రక్షణ మంత్రిత్వ శాఖ
రక్షణ రంగంలో ద్వైపాక్షిక బంధాన్ని బలపరిచేందుకు న్యూదిల్లీలో భారత్ & వియత్నాం రక్షణ మంత్రుల సమావేశం
రెండు దేశాల రక్షణ రంగ పరిశ్రమలు, సముద్ర భద్రత విషయాల్లో భాగస్వామ్యం పెంచుకోవడంపై ప్రధాన దృష్టితో చర్చలు
స్వదేశీ పరిజ్ఞానంతో ఉత్పత్తి చేసిన క్షిపణి ఐఎన్‌ఎస్ కిర్పాన్‌ను వియత్నాంకు బహుమతిగా ఇచ్చిన భారత్
Posted On:
19 JUN 2023 3:22PM by PIB Hyderabad
భారత రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, వియత్నాం రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ గాంగ్ న్యూదిల్లీలో ఇవాళ సమావేశం అయ్యారు. వివిధ ద్వైపాక్షిక రక్షణ రంగ సహకార కార్యక్రమాల్లో పురోగతిపై మంత్రులిద్దరు సమీక్షించి, సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇప్పటికే భాగస్వామ్యం కొనసాగుతున్న రంగాలను, ప్రత్యేకించి రక్షణ రంగ పరిశ్రమల మధ్య సహకారం, సముద్ర భద్రత, బహుళజాతి సహకారం అంశాల్లో సంబంధాలను పెంచుకునే మార్గాలపై చర్చలు జరిగాయి. వియత్నాం పీపుల్స్ నేవీ సామర్థ్యాన్ని పెంచే విషయంలో ఒక మైలురాయిగా నిలిచేలా, స్వదేశీ నిర్మిత ఇన్-సర్వీస్ మిస్సైల్ ఐఎన్‌ఎస్ కిర్పాన్‌ను బహుమతిగా ఇస్తున్నట్లు భారత రక్షణ మంత్రి ప్రకటించారు.
తన పర్యటనలో భాగంగా, వియత్నాం రక్షణ మంత్రి డీఆర్‌డీవో ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. రక్షణ పరిశోధన, ఉమ్మడి ఉత్పత్తిలో సహకారం ద్వారా రక్షణ పారిశ్రామిక రంగ సామర్థ్యాలను పెంపొందించే మార్గాల గురించి చర్చించారు.
దీనికి ముందు, జాతీయ యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అమర వీరులకు జనరల్ ఫాన్ వాన్ గాంగ్ నివాళులు అర్పించారు. ఆయన, రెండు రోజుల పర్యటన కోసం ఈ నెల 18న భారతదేశానికి వచ్చారు. భారతదేశ 'యాక్ట్ ఈస్ట్ పాలసీ'తో పాటు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వియత్నాం ఒక ముఖ్యమైన భాగస్వామ్య దేశం.
******
(Release ID: 1933505)
Visitor Counter : 187