ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

న్యూఢిల్లీలో నిర్వహించే ‘వరల్డ్ ఫుడ్ ఇండియా-2023’లో అంతర్జాతీయ భాగస్వామ్యంపై భారత్‌లోని విదేశీ దౌత్య ప్రతినిధులతో కేంద్ర ఆహార తయారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ రౌండ్ టేబుల్ సమావేశం


న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో 2023 నవంబర్ 3 నుంచి 5వరకు నిర్వహించే రెండో 'వరల్డ్ ఫుడ్ ఇండియా-2023' సంబంధిత అంశాలపై ప్రతినిధులకు వివరణ;

ప్రపంచ ఆహార భద్రతలో భారత్ విశిష్ట పాత్ర... దేశంలోని విస్తృత వనరులు సహా భారీ వినియోగదారు సమూహం వగైరాలపై చర్చాగోష్ఠిలో ప్రముఖంగా ప్రస్తావన

Posted On: 15 JUN 2023 7:25PM by PIB Hyderabad

   న్యూఢిల్లీలో నిర్వహించే ‘వరల్డ్ ఫుడ్ ఇండియా-2023’ (డబ్ల్యూఎఫ్‌ఐ)లో అంతర్జాతీయ భాగస్వామ్యంపై చర్చించడం కోసం కేంద్ర ఆహార తయారీ పరిశ్రమల మంత్రిత్వశాఖ ఇవాళ న్యూఢిల్లీలోని సుష్మాస్వరాజ్‌ భవన్‌లో విదేశీ దౌత్య కార్యాలయ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో 2023 నవంబర్ 3 నుంచి 5వ తేదీవరకూ రెండో 'వరల్డ్ ఫుడ్ ఇండియా-2023'ను మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. భారత ఆహార తయారీ రంగం సామర్థ్యాన్ని ప్రదర్శించడం ద్వారా అంతర్జాతీయ భాగస్వాముల నుంచి సహకారం, పెట్టుబడులను ఆహ్వానించడం ఈ ప్రదర్శన లక్ష్యం. అలాగే అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరం-2023 కార్యకలాపాల్లో భాగంగానూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నందున ‘శ్రీ అన్న’ (చిరుధాన్యాలు), సేంద్రియ ఉత్పత్తులతో స్వదేశీ తయారీ వంటకాలు వగైరాలను ప్రధానంగా ప్రదర్శించనుంది.

   రౌండ్‌ టేబుల్‌ చర్చాగోష్ఠికి కేంద్ర ఆహార తయారీ మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీమతి అనితా ప్రవీణ్‌, విదేశీ వ్యవహారాల శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీ ప్రభాత్‌ కుమార్‌ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఇందులో మొత్తం 47 దేశాల రాయబారులు, హైకమిషనర్లు, ఇన్‌చార్జి దౌత్యాధికారులు, ఇతర సీనియర్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. విదేశీ వ్యవహారాలు, ఆహార తయారీ పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖల నుంచే కాకుండా ‘అపెడా’, ‘ఎంపెడా’, ఇతర కమోడిటీ బోర్డులకు చెందిన పలువురు సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు. అలాగే ‘డబ్ల్యూఎఫ్‌ఐ’ నిర్వహణ సంబంధిత సంస్థలు (ఫిక్కి, ఇన్వెస్ట్ ఇండియా అండ్‌ ఇవై)ల ప్రతినిధులు కూడా చర్చల్లో పాలుపంచుకున్నారు.

   ఈ చర్చల్లో పాల్గొన్న ప్రతినిధులకు ఆహార తయారీ పరిశ్రమల మంత్రిత్వశాఖ కార్యదర్శి, విదేశీ వ్యవహారాల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రదర్శనకు సంబంధించిన వివిధ అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆహార భద్రతలో భారత్ పోషిస్తున్న విశిష్ట పాత్ర గురించి, దేశంలోగల విస్తృత వనరులుసహా భారీ వినియోగదారు సమూహం తదితరాల గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ఇవన్నీ అంతర్జాతీయ భాగస్వాముల పెట్టుబడులను విశేషంగా  ఆకర్షించగల అంశాలని పేర్కొన్నారు. ‘డబ్ల్యూఎఫ్‌ఐ’లో భాగంగా ఆహార తయారీ సంబంధిత వివిధ ఉప-రంగాలు, యంత్ర పరికరాలు, సాంకేతిక ఆవిష్కరణలు, సుస్థిరత అవకాశాలు వగైరాలన్నీ ప్రముఖంగా ప్రదర్శించబడతాయని తెలిపారు.

   ప్రదర్శన నిర్వహణ సన్నాహాలు, భాగస్వామ్య/వ్యాపార సంస్థలకు అందుబాటులోగల అవకాశాల గురించి ఈ చర్చగోష్ఠిలో అధికారులు కూలంకషంగా వివరించారు. ప్రస్తుత ప్రపంచ ఆహార పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రదర్శన నిర్వహణకుగల ప్రత్యేక ప్రాధాన్యాన్ని రాయబార కార్యాలయాల ప్రతినిధులందరూ ప్రశంసించారు. తమతమ దేశాల నుంచి అధిక సంఖ్యలో భాగస్వాములు పాల్గొనేలా కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ముఖ్యంగా తమ దేశాల్లో  ఆహార తయారీ రంగం నుంచి ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాలుపంచుకునేలా చూస్తామని ప్రకటించారు.

   రల్డ్ ఫుడ్ ఇండియా-2023ను విజయవంతం చేయడంలో వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు/ప్రభుత్వ సంస్థలు (వాణిజ్య, ఆయుష్, ‘డోనర్’, ‘ఎంఎస్‌ఎంఇ’ మంత్రిత్వ శాఖలుసహా కమోడిటీ బోర్డులు వగైరా) తమతమ బలాలు, బలగాల తోడ్పాటుతో కృషి చేయనుండటంతో ఇది “సంపూర్ణ ప్రభుత్వం” భావనను ప్రస్ఫుటం చేస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పరిశ్రమ నిపుణుల సమావేశాలు, బి2బి/జి సమావేశాలు, ప్రదర్శనలు, ఫుడ్ స్ట్రీట్ (ప్రత్యేకంగా తయారు చేసిన ఆహార పదార్థాలు రుచి చూపే ప్రాంగణం), ‘రివర్స్ బయ్యర్-సెల్లర్ మీట్’ (ఆర్‌బిఎస్‌ఎం) వంటి కార్యక్రమాల నిర్వహణకూ ప్రణాళిక సిద్ధమైంది. ప్రదర్శనలో పాల్గొనే భాగస్వాములకు ఇవన్నీ తమ విశిష్ట విలువను అవగతం చేస్తాయి.

*****



(Release ID: 1932751) Visitor Counter : 170