వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

టోకు వర్తకులు / ట్రేడర్లు, చిల్లర వర్తకులు, రిటైల్ దుకాణాల శ్రేణి వర్తకులు మరియు ప్రాసెసర్లకు గోధుమ స్టాకు పరిమితి విధించిన కేంద్రం


గోధుమ నిల్వలపై పరిమితి తక్షణం అమలులోకి వచ్చి 2024 మార్చి 31వరకు కొనసాగుతుంది

మొదటి దశలో కేంద్ర నిల్వల నుంచి 15 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమను ఓపెన్ మార్కెట్ అమ్మకం స్కీము కింద సరుకు దింపడం జరుగుతుంది.

Posted On: 12 JUN 2023 8:16PM by PIB Hyderabad

అదే విధంగా మార్కెట్లో ధరలు తగ్గించేందుకు ఓపెన్ మార్కెట్ అమ్మకం స్కీము (ఓ ఎం ఎస్ ఎస్) కింద బియ్యం కూడా విడుదల  చేస్తారు.   ఓపెన్ మార్కెట్ లోకి దింపే బియ్యం పరిమాణం ఎంతో త్వరలో నిర్ణయిస్తారు

మార్కెట్ లో నిత్యావసర సరుకుల ధరలను స్థిరీకరించే ప్రయత్నాలలో భాగంగా  వివిధ వ్యాపార వర్గాలు గోధుమ స్టాక్ పెట్టుకోవడంపై పరిమితి విధించడంతో పాటు మార్కెట్ లోకి గోధుమ, బియ్యం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  

      ఆహార భద్రతతో పాటు అక్రమ నిల్వలను, నీతిమాలిన స్పెక్యులేషన్ అరికట్టడానికి ప్రభుత్వం స్టాకుపై పరిమితిని విధించాలని నిర్ణయించింది. అన్ని రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాల  టోకు వర్తకులు / ట్రేడర్లు,  చిల్లర వర్తకులు,  పెద్ద శ్రేణి రిటైలర్లు మరియు ప్రాసెసర్లకు గోధుమ స్టాకు పెట్టుకోవడంపై  పరిమితి ఉంటుంది.  లైసెన్సు అవసరం ఎత్తివేత, స్టాకు పరిమితులు మరియు  ఎంపిక చేసిన ఆహార పదార్ధాల రవాణాపై ఆంక్షలు (సవరణ) ఉత్తర్వు, 2023 ప్రకారం 2023 జూన్ 12వ తేదీనుంచి 31 మార్చి 2024 వరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.  

           వ్యాపారుల స్థాయిని బట్టి స్టాకు పరిమితులు ఉంటాయి.  ట్రేడర్లు / టోకు వ్యాపారి --  3000 మెట్రిక్ టన్నులు,  చిల్లర వర్తకులు -- ప్రతి రిటైల్ అవుట్ లెట్ 10 మెట్రిక్ టన్నులు, చిల్లర దుకాణాల శ్రేణి ఉన్న పెద్ద వ్యాపారికి ప్రతి దుకాణానికి 10 మెట్రిక్ టన్నులు,  టోకు వ్యాపారికి చెందిన అన్ని దుకాణాలు, డిపోలకు కలిపి 3000 మెట్రిక్ టన్నులు మరియు ప్రాసెసర్లకు వారి వార్షిక స్థాపిత సామర్థ్యంలో 75%.  
ఆయా  వ్యాపారాలు / సంస్థలు తమ వద్ద నిల్వ ఉన్న స్టాకును గురించి ప్రతిరోజూ ఆహార మరియు ప్రజాపంపిణీ శాఖ  వెబ్ సైట్ (https://evegoils.nic.in/wsp/login) లో తాజాపరచాలి.  ఒకవేళ తమవద్ద పరిమితికి మించి స్టాకు ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్ జారీ చేసిన 30 రోజుల లోగా నిల్వలను పరిమిత స్థాయికి తగ్గించాలి.  

     గోధుమ చిల్లర ధరను నియంత్రించడానికి మొదటి దశలో కేంద్ర నిల్వల నుంచి 15 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమను ఓపెన్ మార్కెట్ అమ్మకం స్కీము (దేశీయ) కింద ఈ-వేలం ద్వారా పిండి మిల్లులకు / ప్రైవేటు వర్తకులకు / భారీ కొనుగోలుదార్లకు / గోధుమ ఉత్పత్తుల తయారీదార్లకు అమ్ముతారు.  గోధుమను 10-100 మెట్రిక్ టన్నుల సైజులో అమ్ముతారు.  ఈ వేలంలో పాల్గొనదలచిన వారు భారత ఆహార సంస్థ (ఎఫ్ సి ఐ) ఈ - వేలం ప్లాట్ ఫారంపై నమోదు చేసుకోవాలి.    

     అదే విధంగా మార్కెట్లో ధరలు తగ్గించేందుకు ఓపెన్ మార్కెట్ అమ్మకం స్కీము (ఓ ఎం ఎస్ ఎస్) కింద బియ్యం కూడా విడుదల  చేస్తారు.   ఓపెన్ మార్కెట్ లోకి దింపే బియ్యం పరిమాణం ఎంతో త్వరలో నిర్ణయిస్తారు

     ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ దేశంలో నిత్యావసరాల ధరలను నియంత్రించడంతో పాటు అవి సులభంగా లభ్యం కావడాన్ని నిశ్చయపరచుకునేందుకు  పరిస్థితిని పర్యవేక్షిస్తున్నది.  

***



(Release ID: 1932226) Visitor Counter : 186