రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ః భార‌త సైన్య క‌మ్యూనికేష‌న్ల వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేసేందుకు రూ. 500 కోట్ల ఒప్పందంపై సంత‌కాలు చేసిన ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

Posted On: 15 JUN 2023 5:09PM by PIB Hyderabad

స్వ‌దేశీ ర‌క్ష‌ణ ప‌రిక‌రాల త‌యారీకి మ‌రింత ప్రోత్సాహాన్ని ఇస్తూ, ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ దార్శ‌నిక‌త‌ను సాకారం చేసుకునేందుకు ప్రైవేటు రంగాన్ని ప్రోత్స‌హిస్తూ, ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ 15 జూన్ 2023న న్యూఢిల్లీలో ఐసిఒఎంఎం టెలి లిమిటెడ్ హైద‌రాబాద్‌తో 57.5 ట‌న్నుల 1,035 రేడియో రిలే క‌మ్యూనికేష‌న్ ప‌రిక‌రాల వాహ‌నాల‌ను కొనుగోలు చేసేందుకు ఒప్పందం పై సంత‌కాలు చేసింది.  బై (ఇండియ‌న్‌) వ‌ర్గం కింద ఈ కాంట్రాక్టు విలువ దాదాపు రూ. 500 కోట్లు. ఈ వాహ‌నాలు బ‌ట్వాడా ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం 2023-24 నుంచి ప్రారంభం కానుంది. 
భార‌తీయ సైన్య దీర్ఘ‌కాల ఆవ‌శ్య‌క‌త అయిన మొబైల్ క‌మ్యూనికేష‌న్ డిటాచ్‌మెంట్ల ( సుర‌క్షితంగా స‌మాచార మార్పిడికి) స‌మ‌స్య‌ను రేడియో రిలే కంటైన‌ర్లు తీర్చ‌నున్నాయి. ఈ వాహ‌నాలు పూర్తి సుర‌క్షిత‌మైన‌, విశ్వ‌స‌నీయ‌మైన రీతిలో స‌మాచార మార్ప‌డికి పూర్తి ర‌క్షిత వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించేందుకు ఈ కంటైన‌ర్లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.  ఈ కంటైన‌ర్ల‌ను అధీకృత ప్ర‌త్యేక వాహ‌నాల పై ఎక్కించి, కార్యాచ‌ర‌ణ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్టుగా త‌ర‌లిస్తారు. 
దేశీయ ఉత్ప‌త్తిదారుల నుంచి సేక‌రించిన ప‌రిక‌రాలు, ఉప‌వ్య‌వ‌స్థ‌ల‌తో ఈ కంటైన‌ర్ల‌ను కంపెనీ ఉత్ప‌త్తి చేస్తుంది.  ఇది ర‌క్ష‌ణ ప‌రిక‌రాల స్వ‌దేశీ త‌యారీకి మ‌రింత ప్రోత్సాహాన్ని ఇవ్వ‌డ‌మే కాక ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ దార్శ‌నిక‌త‌ను సాకారం చేయ‌డంలో  ప్రైవేటు రంగం చురుకుగా పాల్గొన‌డానికి ప్రేర‌ణ‌ను ఇస్తుంది. 
ఇటువంటి అత్యాధునిక ప‌రిక‌రాల అభివృద్ధి స్నేహ‌పూర్వ‌క దేశాల‌కు ఎగుమ‌తుల‌ను పెంచ‌డంలో కూడా తోడ్ప‌డుతుంది. 

***



(Release ID: 1932736) Visitor Counter : 140