ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఇన్నోవేటివ్ టి.బి. హెల్త్ టెక్నాలజీస్ షేరింగ్ ప్లాట్‌ఫాం వర్క్‌షాప్‌ నుద్దేశించి ప్రసంగించిన - కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బఘేల్


భారీ స్థాయిలో అమలు చేయగల నాణ్యమైన ఉత్పత్తులను ఉత్పత్తి చేయాలని ఆవిష్కర్తలకు విజ్ఞప్తి


"స్వచ్ఛ భారత్ మిషన్ వంటి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను ముమ్మరంగా అమలు చేయడం వల్ల నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత సూచికలలో గణనీయమైన మెరుగుదల ఏర్పడింది, ఇది టి.బి. వంటి వ్యాధులను తగ్గించడంలో కూడా సహాయపడుతోంది"

Posted On: 15 JUN 2023 1:13PM by PIB Hyderabad

భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐ.సి.ఎం.ఆర్) ఈ రోజు ఇక్కడ నిర్వహించిన వినూత్న టి.బి. ఆరోగ్య సాంకేతికతల వర్క్‌-షాప్‌ నుద్దేశించి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బఘేల్ ప్రసంగించారు.  టి.బి. కోసం వినూత్నమైన ఆరోగ్య సాంకేతికతలను అంచనా వేయడానికి ప్రోత్సహించడం, టి.బి. ని అంతమొందించే కార్యక్రమాల్లో వాటిని స్వీకరించడం  ఈ రెండు రోజుల వర్క్‌షాప్ యొక్క లక్ష్యం.   వారణాసిలో జరిగిన "స్టాప్-టి.బి." సదస్సులో ప్రదర్శించిన టి.బి. ఇన్నోవేషన్ హెల్త్ టెక్నాలజీల కోసం ఈ వర్క్‌-షాప్ ప్లాట్‌ఫారమ్‌ ను అనుసంధానం చేస్తారు. 

"గౌరవనీయులు ప్రధానమంత్రి రాజకీయ సంకల్పం, నిబద్ధతను, 2025 నాటికి టి.బి. ని నిర్మూలించాలానే  లక్ష్యం ప్రతిబింబిస్తుంది" అని ప్రొఫెసర్ సింగ్ పేర్కొన్నారు.  "గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో టి.బి. కేసులు, నోటిఫికేషన్లు గణనీయంగా తగ్గాయి." అని కూడా ఆయన తెలియజేశారు.   ఈ మిషన్ విజయానికి ఆవిష్కరణ కీలకమని నొక్కి చెప్పిన ఆయన, నాణ్యమైన ఉత్పత్తులను ఉత్పత్తి చేయాలని ఆవిష్కర్తలను కోరారు.  

గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చైతన్యవంతమైన నాయకత్వంలో,  "స్వచ్ఛ భారత్ మిషన్ వంటి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను ముమ్మరంగా అమలు చేయడం వల్ల నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత సూచికలలో గణనీయమైన మెరుగుదల ఏర్పడింది, ఇది టి.బి.  వంటి వ్యాధులను తగ్గించడంలో కూడా సహాయపడుతోంది." అని మంత్రి నొక్కి చెప్పారు.  టి.బి. రోగులు ఇప్పుడు వారి ఆయుష్మాన్ భారత్ కార్డులతో చికిత్స పొందవచ్చునని కూడా ఆయన తెలియజేశారు.

భారతదేశంలో ఆరోగ్య సంరక్షణకు ప్రముఖులు  చేసిన కృషికి ప్రొఫెసర్ ఎస్‌.పి. సింగ్ బఘేల్ కృతజ్ఞతలు తెలిపారు.   "అర్ధవంతమైన విధానాలు, కార్యక్రమాలను రూపొందించడంలో మాత్రమే కాకుండా ప్రభుత్వంతో కలిసి పని చేయాలని, అవి పూర్తి స్థాయిలో అమలయ్యేలా కూడా చూడాలి.  గౌరవనీయులు ప్రధానమంత్రి ఆశించిన విధంగా 2025 నాటికి టి.బి.ని అంతం చేయాలనే లక్ష్యాన్ని మన దేశం సాధించే విధంగా కృషి చేయాలి." అని కోరారు.   కోవిడ్ మహమ్మారి సమయంలో అవిశ్రాంతంగా పనిచేసి, ఒక సంవత్సరం లోపు స్వదేశీ వ్యాక్సిన్‌ ను ఉత్పత్తి చేసినందుకు ఐ.సి.ఎం.ఆర్. సంస్థను కూడా ఆయన అభినందించారు.

కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ మాట్లాడుతూ, టి.బి.ని నిర్మూలించే లక్ష్యం ఆవిష్కరణల నేపథ్యంలో మాత్రమే విజయవంతమవుతుందని పేర్కొన్నారు.  వ్యాధిని సమర్థవంతంగా నిర్మూలించడానికి రోగ నిర్ధారణ, చికిత్సతో పాటు సమాజ ప్రమేయం కూడా అనివార్యమని ఆయన పేర్కొన్నారు.  టి.బి. నిర్మూలనకు పూర్తి-ప్రభుత్వం మరియు మొత్తం-సమాజం అనే విధానం అవసరమని కూడా అతను నొక్కి చెప్పారు.  

వినూత్నమైన పైలట్ ఉత్పత్తులను తీసుకురావడమే కాకుండా, ప్రోగ్రామాటిక్ పద్ధతిలో రూపొందించగల ఆవిష్కరణలను తీసుకురావాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ఆవిష్కర్తలను కోరారు.   రెండు రోజుల పాటు జరిగే ఈ చర్చలు భారతదేశానికి వినూత్నమైన ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకు రాగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆరోగ్య పరిశోధన విభాగం (డి.హెచ్.ఆర్) కార్యదర్శి మరియు ఐ.సి.ఎం.ఆర్., డి.జి. డాక్టర్ రాజీవ్ బహ్ల్ మాట్లాడుతూ, ఏదైనా ఆరోగ్య సమస్యల  పరిష్కారానికి, సాంకేతిక పరిష్కారాలు అనివార్యమని పేర్కొన్నారు.  భారతదేశంలో చాలా మంది ఆవిష్కర్తలు ఉన్నారని, అయితే నియంత్రణ సవాళ్లు లేదా ఆలస్యమైన ఆమోదాలు మొదలైన వివిధ కారణాల వల్ల చాలా ఆవిష్కరణలు క్షేత్ర స్థాయికి చేరుకోవడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.  ఈ సవాళ్లను అధిగమించడంతో పాటు, కేవలం టి.బి. మాత్రమే కాకుండా భవిష్యత్తులో వచ్చే ఎటువంటి మహమ్మారి సంసిద్ధత కోసమైనా ఉపయోగపడే, సాంకేతిక అవసరాలపై ఆవిష్కర్తలకు మరింత సమాచారం అందించడం ఈ వర్క్‌-షాప్ ప్రధాన లక్ష్యమని ఆయన నొక్కి చెప్పారు.

డబ్ల్యూ.హెచ్‌.ఓ. మాజీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ మాట్లాడుతూ, టీ.బీ. అనేది చాలా కాలంగా వస్తున్న సమస్య అని, అయితే ఆలస్యంగా దీనిని నిర్మూలించడంపై పెద్దఎత్తున దృష్టి పెట్టడం జరిగిందనీ, ఎందుకంటే, ముఖ్యంగా, పేదలకు ఇది పెద్ద భారమని, పేర్కొన్నారు.  "గతంలో పోలియో వంటి ఇతర వ్యాధులకు చూసినట్లుగా, దీనిని నిర్మూలించడంలో భారతదేశం సాధించిన విజయం, ప్రపంచ వ్యాప్తంగా దాని నిర్మూలనలో చాలా వరకు సహాయపడుతుంది" అని ఆమె ప్రముఖంగా పేర్కొన్నారు.   "ఆరోగ్య సంరక్షణ కోసం అందుబాటులో ఉన్న స్థోమత, ఆవిష్కరణల కారణంగా ప్రపంచం కూడా భారతదేశం వైపు చూస్తోంది" అని ఆమె పేర్కొన్నారు.   అతి తక్కువ సమయంలో ఫలితాన్ని అందించడానికి తగినంత ప్రభావవంతమైన రోగనిర్ధారణ పరీక్షను అభివృద్ధి చేసే సామర్థ్యాన్ని భారతదేశం పరిశీలిస్తోందని ఆమె తెలియజేశారు. 

ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ అశోక్ బాబు, ఆరోగ్య పరిశోధన శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి అను నగర్, చెన్నై లోని జాతీయ క్షయ వ్యాధి పరిశోధనా సంస్థ (ఎన్.ఐ.ఆర్.టి) డైరెక్టర్ డాక్టర్ పద్మ ప్రియదర్శిని తో పాటు, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

*****



(Release ID: 1932746) Visitor Counter : 121