సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ స్ఫూర్తితో గోల్కొండ వద్ద రెండు రోజులపాటు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు


ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా రేపు పతాకావిష్కరణ చేసి వేడుకలు ప్రారంభించనున్న కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి

Posted On: 01 JUN 2023 5:59PM by PIB Hyderabad

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ గోల్కొండ కోట వద్ద తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుతోంది. రేపు (జూన్ 2) ఉదయం కేంద్ర సంస్కృతి, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖామంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి పతాక ఆవిష్కరణ చేసి ఈ రెండు రోజుల వేడుకలను ప్రారంభిస్తారు. ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్ స్ఫూర్తితో సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. 

2వ తేదీజరిగే కార్యక్రమాల్లో మార్చ్ పాస్ట్, ఫోటో, పెయింటింగ్ ప్రదర్శనలు, అనందాజీ బృందం శాస్త్రీయ నృత్యం, మంజులా రామస్వామి బృందం ప్రదర్శన ఉంటాయి. ప్రముఖ గాయకులు మంగ్లీ, మధుప్రియల పాటలను ప్రేక్షకులు ఆస్వాదించే అవకాశం కల్పించారు. శంకర్ మహదేవన్ దేశభక్తి గీతాలతో మొదటి roju కార్యక్రమం పూర్తవుతుంది.

జూన్ 3న దింసా, డప్పు, బోనాలు, గుస్సాడి తదితర జానపద నృత్యాలు అలరిస్తాయి. వీటితో బాటు రాజా రామ్ మోహన్  రాయ్ మీద నాటకం ప్రదర్శిస్తారు. బహుభాషల ముషాయిరాతో రెండో రోజు కార్యక్రమం పూర్తవుతుంది.

దేశ వ్యాప్తంగా ఉన్న కోటల చరిత్రకు ప్రాచుర్యం కల్పించి సాంస్కృతిక వైభవాన్ని చాటటానికి దేశవ్యాప్తంగా చేపట్టిన ఖిలా ఔర్ర్ కహానియా కార్యక్రమంలో  భాగం ఇది. గుర్తింపుకు నోచుకోని స్వాతంత్ర్య సమరయోధులను ఈ సందర్భంగా స్మరించుకుంటారు. ఖిలా ఔర్ కహానియా ద్వారా దేశంలోని కోటల విశిష్టతనుగుర్తు చేసుకునే అవకాశం, మన గతంతో అనుసంధానమయ్యే అవకాశం  కలుగుతాయి.  

ఖిలా ఔర్ కహానియా ప్రచారోద్యమం కింద ఇప్పటికే చిత్తోర్ ఘర్, కాంగ్రా లాంటి కోట్లలో అనేక కార్యక్రమాలు జరిగాయి. ఇంకా బిత్తూరు కోట, మండు కోట, ఝాన్సీ కోట, కాంగ్లా కోటలో కార్యక్రమాలు జరగాల్సి ఉంది.  ఈ కార్యక్రమాలన్నీ సాంస్కృతిక శాఖ పరిధిలోని పురావస్తు విభాగం, ప్రాంతీయ సాంస్కృతిక కేంద్రలు, లలిత కళా అకాడెమీ, సంగీత నాటక అకా డెమీ, సాహిత్య అకాడెమీ లాంటి కీలక సంస్థల సమన్వయంతో సాగుతోంది.

ఖిలా ఔర్ కహానియా కార్యక్రమంలో భాగంగా తెలంగాణ స్ఫూర్తిని గోల్కొండ కోటలో నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం అధికారికంగా 2014 జూన్ 2న ఏర్పాటు కాగా దాన్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. 

భారత ప్రభుత్వం ప్రారంభించిన అజాదీ కా అమృత్ మహోత్సవ్ స్వతంత్ర భారతదేశపు 75 ఏళ్ల అద్భుత యాత్రను స్మరించుకుంటూ ఉండగా దేశ వ్యాప్తంగా ఇందుకు సంబందించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా ఈ ప్రచారద్యమంలో 1.78 లక్షల కార్యక్రమాలు నిర్వహించారు.

 

*****



(Release ID: 1929302) Visitor Counter : 151