాచీనతకు భంగం కలగకుండా కాశీకి కొత్తరూపమివ్వాలన్న మా సంకల్పంలో ఒక భాగం” అని వివరించారు. ఈ పథకాల ప్రయోజనాలు పొందనున్న ప్రజలకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. అంతకుముందు వివిధ పథకాల లబ్ధిదారులతో ప్రధాని ప్రత్యక్షంగా ముచ్చటించారు. మునుపటి ప్రభుత్వాల హయాంలో ఆయా పథకాలు అట్టడుగు వర్గాలతో అనుసంధానం కావడమనే పరిస్థితి లేదన్నారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం లబ్ధిదారులతో నేరుగా సంభాషించే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టిందని, అంటే- ‘ప్రత్యక్ష ప్రయోజనంతో పాటు నేరుగా అభిప్రాయ సేకరణ’ చేయడమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పద్ధతిని అనుసరిస్తున్న నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖల, అధికారుల పనితీరు మెరుగుపడిందని తెలిపారు. “స్వాతంత్ర్యం వచ్చిన చాలా ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్య వాస్తవ ప్రయోజనం సముచిత వ్యక్తులకు అసలైన అర్థంతో చేరుతోంది” అని ప్రధానమంత్రి వివరించారు.

   థకాల ప్రయోజనాలు చిట్టచివరి వ్యక్తికీ చేరేలా ప్రభుత్వం కృషి చేస్తున్నందున సామాజిక న్యాయం, లౌకికవాదాల వాస్తవ రూపానికి లబ్ధిదారుల వర్గం ఒక ఉదాహరణగా మారిందని ప్రధానమంత్రి అన్నారు. దీంతో కమీషన్లు నొక్కేసేవారు, దళారులు, కుంభకోణాలకు పాల్పడేవారు మాయమై అవినీతి, వివక్షకు తెరపడిందని ప్రధాని పేర్కొన్నారు. గడచిన తొమ్మిదేళ్లలో ప్రభుత్వం కేవలం ఒక కుటుంబం, ఒక తరం కోసం కాకుండా భవిష్యత్తరాల జీవన నాణ్యత మెరుగుకు ప్రభుత్వం పాటుపడుతున్నదని ప్రధానమంత్రి అన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై)ని ఉదాహరిస్తూ- దేశవ్యాప్తంగా 4 కోట్లకుపైగా కుటుంబాలకు పక్కా గృహాలు సమకూర్చామని తెలిపారు. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో నేడు 4 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించామని ఆయన చెప్పారు. “ఈ గృహాలు యజమానులకు సురక్షిత భావనతోపాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి” అని ప్రధాని అన్నారు. తొలిసారిగా ఈ యజమానులలో పేద మహిళలు అధికశాతం కావడం విశేషమని, ఆ మహిళలకు పక్కా గృహాలు ఆర్థిక భరోసానిస్తాయని పేర్కొన్నారు.

   ప్రభుత్వ పథకాల ప్రభావాన్ని వివరిస్తూ- ఆయుష్మాన్ భారత్ పథకం కూడా కేవలం రూ.5 లక్షల విలువైన ఉచిత చికిత్సకు పరిమితం కాదని ప్రధానమంత్రి అన్నారు. వైద్యం కోసం  ఖర్చులు తరతరాలనూ అప్పుల ఊబిలోకి నెట్టివేసే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో “ఆయుష్మాన్ భారత్‌ పథకం భవిష్యత్తరాలపై పడే దుష్ప్రభావాన్ని నివారిస్తూ పేదలకు రక్షణ కల్పిస్తోంది. ఆ దిశగా ప్రతి పేదకూ ఉద్యమ తరహాలో కార్డు అందేలా కృషి చేస్తున్నాం” అని చెప్పారు. కాగా, నేటి కార్యక్రమంలో కోటి అరవై లక్షల మంది పేదలకు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ- “ఒక దేశంలోని వనరులలో సింహభాగం పేదలు-అణగారిన వర్గాల ప్రజలకే అందాలి” అని ప్రధానమంత్రి అన్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 50 కోట్ల జన్‌ధన్‌ ఖాతాలు ప్రారంభించబడ్డాయని, ‘ముద్ర’ పథకం కింద పూచీకత్తులేని రుణాలవంటి ఆర్థిక సార్వజనీనత చర్యలు చేపట్టామని గుర్తుచేశారు. తద్వారా పేద, దళిత, అణగారిన/వెనుకబడిన, గిరిజన, మైనారిటీ, మహిళా పారిశ్రామికవేత్తలకు ఎంతో మేలు కలిగిందని ప్రధాని వివరించారు.

   ప్రధానమంత్రి స్వానిధి పథకం గురించి వివరిస్తూ- వీధి వ్యాపారులలో అధికశాతం వెనుకబడిన వర్గాలవారేనని ప్రధాని గుర్తుచేశారు. అయితే, గత ప్రభుత్వాలు వారి సమస్యలను ఎన్నడూ పరిష్కరించలేదని, పైగా వారిని వేధిస్తూ వచ్చాయని అన్నారు. నేడు ప్రభుత్వం ప్రవేశంపెట్టిన ‘పీఎం స్వానిధి పథకం’ ద్వారా ఇప్పటి వరకూ 35 లక్షల మందికిపైగా లబ్ధి పొందారని తెలిపారు. ఇందులో భాగంగా నేడు వారణాసిలో 1.25 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు రుణపంపిణీ చేశామని ప్రధానమంత్రి వెల్లడించారు. “పేదల ఆత్మగౌరవానికి మోదీ ఇస్తున్న భరోసా ఇదే”నని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. గత ప్రభుత్వాల్లో ప్రాథమికంగా నిజాయితీ లోపమే నిధుల కొరతకు దారితీసేదని ప్రధానమంత్రి ప్రస్తావించారు. అయితే, “పేదల సంక్షేమానికైనా, మౌలిక సదుపాయాల కల్పనకైనా ఇవాళ బడ్జెట్ కొరత లేనేలేదు. ఆనాటి పన్ను చెల్లింపుదారులే ఈనాడూ ఉన్నారు. వ్యవస్థ కూడా అదే.. కేవలం ప్రభుత్వం మారిందంతే! సంకల్పంలో మార్పుతో ఫలితాలు వాటంతట అవే ఒనగూడాయి” అని ఆయన వ్యాఖ్యానించారు.

   దేశంలో ఇంతకుముందు కుంభకోణాలు, నల్లబజారుకు సంబంధించిన వార్తలు కనిపిస్తే- నేడు ఆ స్థానంలో కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల వార్తలు కనిపిస్తున్నాయని ప్రధానమంత్రి అన్నారు. ఈ మార్పునకు ప్రత్యక్ష ఉదాహరణగా ‘తూర్పు ప్రత్యేక సరుకు రవాణా కారిడార్, గూడ్స్ రైళ్ల కోసం ప్రత్యేక మార్గ నిర్మాణం పథకాలను ఆయన ప్రస్తావించారు. కాగా, 2006లో మొదలైన ఈ ప్రాజెక్టులో 2014దాకా ఒక్క కిలోమీటరు కూడా పనులు జరగలేదని గుర్తుచేస్తూ- గడచిన 9 ఏళ్లలో గణనీయ భాగం పూర్తి కావడమేగాక ఆ మార్గంలో నేడు గూడ్స్‌ రైళ్లు నడుస్తున్నాయని తెలిపారు. “ఈ పథకాల్లో భాగమైన దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్ జంక్షన్-సోన్‌నగర్ కొత్త రైలుమార్గం కూడా ప్రారంభించబడింది. దీంతో గూడ్స్ రైళ్ల వేగం పెరగడమేగాక పూర్వాంచల్‌ సహామ తూర్పు భారతం అనేక కొత్త ఉపాధి అవకాశాలు అందివస్తాయి” అని ప్రధాని పేర్కొన్నారు.

   రవేగపు రైళ్లకోసం ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తుండటాన్ని ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయితే, దాదాపు 50 ఏళ్లకిందట దేశంలో తొలిసారి రాజధాని ఎక్స్‌’ప్రెస్ నడిచినప్పటికీ, ఇవాళ అది 16 మార్గాలకు మాత్రమే పరిమితమైందన్నారు. ఇక 30-35 ఏళ్ల కిందట ప్రారంభించిన శతాబ్ది ఎక్స్‌’ప్రెస్ ప్రస్తుతం 19 మార్గాల్లో మాత్రమే నడుస్తోందని ఉదాహరించారు. ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వం వచ్చాక ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్‌’ప్రెస్ గురించి ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఇది ప్రారంభమయ్యాక కేవలం 4 ఏళ్ల స్వల్ప వ్యవధిలోనే నేడు 25 మార్గాల్లో నడుస్తున్నదని తెలిపారు. “దేశంలో తొలి వందే భారత్‌ రైలును కోరే హక్కు వారణాసికి ఉంది” అని ప్రధాని వ్యాఖ్యానిస్తూ... గోరఖ్‌పూర్-లక్నో; జోధ్‌పూర్-అహ్మదాబాద్ మార్గాల్లో గోరఖ్‌పూర్ నుంచి ఇవాళ రెండు కొత్త వందే భారత్ ఎక్స్‌’ప్రెస్ రైళ్లను జండా ఊపి సాగనంపామని ఆయన తెలిపారు. “ఈ వందే భారత్ దేశంలోని మధ్యతరగతి ప్రయాణికుల విశేషాదరణ పొందడంతోపాటు దీనికి క్రమంగా డిమాండ్ పెరుగుతోంది” అని శ్రీ మోదీ అన్నారు. వందేభారత్ ఎక్స్‌’ప్రెస్ దేశంలోని ప్రతి మూలనూ అనుసంధానించే రోజు ఎంతో దూరంలో లేదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

   కాశీ నగరానికి అనుసంధానం మెరుగు దిశగా గత 9 ఏళ్లలో సాగిన అపూర్వ కృషిని ప్రధానమంత్రి ప్రస్తావించారు. తద్వారా అనేక కొత్త ఉపాధి అవకాశాలు అందిరాగా, కాశీకి 7 కోట్ల మంది పర్యాటకులు, యాత్రికులు వచ్చారని ఆయన గుర్తుచేశారు. కేవలం ఏడాదిలోనే యాత్రికుల సంఖ్య 12 రెట్లు పెరగడంతో రిక్షా కార్మికులు, దుకాణదారులు, ధాబాలు, హోటళ్లు, వారణాసి సిల్కు చీరల పరిశ్రమ కార్మికులకు ఆదాయార్జన అవకాశాలు పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే పడవలు నడిపేవారు ఎంతో లబ్ధి పొందారని, ఈ మేరకు గంగా హారతి సమయాన పెద్ద సంఖ్యలో పడవలు రావడంపై ఆయన ఆశ్చర్యానందాలు వ్యక్తం చేశారు. “మీరు ఎల్లప్పుడూ ఇలాగే వారణాసిని జాగ్రత్తగా చూసుకుంటారని నేను విశ్వసిస్తున్నాను” అన్నారు. చివరగా- ఇవాళ్టి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. కాశీ విశ్వనాథుని ఆశీర్వాదంతో వారణాసి ప్రగతి పయనం నిరంతరం కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ ప్రధాని తన ప్రసంగం ముగించారు.

   ఈ కార్యక్రమాల్లో ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రులు శ్రీ కేశవ్ ప్రసాద్ మౌర్య/శ్రీ బ్రజేష్ పాఠక్, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ మహేంద్ర నాథ్ పాండే, కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి ప్రొఫెసర్ ఎస్.పి.సింగ్ బాఘేల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

నేపథ్యం

   వారణాసి కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి పండిట్‌ దీన్‌దయాళ్‌ జంక్షన్‌-సోన్‌ నగర్‌ ప్రత్యేక సరకు రవాణా రైలు మార్గాన్ని ప్రధాని జాతికి అంకితం చేశారు. మొత్తం రూ.6,760 కోట్లతో నిర్మితమైన ఈ కొత్త రైలుమార్గం సరకు రవాణా సామర్థ్యాన్ని, వేగాన్ని  పెంచుతుంది. అలాగే రూ.990 కోట్లతో విద్యుదీకరణ లేదా డబ్లింగ్‌ పనులు పూర్తయిన ఘాజీపూర్ సిటీ-ఔన్రిహార్; ఔన్రిహార్- జాన్పూర్; భట్నీ- ఔన్రిహార్ రైలు మార్గాలను కూడా ఆయన జాతికి అంకితం చేశారు. దీంతో ఉత్తరప్రదేశ్‌లో రైల్వే లైన్ల విద్యుదీకరణ 100 శాతం  పూర్తయింది. మరోవైపు జాతీయ రహదారి-56 పరిధిలో 4 వరుసలుగా విస్తరించబడిన వారణాసి-జాన్‌పూర్ విభాగాన్ని ప్రధాని జాతికి అంకితం చేశారు. ఇది రూ.2750 కోట్లకుపైగా వ్యయంతో పూర్తికాగా, దీనివల్ల వారణాసి-లక్నో మధ్య ప్రయాణ వేగం, సౌలభ్యం కూడా పెరుగుతాయి.

   గరంలో ప్రధాని ప్రారంభించిన బహుళ ప్రాజెక్టులలో 18 ‘పిడబ్ల్యుడి’ రోడ్ల నిర్మాణం, పునరుద్ధరణ పనులున్నాయి. అదేవిధంగా బనారస్‌ హిందూ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్మించిన అంతర్జాతీయ బాలికల వసతిగృహం; సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్-టెక్నాలజీ (సిపెట్) సంస్థ కర్సారా గ్రామంలో ఏర్పాటు చేసిన వృత్తి శిక్షణ కేంద్రం; సింధౌరా పోలీస్‌ స్టేషన్, భుల్లన్‌పూర్‌లోని పిఎసి, పింద్రాలోని ఫైర్ స్టేషన్, తార్పడాలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలకు సంబంధించిన నివాస భవనాలు-ఇతర సదుపాయాలు; ఆర్థిక నేరాల పరిశోధన సంస్థ భవనం; మోహన్ కత్రా-కొనియా ఘాట్ మురుగు పారుదల సదుపాయం, రామనా గ్రామంలో ఆధునిక మురుగు నిర్వహణ వ్యవస్థ; రెండువైపులా వెలిగే  30 ఎల్‌ఈడీ యూనిపోల్స్; రామ్‌నగరంలోని ఎన్‌డిడిబి పాలకేంద్రం ప్రాంగణంలో గోమయం ఆధారిత బయో-గ్యాస్ ప్లాంట్; గంగానదిలో భక్తుల పుణ్యస్నానాలతోపాటు దశాశ్వమేధ ఘాట్ వద్ద ప్రత్యేక తేలియాడే దుస్తుల మార్పు గదుల జెట్టీ వగైరాలను ప్రధాని ప్రారంభించారు.

   వీటన్నిటితోపాటు ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన మరో రూ.780 కోట్ల విలువైన  పనుల్లో- చౌఖండివద్ద మూడు వరుసల రోడ్డు ఓవర్‌ బ్రిడ్జి (ఆర్‌ఓబి); కడీపూర్‌, హర్‌దత్తపూర్‌ రైల్వే స్టేషన్లు; వ్యాస్‌నగర్‌-పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ జంక్షన్‌ రైల్వే ఫ్లైఓవర్‌; 15 పిడబ్ల్యుడి రోడ్ల నిర్మాణం-నవీకరణ వగైరాలున్నాయి. అంతేకాకుండా జల్ జీవన్ మిషన్ కింద రూ.550 కోట్లకుపైగా వ్యయంతో నిర్మించే 192 గ్రామీణ తాగునీటి పథకాలకూ ప్రధాని శంకుస్థాపన చేశారు. వీటి్ద్వారా 192 గ్రామాల్లోని 7 లక్షల మందికి సురక్షిత, పరిశుభ్ర   తాగునీరు సరఫరా అవుతుంది.

   దేవిధంగా మణికర్ణిక-హరిశ్చంద్ర ఘాట్ల పునర్నవీకరణ- పునర్ అభివృద్ధికీ ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ ఘాట్లలో ప్రజల సౌకర్యార్థం వివిధ సదుపాయాలు, కలప నిల్వ, వ్యర్థాల తొలగింపు, పర్యావరణ హిత దహన కేంద్రాలు ఉంటాయి. ఇవేకాకుండా దశాశ్వమేధ ఘాట్‌లోని తేలియాడే దుస్తుల మార్పు గదుల జెట్టీ తరహాలో వారణాసిలోని గంగా నదిపై మతపరంగా కీలకమైన ఆరు స్నాన ఘట్టాల వద్ద కూడా ఇలాంటి జెట్టీలకు, కర్సారాలోని ‘సిపెట్‌’ ప్రాంగణంలో విద్యార్థుల వసతిగృహం నిర్మాణం వంటి పనులకు ఆయన పునాది రాయి వేశారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని లబ్ధిదారులకు ‘పీఎం స్వానిధి కింద 1.25 లక్షల రుణాలతోపాటు 2.88 కోట్ల మందికి ఆయుష్మాన్‌ భారత్‌ కార్డుల పంపిణీని ప్రధానమంత్రి ప్రారంభించారు. అలాగే పీఎంఏవై-గ్రామీణ పథకం కింద గృహప్రవేశం కోసం 5 లక్షల మందికి ఇళ్ల తాళాలను అప్పగించారు.

 

 

***

DS/TS



(Release ID: 1938119) Visitor Counter : 162