రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లో రూ.5600 కోట్ల విలువైన 11 జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన శ్రీ నితిన్ గడ్కరీ

Posted On: 04 JUL 2023 3:08PM by PIB Hyderabad

కేంద్ర రోడ్డు రవాణా &జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ, రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లో రూ.5600 కోట్ల రూపాయల విలువైన 11 జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు.

రాజస్థాన్‌లో, మొత్తం 219 కి.మీ. పొడవుతో, రూ.3,775 కోట్ల వ్యయంతో నిర్మించిన నాలుగు జాతీయ రహదారుల ప్రాజెక్టులను నితిన్‌ గడ్కరీ ఇవాళ ప్రారంభించారు. 48వ నంబర్‌ జాతీయ రహదారిపై కిషన్‌గఢ్-గులాబ్‌పుర సెక్షన్‌లో నిర్మించిన 6 వరుసల రహదారి, అజ్మీర్ & భిల్వారా జిల్లాల ఆర్థిక, సామాజిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. గులాబ్‌పుర-చిత్తోర్‌గఢ్ సెక్షన్‌లో నిర్మించిన 6 వరుసల జాతీయ రహదారి, భిల్వారా & చిత్తోర్‌గఢ్ జిల్లాల్లోని ఉదయపూర్, జైపూర్, కోట ప్రాంతాల అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఫతేనగర్ వద్ద, 162ఏ జాతీయ రహదారిపై నిర్మించిన 4 వరుసల ఆర్‌వోబీ, రైల్వే క్రాసింగ్ వద్ద వాహన రద్దీ సమస్యను పరిష్కరిస్తుంది.

సీఆర్‌ఐఎఫ్‌ కింద, మంద్రాయల్‌లో చంబల్ నదిపై నిర్మించిన హైలెవల్ వంతెనను కూడా కేంద్ర మంత్రి ఇవాళ ప్రారంభించారు. ఈ నిర్మాణంతో, రాజస్థాన్‌లోని మంద్రాయల్‌, కరౌలి, మధ్యప్రదేశ్‌లోని సబల్‌గఢ్ ప్రాంతాలు అనుసంధానం అవుతాయి.

రూ.1850 కోట్ల నిర్మాణ వ్యయంతో, మొత్తం 221 కి.మీ. పొడవుతో నిర్మించే 7 ప్రాజెక్టులకు కూడా శ్రీ నితిన్‌ గడ్కరీ శంకుస్థాపన చేశారు. వీటి నిర్మాణం పూర్తయితే, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశం నాథద్వారా-ఉదయపూర్ విమానాశ్రయం మధ్య నేరుగా రాకపోకలకు ఉపయోగపడతాయి. ప్రతాప్‌గఢ్‌ బైపాస్‌ నిర్మాణం వల్ల నగరంపై ట్రాఫిక్‌ ఒత్తిడి తగ్గుతుంది. రాస్ నుంచి బియోరా వరకు రహదారి నిర్మాణంతో భిల్వారా వైపు వాహనాలు అవాంతరాలు లేకుండా, సులభంగా వెళ్లగలుతాయి. దుంగార్‌పూర్, ఉదయ్‌పూర్, బాన్‌స్వారా ప్రాంతాల గిరిజన ప్రాంతాలకు కూడా వాహన రాకపోకలు మెరుగుపడతాయి. సంగవారా, గర్హిలో బైపాస్‌ల నిర్మాణంతో దుంగార్‌పూర్-బన్‌స్వారా మధ్య దూరం 10 కి.మీ. తగ్గుతుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా వన్యప్రాణుల రక్షణ కోసం కూడా నిర్మాణాలు చేపడతారు. బివార్-గోమతి రహదారిలోని తోడ్‌ఘర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో 13 జంతు అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు.

సీఆర్‌ఎఫ్‌ కింద, రాజస్థాన్‌లో రూ.2250 కోట్ల వ్యయంతో 74 కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి కూడా కేంద్ర మంత్రి గడ్కరీ ఈ కార్యక్రమంలో ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టుల పనులు త్వరలో ప్రారంభం అవుతాయి.

 

***


(Release ID: 1937292) Visitor Counter : 159