రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

వ్యాక్సిన్ అభివృద్ధి కోసం పరిశోధన, అభివృద్ధి అంశాలపై ప్రపంచ స్థాయి సహకారంపై జీ-20 ఆధ్వర్యంలో జరిగిన సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

Posted On: 03 JUN 2023 2:15PM by PIB Hyderabad

"కోవిద్ -19 మహమ్మారి వల్ల  వ్యాక్సిన్ పరిశోధన , అభివృద్ధి లో ప్రపంచ స్థాయి సహకారం  ప్రాముఖ్యత వెల్లడయింది.  శతాబ్దానికి ఒకసారి సంభవించే కోవిడ్ లాంటి  ప్రజారోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి జరిగిన ప్రయత్నాలతో  అభివృద్ధి చెందుతున్న వ్యాధికారక కారకాల కోసం వ్యాక్సిన్ అభివృద్ధి వేగవంతం చేయడానికి పరిశోధన ప్రాముఖ్యతను భారతదేశం గుర్తించింది" .. డాక్టర్ మాండవీయ 

విస్తరిస్తున్న వ్యాధికారక కారకాల నివారణ కోసం వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి అంతర్జాతీయ సహకారం అవసరం.. డాక్టర్ మాండవీయ 

ప్రభుత్వాలు, పరిశోధనా సంస్థలు, ఫార్మా సంస్థలు, సంబంధిత వర్గాల మధ్య సమన్వయం సాధించడానికి  జీ-20 ఒక ముఖ్య వేదికగా పనిచేస్తుంది... డాక్టర్ మాండవీయ 

" సమర్ధంగా పనిచేసే వ్యాక్సిన్ అభివృద్ధి, వినియోగం వల్ల ఆరోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తకుండా నివారించవచ్చు. లక్ష్య సాధన కోసం పరిశోధన కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చి అమలు చేయాలి." .. డాక్టర్ మాండవీయ 

హైదరాబాద్, జూన్ 3:

' వ్యాక్సిన్ పరిశోధన, అభివృద్ధి అంశాల్లో దేశాల మధ్య సహకారం, సమన్వయం ప్రాధాన్యతను  కోవిడ్-19 మహమ్మారి గుర్తు చేసింది.శతాబ్దానికి ఒకసారి సంభవించే కోవిడ్ లాంటి  ప్రజారోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి జరిగిన ప్రయత్నాలతో భవిష్యత్తులో ఎదురయ్యే వ్యాధి కారకాల నిరోధానికి వ్యాక్సిన్ అభివృద్ధి చేయాల్సిన ప్రాధాన్యతను భారతదేశం గుర్తించింది" అని కేంద్ర ఆరోగ్య, రసాయనాలు,ఎరువుల శాఖ మంత్రి  డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. " వ్యాక్సిన్ పరిశోధన, అభివృద్ధి: భవిషత్తులో సంభవించే అవకాశం ఉన్న వ్యాధి కారకాల నివారణ, సంసిద్ధత, ప్రతిస్పందన" అనే అంశంపై జరిగిన అంతర్జాతీయ స్థాయి చర్చా కార్యక్రమంలో డాక్టర్ మాండవీయ వర్చువల్ విధానంలో ప్రసంగించారు. హైదరాబాద్ లో ఈ రోజు జరిగిన జీ-20  హెల్త్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో భాగంగా కేంద్ర ఫార్మస్యూటికల్స్ శాఖ సమావేశాన్ని నిర్వహించింది. 

భవిష్యత్తులో తలెత్తే ప్రమాదం ఉన్న వ్యాధి వ్యాప్తి కారకాల నిరోధానికి అవసరమైన వ్యాక్సిన్ పై పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలకు అంతర్జాతీయ సదస్సు ఒక వేదికగా పనిచేస్తుందన్న ఆశాభావాన్ని డాక్టర్ మాండవీయ వ్యక్తం చేశారు. " వ్యాక్సిన్ అభివృద్ధి ఒక కీలకమైన అంశం.భవిష్యత్తులో ఆరోగ్య సంక్షోభ పరిస్థితి తలెత్తకుండా చూడడానికి వ్యాక్సిన్ అభివృద్ధి చేసే అంశంలో ప్రపంచ స్థాయిలో సంఘటిత ప్రయత్నాలు జరగాల్సిన అవసరం ఉంది" అని డాక్టర్ మాండవీయ పేర్కొన్నారు. " భవిష్యత్తులో తలెత్తే అవకాశం ఉన్న ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి ప్రపంచ దేశాల మధ్య సహకారం అవసరం. దీనికోసం  ప్రభుత్వాలు, పరిశోధనా సంస్థలు, ఫార్మా సంస్థలు, సంబంధిత వర్గాల మధ్య సమన్వయం సాధించడానికి  జీ-20 ఒక ముఖ్య వేదికగా పనిచేస్తుంది" అని డాక్టర్ మాండవీయ అన్నారు. 

వ్యాక్సిన్ పరిశోధన, అభివృద్ధి, ఉత్పత్తి అంశాలలో గత కొద్ది శతాబ్దాలుగా ప్రపంచంలో భారతదేశం అగ్రగామిగా ఉందని డాక్టర్ మాండవీయ అన్నారు. పోలియో, మశూచి, మీజిల్స్ వంటి వ్యాధులకు వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేయడం, ఉత్పత్తి చేయడం మరియు పంపిణీలో అనేక దశాబ్దాలుగా భారతదేశం ముందు ఉందని  డాక్టర్ మాండవీయ అన్నారు వ్యాక్సిన్ అభివృద్ధి అంశంలో భారతదేశం  విజయాలు   ప్రపంచ సహకారాన్ని సాధించడంలో  కీలక పాత్ర పోషిస్తాయన్నారు.  "ప్రభావవంతమైన వ్యాక్సిన్‌ల అభివృద్ధి, పంపిణీ వల్ల ఆరోగ్య సంక్షోభం  ప్రభావాన్ని తగ్గించడానికి అవకాశం కలుగుతుంది.ఈ లక్ష్యాన్ని సాధించడానికి  పరిశోధన అంశానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి" అని ఆయన అన్నారు. 

వ్యాక్సిన్ ఉత్పత్తి ,సరఫరాను ఎక్కువ చేయడానికి భారతదేశం చేస్తున్న ప్రయతనాలు వివరించిన డాక్టర్ మాండవీయ " ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి వ్యాక్సిన్ తయారీదారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహకాలు, క్రమబద్ధీకరించిన నియంత్రణ ప్రక్రియలను అందించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో అందుబాటులో ఉన్న  ప్రస్తుత మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో టీకాల లభ్యత పెరిగేలా చూడడానికి   కూడా ఇది చర్యలు అమలు చేస్తున్నాం" అని ఆయన వివరించారు. 

ఆరోగ్య సంరక్షణ రంగానికి భారతదేశం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాదని డాక్టర్ మాండవీయ స్పష్టం చేశారు. దీనిలో భాగంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపిన మంత్రి అందరికీ  వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చి సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కోసం కృషి చేస్తున్నదని అన్నారు. వ్యాక్సిన్ అభివృద్ధి, పరిశోధన రంగాలలో భారతదేశం సాధించిన ప్రగతిని ప్రపంచ దేశాలు ఉపయోగించుకుని భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు.కోవిడ్ -19 వ్యాక్సిన్‌ ఉత్పత్తి , పంపిణీలో భారతదేశం కీలకంగా వ్యవహరించి  ప్రపంచ ఆరోగ్య భద్రత పట్ల తనకున్న చిత్తశుద్ధి చాటింది అని  మంత్రి అన్నారు.  “వ్యాక్సిన్ రంగంలో సమానత్వం  అవసరమని భారతదేశం గుర్తించింది. ఆదాయం, జాతీయత లాంటి అంశాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి  ప్రాణాలను రక్షించే వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావాలి అన్నది భారతదేశం అభిమతం ” అని ఆయన వివరించారు. 

మహమ్మారి నివారణ, సంసిద్ధత, ప్రతిస్పందన కోసం పటిష్ట ఆరోగ్య వ్యవస్థ అభివృద్ధి కోసం ప్రపంచ దేశాల మధ్య సహకారం అవసరం అని  కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ పేర్కొన్నారు. భారతదేశం సాంప్రదాయకంగా ప్రపంచ అగ్రగామిగా ఉంది అని తెలిపిన  శ్రీ రాజేష్ భూషణ్ జెనరిక్స్  బయోసిమిలర్‌లలో  భారతదేశం ప్రపంచంలో అగ్ర స్థానంలో ఉందన్నారు.   ప్రధాన భారతీయ వ్యాక్సిన్ తయారీదారులు ప్రపంచ వ్యాక్సిన్ సరఫరాలో 50% కంటే ఎక్కువ సరఫరా చేస్తున్నారన్నారు.  వ్యాక్సిన్ తయారీ కాలక్రమాన్ని దశాబ్దాల నుండి ఒక సంవత్సరం కంటే తక్కువ లో  ఉండాలని కోవిడ్-19 వల్ల తెలిసిందన్నారు.  "మహమ్మారి సమయంలో నేర్చుకున్న గుణపాఠాలను  ఒక వ్యవస్థగా వ్యవస్థాగతీకరించడం అవసరం, ఇది దేశాలు దాటి, ఖండాలలో విస్తరించి ఉంటుంది .  అందరికీ సమానమైన రీతిలో వ్యాక్సిన్  అందుబాటులో ఉండాలని కోవిడ్ వల్ల తెలిసింది " అని ఆయన చెప్పారు.

ఫార్మాస్యూటికల్స్ విభాగం కార్యదర్శి శ్రీమతి ఎస్ అపర్ణ మాట్లాడుతూ వ్యాక్సిన్ అభివృద్ధికి ప్రపంచ స్థాయిలో సహకారం అవసరం అని స్పష్టం చేశారు. అన్ని దేశాలకు వ్యాక్సిన్ సకాలంలో అందడం లేదన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ కొన్ని దేశాలకు 18 నెలల తర్వాత అందడం దీనికి నిదర్శనం అని అన్నారు. అన్ని దేశాలకు సకాలంలో వ్యాక్సిన్ అందుబాటులో ఉండే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం లక్ష్యంగా ప్రపంచ సదస్సు జరుగుతుందన్నారు. దీనివల్ల విలువైన వనరులు పూర్తిగా సమర్ధంగా వినియోగం అవడానికి కల్తీ నిరోధానికి అవకాశం కలుగుతుందన్నారు. 


తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ జయేష్ రంజన్  మాట్లాడుతూ హైదరాబాదులో ప్రతి సంవత్సరం 9 మిలియన్ వ్యాక్సిన్ డోస్‌లు ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు.  ఇది ప్రతి సంవత్సరం ఉత్పత్తి అవుతున్న  మొత్తం వ్యాక్సిన్‌లలో మూడింట ఒక వంతుకు సమానమని అన్నారు.  భారతదేశ మొట్టమొదటి స్వదేశీ కోవిడ్-19 వ్యాక్సిన్, కోవాక్సిన్ పూర్తిగా హైదరాబాద్‌లో పరిశోధించబడి ఉత్పత్తి అయ్యిందన్నారు. స్పుత్నిక్ వంటి ఇతర ప్రపంచ ప్రఖ్యాత వ్యాక్సిన్‌ లకు సంబంధించిన పరిశోధన, అభివృద్ధిలో కొంత భాగం    హైదరాబాద్‌లో జరిగాయని  ఆయన పేర్కొన్నారు.  దేశీయ సంస్థలతో సహకరించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించిన    శ్రీ జయేష్ రంజన్   నగరంలో పరిశోధన  అభివృద్ధి ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రపంచ వ్యాక్సిన్ తయారీదారులను ఆహ్వానించారు. 

నేపథ్యం: 
ప్రతిపాదిత గ్లోబల్ వ్యాక్సిన్ పరిశోధన కోసం జీ-20  సభ్య దేశాలు, ప్రత్యేక ఆహ్వానిత దేశాల మధ్య   ఏకాభిప్రాయాన్ని సాధించడానికి  ఫార్మాస్యూటికల్స్ విభాగం ప్రోగ్రామ్ ఫర్ అప్రోప్రియేట్ టెక్నాలజీ ఇన్ హెల్త్ (PATH) , కోయలిషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్‌నెస్ ఇన్నోవేషన్స్ (CEPI)తో కలిసి పని చేస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో ఎదురయ్యే ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఎదుర్కోవడానికి  వ్యాక్సిన్ అభివృద్ధి కోసం పరిశోధనలో ఎదురవుతున్న సమస్యలు పరిష్కారం కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి కృషి జరుగుతుంది. 
రేపటి నుంచి ప్రారంభం కానున్న 3వ జీ-20 హెల్త్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు కార్యకమం నంది పలికింది.  . ఈరోజు చర్చకు వచ్చిన సిఫార్సులు,విధానాలను మరింత లోతుగా చర్చిస్తారు.   ఆరోగ్య కార్యవర్గ సమావేశాలలో వీటిపై చర్చలు జరుపుతారు.
ఆరోగ్య పరిశోధన విభాగం కార్యదర్శి  డాక్టర్ రాజీవ్ బహ్ల్,ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్, జెరెమీ J ఫర్రార్, ప్రపంచ ఆరోగ్య సంస్థ పూర్వ శాస్త్రవేత్త  డాక్టర్ సౌమ్య స్వామినాథన్, పాత్ సంస్థ సీఈఓ  నికోలాయ్ గిల్బర్ట్, సెపి సీఈఓ  డాక్టర్ రిచర్డ్ హాట్చెట్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయక్త కార్యదర్శి  శ్రీ ఎన్ యువరాజ్,  జీ-20 సభ్య దేశాలు, ప్రత్యేక ఆహ్వానిత దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూఎస్ ఎయిడ్  లాంటి సంస్థ ప్రతినిధులు,  కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు 

 

***



(Release ID: 1929722) Visitor Counter : 167