రక్షణ మంత్రిత్వ శాఖ
అరుషాలో భారత్-టాంజానియా మధ్య ఉమ్మడి రక్షణ సహకార కమిటీ 2వ సమావేశం
Posted On:
29 JUN 2023 4:40PM by PIB Hyderabad
భారతదేశం-టాంజానియా మధ్య ఉమ్మడి రక్షణ సహకార కమిటీ (జేడీసీసీ) రెండో సమావేశం ఈ నెల 28 & 29 తేదీల్లో అరుషాలో జరిగింది. సంయుక్త కార్యదర్శి శ్రీ అమితాబ్ ప్రసాద్ నేతృత్వంలో, టాంజానియాలో పర్యటించిన భారత ప్రతినిధి బృందంలో రక్షణ మంత్రిత్వ శాఖ, సాయుధ దళాల సీనియర్ అధికారులు ఉన్నారు. టాంజానియాలో భారత హైకమిషనర్ శ్రీ బినయ్ ఎస్ ప్రధాన్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
హిందూ మహా సముద్ర ప్రాంతంలో భద్రత పెంచే విషయంలో రెండు దేశాల పరస్పర సహకారంపై ఈ సమావేశంలో చర్చించారు. భారత రక్షణ పరికరాల తయారీ రంగంలో పెరుగుతున్న నైపుణ్యాన్ని భారత ప్రతినిధి బృందం ప్రత్యేకంగా చెప్పింది, మిత్ర దేశాలకు వాటిని ఎగుమతి చేయగలమన్న ఆశాభావం వ్యక్తం చేసింది. రెండు దేశాల రక్షణ సహకారం విషయంలో ఐదేళ్ల ప్రణాళికకు ఇరు వర్గాలు అంగీకరించాయి. సముద్ర రంగ సహకారం కోసం ఆధునిక శిక్షణ & సామర్థ్య పెంపుదల, మౌలిక సదుపాయాల నిర్మాణం, రక్షణ పరికరాలు & సాంకేతికతలో సహకారం వంటివి ఈ ప్రణాళికలో ఉంటాయి.
భారత ప్రతినిధి బృందంతో పాటు డిఫెన్స్ పీఎస్‌యుల ప్రతినిధులు కూడా ఉన్నారు. జేడీసీసీ సమావేశం సందర్భంగా టాంజానియా సాయుధ బలగాలకు చెందిన వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించారు.
బలమైన సామర్థ్య నిర్మాణం, అభివృద్ధి భాగస్వామ్యం ద్వారా టాంజానియాతో సన్నిహిత, స్నేహపూర్వక బంధాన్ని భారతదేశం పంచుకుంటోంది. జేడీసీసీ సమావేశంలో పాల్గొనడానికి భారత ప్రతినిధి బృందం టాంజానియాలో చేపట్టిన పర్యటన, ఆ దేశంతో రక్షణ రంగ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.
****
(Release ID: 1936309)
Visitor Counter : 171