రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఆత్మనిర్భర్ భారత్: భారత తీర రక్షణ దళానికి రెండు అధునాతన డోర్నియర్ విమానాలను అందించేందుకు ఎంవోడీ & హెచ్‌ఏఎల్‌ మధ్య రూ.458 కోట్ల విలువైన ఒప్పందం

Posted On: 07 JUL 2023 3:59PM by PIB Hyderabad

భారత తీర రక్షణ దళానికి (ఐసీజీ) రెండు అధునాతన డోర్నియర్ విమానాలను అందించేందుకు, భారత రక్షణ మంత్రిత్వ శాఖ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌తో (హెచ్‌ఏఎల్‌) రూ.458 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై ఇరు వర్గాలు ఇవాళ సంతకాలు చేశాయి. విమానాలతో పాటు అనుబంధ ఇంజినీరింగ్ సేవలను కూడా హెచ్‌ఏఎల్‌ అందించాలి. 'బయ్‌' (ఇండియన్) విభాగం కింద ఈ విమానాలను ఎంవోడీ కొనుగోలు చేస్తోంది.

డోర్నియర్‌ విమానంలో గ్లాస్ కాక్‌పిట్, సముద్ర ప్రాంత పహారా రాడార్, ఎలక్ట్రో-ఆప్టిక్ ఇన్‌ఫ్రా-రెడ్ పరికరం, మిషన్ నిర్వహణ వ్యవస్థ వంటి అధునాతన పరికరాలను అమరుస్తారు. డోర్నియర్‌ విమానాల చేరికతో, ఐసీజీ పరిధిలోని సముద్ర జలాల్లో వైమానిక నిఘా సామర్థ్యం మరింత బలపడుతుంది.

డోర్నియర్ విమానాలను కాన్పూర్‌లోని హెచ్‌ఏఎల్‌లో (ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ విభాగం) దేశీయంగా తయారు చేస్తారు. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘భారతదేశంలో తయారీ’కి అనుగుణంగా, రక్షణ రంగంలో స్వయంసమృద్ధిని సాధించడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది.

 

***



(Release ID: 1938076) Visitor Counter : 117