విద్యుత్తు మంత్రిత్వ శాఖ
బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు ₹3,045 కోట్ల ఆర్థిక సహాయం అందించనున్న ఆర్‌ఈసీ లిమిటెడ్
Posted On:
25 JUN 2023 4:13PM by PIB Hyderabad
మహారత్న హోదాలో, కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే ఆర్‌ఈసీ లిమిటెడ్, బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు (బీఎంఆర్‌సీఎల్) రూ.3,045 కోట్లు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. బెంగళూరు మెట్రో ప్రాజెక్టు రెండో దశ కింద మెట్రో లైన్ల ఏర్పాటు, అభివృద్ధి కోసం ఈ రుణం ఇస్తుంది. 24 జూన్ 2023న బెంగళూరులో జరిగిన ఆర్‌ఈసీ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో బీఎంఆర్‌సీఎల్ ప్రతిపాదనను ఆమోదించి, అదనపు ఆర్థిక సాయం కోసం నిర్ణయం తీసుకున్నారు.
నమ్మ మెట్రో తొలి దశలో ప్రస్తుతం ఉన్న రెండు కారిడార్‌ల పొడిగింపు కోసం రెండో దశ ప్రాజెక్టు చేపట్టారు. అవి తూర్పు-పశ్చిమ కారిడార్, ఉత్తర-దక్షిణ కారిడార్. దీంతోపాటు 2 కొత్త లైన్లు నిర్మిస్తారు. అవి ఆర్.వి. రోడ్ నుంచి బొమ్మసంద్రకు ఒకటి, కలేన అగ్రహార నుంచి నాగవరానికి మరో రెండో లైన్ నిర్మిస్తారు. ఈ లైన్లు నగరంలో అధిక వాహన రద్దీ ఉండే కొన్ని ప్రాంతాల నుంచి వెళతాయి.
ప్రాజెక్టు రెండో దశతో ప్రాంతాల అనుసంధానం పెరుగుతుంది, అధిక జనసాంద్రత కలిగిన బెంగళూరు నగరంలో వాహన రద్దీని తగ్గిస్తుంది. రెండో దశ ప్రాజెక్టు (72.09 కి.మీ.) పూర్తయితే, నమ్మ మెట్రో మొత్తం నెట్‌వర్క్ 101 స్టేషన్‌లతో 114.39 కి.మీ. పొడవుతో ఉంటుంది.
ఆర్‌ఈసీ లిమిటెడ్ అనేది భారతదేశంలో విద్యుత్ రంగ రుణాలు, అభివృద్ధిపై దృష్టి పెట్టిన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ. మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు సమకూర్చడంలో ఆర్‌ఈసీ లక్ష్యానికి అనుగుణంగా బీఎంఆర్‌సీఎల్‌కు రుణ మంజూరు జరిగింది. 1969లో స్థాపించిన ఆర్‌ఈసీ లిమిటెడ్, యాభై సంవత్సరాల ప్రయాణం పూర్తి చేసింది. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, పునరుత్పాదక ఇంధనం సహా సంపూర్ణ విద్యుత్ రంగ విలువ గొలుసుకు ఆర్థిక సహాయాన్ని ఈ సంస్థ అందిస్తోంది. ఆర్‌ఈసీ నిధులు భారతదేశంలోని ప్రతి నాలుగు బల్బుల్లో ఒక దానిని వెలిగిస్తున్నాయి.
***
(Release ID: 1935267)
Visitor Counter : 156