రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

అబుజా పర్యటన సందర్భంగా నైజీరియాలోని ప్రవాస భారతీయులతో రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ముఖాముఖి


'మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్'పై ప్రభుత్వ ప్రాధాన్యతను స్పష్టం చేసిన మంత్రి; శత్రువుల నుంచి దేశాన్ని రక్షించిన సాయుధ దళాలకు ప్రశంస

Posted On: 30 MAY 2023 1:28PM by PIB Hyderabad

ఈ నెల 29వ తేదీన, అబుజాలో భారత హైకమిషన్ ఇచ్చిన విందు కార్యక్రమంలో పాల్గొన్న రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, నైజీరియాలోని ప్రవాస భారతీయులతో సంభాషించారు. నైజీరియాలోని లాగోస్‌ వంటి ఇతర నగరాల నుంచి కూడా ప్రవాస భారతీయులు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు.

భారత ఆర్థిక వ్యవస్థలో వేగవంతమైన విస్తరణ, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ధి కారక చర్యల కారణంగా ప్రపంచ వేదికపై భారతదేశానికి పెరుగుతున్న ప్రాముఖ్యత గురించి రక్షణ మంత్రి మాట్లాడారు. విదేశాలలో పెరుగుతున్న ప్రవాస భారతీయుల హోదాల గురించి మంత్రి ప్రస్తావించినప్పుడు అందరు ఆనందంతో పొంగిపోయారు. నైజీరియాలో భారతీయులు అందించిన సానుకూల సహకారాన్ని ప్రశంసించిన మంత్రి, భారత జెండాను అలా ఎగరనిస్తూనే ఉంటారన్న విశ్వాసం వ్యక్తం చేశారు.

భారతదేశ స్వయంసమృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత గురించి రక్షణ మంత్రి వివరించారు. 'మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్' లక్ష్యాన్ని సాధించే దిశగా, ఇటీవలి సంవత్సరాల్లో రక్షణ రంగ ఎగుమతుల్లో సాధించిన గణనీయమైన ప్రగతి గురించి చెప్పారు. ప్రత్యర్థుల నుంచి వచ్చే ఎలాంటి ముప్పునైనా సమర్థవంతంగా ఎదుర్కోవడంలో భారత సాయుధ బలగాలకున్న సామర్థ్యాలను కూడా ఆయన ప్రశంసించారు.

ఆ తర్వాత, భారత హైకమిషనర్ ఏర్పాటు చేసిన విందులో శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ పాల్గొన్నారు. నైజీరియా ప్రధాన న్యాయమూర్తి, రక్షణ శాఖ మంత్రి సహా నైజీరియన్ ప్రముఖులతో సంభాషించారు.

నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అబుజాలో పర్యటిస్తున్నారు. నైజీరియాలో 50,000 మందికి పైగా భారతీయులు నివసిస్తున్నారు. నైజీరియాలో ఉన్న అతి పెద్ద కంపెనీల్లో భారతీయులు నిర్వహిస్తున్న సంస్థలు, వ్యాపారాలు కూడా ఉన్నాయి.

*****


(Release ID: 1928345) Visitor Counter : 136