రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కొమ‌రోస్‌లోని పోర్ట్ అంజివాన్‌ను సంద‌ర్శించిన ఐఎన్ఎస్ త్రిశూల్

Posted On: 02 JUN 2023 12:50PM by PIB Hyderabad

భార‌తీయ నావికాద‌ళ సుదూర విస్త‌ర‌ణ‌లో భాగంగా, ఐఎన్ఎస్ త్రిశూల్ 31మే నుంచి 02 జూన్ 2023వ‌ర‌కు కొమ‌రోస్ లోని పోర్ట్ అంజొవాన్‌ను సంద‌ర్శించింది. నౌక 31 మే 2023న అంజొవాన్ ద్వీపంలో లంగ‌రు వేయ‌గా, పౌర‌-సైనిక నాయ‌క‌త్వం ఆహ్వానం ప‌లికింది. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా, క‌మాండింగ్ అధికారి కెప్టెన్ క‌పిల్ కౌశిక్‌, అంజొవాన్ లోని ప్ర‌భుత్వ సీనియ‌ర్ అధికారుల‌ను క‌లుసుకున్నారు. ఓడ రేవులో నౌక ఉన్న స‌మ‌యంలో కొమ‌రోస్ సాయుధ ద‌ళాలు, కొమ‌రోస్ కోస్ట్‌గార్డ్ , క్రీడా స్థావ‌రాలలో వృత్తిప‌ర‌మైన సంభాష‌ణ‌లు, కొమ‌రోస్ ర‌క్ష‌ణ ద‌ళాల‌తో ఉమ్మ‌డి యోగా సెష‌న్‌ను చేప‌ట్టారు. 
కొమ‌రోస్ కోస్ట్‌గార్డ్ సిబ్బంది కోసం ఒబిఎంల నిర్వ‌హ‌ణ‌పై శిక్ష‌ణా వ‌ర్క్‌షాప్‌ను నిర్వ‌హించారు. దానితో పాటుగా క‌మ్యూనికేష‌న్ ప‌రిక‌రాల మ‌ర‌మ్మ‌త్తుల‌లో, పోర్ట్ కంట్రోల్ వ‌ద్ద నావిగేష‌న్ రాడార్ డిస్‌ప్లే ఏర్పాటులోనూ కొమొరియ‌న్ కోస్ట్‌గార్డ్‌కు ఓడ తోడ్పాటునందించింది. 
అంజొవాన్ స్థానిక ప్ర‌జ‌ల కోసం వైద్య శిబిరాన్ని కూడా నౌక నిర్వ‌హించింది. దాదాపు 500మంది ఈ శిబిరం నుంచి ల‌బ్ధిపొందారు. సాధార‌ణ ఆరోగ్య ప‌రీక్ష‌లు మాత్ర‌మే కాకుండా ఆప్తాల్మిక్ (నేత్ర‌) కార్డియోవాస్క్యులార్ (హృద‌య సంబంధ), ఇఎన్‌టి (ముక్కు, చెవి)కి సంబంధించిన ప‌రీక్ష‌ల‌ను కూడా నిర్వ‌హించారు. ఇందుకు అద‌నంగా, కొమ‌రొస్ ర‌క్ష సిబ్బందికి బిఎల్ఎస్ (బేసిక్ లైఫ్ సేవింగ్ - ప్రాథ‌మిక ప్రాణ ర‌క్ష‌ణ‌)లో శిక్ష‌ణ‌ను కూడా చేప‌ట్టారు. 
భార‌త‌దేశం పొరుగున ఉన్న ప్రాంతీయ నావికాద‌ళాల‌తో సముద్ర తీర భ‌ద్రతా స‌హకారాన్ని బ‌లోపేతం చేసి, ద్వైపాక్షిక సంబంధాల‌ను పెంచుకోవాల‌న్న భార‌త్ నిబ‌ద్ధ‌త‌కు అంజొవాన్ పోర్టు సంద‌ర్శ‌న ప్ర‌తిబింబిస్తుంది. 

***



(Release ID: 1929362) Visitor Counter : 179