విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర విద్యుత్. నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రిని కలిసి, ప్రపంచ ఇంధన పరివర్తనను వేగవంతం చేయడానికి అవసరమైన సహకారం గురించి చర్చించిన - ఫ్రెంచ్ ప్రతినిధి బృందం


పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు బీమా పాత్ర, చెల్లింపు భద్రతా యంత్రాంగం, పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులను ఆకర్షించడంలో రుణ పెట్టుబడి విధానం గురించి నొక్కి చెప్పిన - కేంద్ర మంత్రి

Posted On: 14 JUN 2023 11:34AM by PIB Hyderabad

కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి  ఆర్.కె. సింగ్ నిన్న, జూన్, 13వ తేదీన న్యూ ఢిల్లీలోని శ్రమ శక్తి భవన్‌ లో యూరప్ మరియు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న అభివృద్ధి, ఫ్రాంకోఫోనీ, అంతర్జాతీయ భాగస్వామ్యాల విభాగం  సహాయ మంత్రి క్రిసౌలా జచరోపౌలౌతో సమావేశమయ్యారు.  ఫ్రెంచ్ సహాయ మంత్రి తో పాటు, భారతదేశానికి ఫ్రాన్స్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనైన్‌,  సహాయ మంత్రికి రాజకీయ సలహాదారుడు గుయిలౌమ్ పాటియర్, భారతదేశంలోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయంలో రాజకీయ సలహాదారుడు పాబ్లో అహుమదా కూడా కేంద్ర మంత్రి తో సమావేశమైన వారిలో ఉన్నారు. 

చర్చలో కీలకమైన అంశం ఏమిటంటే, సౌరశక్తితో నడిచే ప్రపంచ ఇంధన పరివర్తనను వేగవంతం చేయడం.  ముఖ్యంగా అంతర్జాతీయ సౌర కూటమికి చెందిన సంస్థాగత ఫ్రేమ్‌ వర్క్‌ లో భారతదేశం అధ్యక్ష స్థానంలో ఉండగా, ఫ్రాన్స్ సహ-అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తోంది. 

"గ్రీన్ ఫండ్స్ అవసరమైన దేశాలకు సహాయం చేయాల్సిన అవసరం ఉంది"

భారతదేశ కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి మాట్లాడుతూ, అంతర్జాతీయ సౌర కూటమి, ముఖ్యంగా ఆఫ్రికాలో మరిన్ని సౌర శక్తి ప్రాజెక్టులను చేపట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.  "ఆర్థికంగా బలమైన దేశాలు పునరుత్పాదక ఇంధన నిధులను స్వయంగా సమకూర్చుకుంటాయి, అయితే, ఆర్థికంగా బలహీనమైన దేశాలకు గ్రీన్ ఫండ్స్ అవసరం ఉంటుంది.  ఆ విధంగా, నిధులు అవసరమైన దేశాలకు మనం సహాయం చేయాలి.” అని ఆయన సూచించారు. 

ఆఫ్రికా ఖండంలో దాదాపు సగానికి పైగా విద్యుత్ అందుబాటులో లేదని ఇరుపక్షాలు గమనించాయి.  ఇంధన పరివర్తనతో పాటు, ఇంధన ప్రాప్యతను నిర్ధారించడంపై కూడా దృష్టి కేంద్రీకరించాలని, భారత ప్రభుత్వ కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి పేర్కొంటూ, ఈ దిశలో ఐ.ఎస్.ఏ. ముందుకు సాగడానికి సహాయం చేయవలసిన అవసరం గురించి వివరించారు.  ఆఫ్రికాలో డీకార్బనైజేషన్ సమస్య లేదని రెండు పక్షాలు గమనించాయి.  అయితే, ప్రస్తుతం విద్యుత్తుకు ప్రాప్యత చాలా పరిమితంగా ఉంది.  ఈ నేపథ్యంలో, సౌరశక్తి ద్వారా విద్యుత్ పొందడం చౌకైన, సులభమైన ఎంపిక అని మంత్రి చెప్పారు.

గ్రీన్ ఎనర్జీ ఇన్సూరెన్స్చెల్లింపుల భద్రతా వ్యవస్థరుణ సదుపాయం అవసరం ఉంది.  

పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు బీమా, చెల్లింపు భద్రతా విధానం, రుణ ఫైనాన్సింగ్ కోసం ఏర్పాట్లు వంటి మూడు నిధుల ఆవశ్యకతను మంత్రి వివరించారు.    “ఒకసారి స్థాపించబడిన తర్వాత, ఈ నిధులు విరాళాలు, వడ్డీ చెల్లింపుల కారణంగా పెరుగుతాయి; భారతదేశంలో కూడా, చెల్లింపు భద్రతా యంత్రాంగంగా ఏర్పాటు చేసిన నిధి కారణంగా మన పెట్టుబడి వస్తోంది,” అని మంత్రి తెలియజేశారు. 

డి-రిస్కింగ్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, ఐ.ఎస్.ఏ. మరిన్ని హరిత నిధులు ఉపయోగించాలని, తద్వారా ఆఫ్రికా ఖండంలో గ్రిడ్-స్కేల్ సౌర విద్యుత్ ప్రాజెక్టులను ప్రోత్సహించాలని శ్రీ ఆర్.కె. సింగ్ సూచించారు. 

పునరుత్పాదక ఇంధనం రంగంలో కెన్యా సాధించిన విజయాన్ని కూడా ఇరుపక్షాలు గమనించాయి,  కెన్యాలో ఐ,ఎస్,ఏ. ద్వారా ఒక సమావేశాన్ని నిర్వహించాలనే ఆలోచనపై కూడా వారు చర్చించారు.

భారతదేశ తలసరి ఉద్గారాలు ప్రపంచ సగటులో మూడింట ఒక వంతు ఉన్నప్పటికీ, ఇంధన పరివర్తనలో దేశం అత్యంత వేగంగా ఉందని పర్యటనకు వచ్చిన ప్రతినిధుల బృందానికి మంత్రి వివరించారు.   ఈ రోజు మన సామర్థ్యంలో 43 శాతం శిలాజ రహిత ఇంధనాల నుండి వచ్చినప్పటికీ, 2030 నాటికి మన ఉద్గార తీవ్రతను 45 శాతం తగ్గించడానికి కట్టుబడి ఉన్నామని ఆయన తెలియజేశారు.  గ్రీన్ హైడ్రోజన్‌ ఉత్పత్తి, వాడకంలో భారతదేశం ప్రపంచ అగ్రగామిగా ఉండబోతోందని, దేశం వేగంగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని జోడిస్తోందని, ఇది నిర్ణీత సమయంలో ఇంధన వ్యయాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుందని ఆయన ఈ సందర్భంగా  పేర్కొన్నారు. 

*****

 


(Release ID: 1932471) Visitor Counter : 166