మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
డార్జిలింగ్ , కాలింపాంగ్ జిల్లాల్లో పశువులకు సోకుతున్న లంపీ చర్మ వ్యాధి కేసుల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించిన కేంద్ర మంత్రి శ్రీ పర్షోత్తమ్ రూపాలా
Posted On:
21 MAY 2023 11:19AM by PIB Hyderabad
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ , కాలింపాంగ్ జిల్లాల్లో లంపీ చర్మ వ్యాధి (ఎల్‌ఎస్‌డి) నివారణ కోసం కేంద్ర మత్స్య పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ చర్యలు ప్రారంభించింది. పశువుల ప్రాణాలకు వ్యాధి వల్ల ముప్పు కలిగే ప్రమాదం ఉండటంతో పశు పెంపకందారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పశువులకు సోకుతున్న వ్యాధి లంపీ చర్మ వ్యాధి లక్షణాలు కలిగి ఉండడంతో కేంద్ర మత్స్య పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ తక్షణ నివారణ చర్యలు చేపట్టింది. డార్జిలింగ్ , కాలింపాంగ్ జిల్లాల్లో గేదెలు, పాడి పశువులకు వ్యాధి సోకినట్లు సమాచారం అందింది.
పశ్చిమ బెంగాల్‌లోని కాలింపాంగ్, డార్జిలింగ్ జిల్లాల్లో లంపీ చర్మ వ్యాధి కేసులు పెరుగుతున్నాయని కేంద్ర కేంద్ర మత్స్య పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పర్షోత్తం రూపాలాకు డార్జిలింగ్ పార్లమెంటు సభ్యుడు రాజు బిస్తా లేఖ రాశారు. దీనిపై స్పందించిన మంత్రి తక్షణ చర్యలు అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
మంత్రి ఆదేశాల మేరకు వేగంగా స్పందించిన పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ అధికారులు వ్యాధి నివారణ, అదుపు కోసం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం, డార్జిలింగ్ , కాలింపాంగ్ జిల్లా అధికారులకు కలిసి చర్యలు అమలు చేయడం ప్రారంభించారు. వ్యాధి నివారణ, అదుపు కోసం అవసరమైన సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని అందించడానికి అవసరమైన అన్ని చర్యలను చేపట్టింది.
ఎల్‌ఎస్‌డి కారణంగా పశువులు చని పోలేదని క్షేత్ర స్థాయి నుంచి అందిన నివేదికలు స్పష్టం చేశాయి.
డార్జిలింగ్‌లో టీకాలు వేయని దాదాపు 400 పశువులు, కాలింపాంగ్‌లో 2000 పశువులు వ్యాధి బారిన పడ్డాయి. అయితే, డార్జిలింగ్‌లో 200,కాలింపాంగ్‌లో1200 ఇప్పటికే కోలుకున్నాయి. వ్యాధి సోకిన ఇతర పశువులకు చికిత్స అందిస్తున్నారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా చూసేందుకు చర్యలు అమలు చేస్తున్న అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో పశువులకు రింగ్ టీకాలు వేస్తున్నారు. రెండు జిల్లాల్లో గొర్రెలు/మేకలలో ఎల్‌ఎస్‌డి ఉన్నట్లు నివేదికలు లేవు. ప్రధానంగా టీకాలు వేయని పశువులలో ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు అధికారులు తెలిపారు అయితే పరిస్థితి అదుపులోనే ఉంది.
వ్యాధి నియంత్రణ కోసం అనేక చర్యలు అమలు చేస్తోంది.
* నిఘా: ఎగ్జిట్ ప్లాన్ ద్వారా నిఘా వ్యూహాన్ని రూపొందించిన కేంద్ర మత్స్య పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు పంపింది. రోగనిర్ధారణ సౌకర్యాలు ఈ ప్రాంతంలో తక్షణమే అందుబాటులో వచ్చే విధంగా చర్యలు తీసుకుంది. పిసిఆర్ పరీక్షల ద్వారా లంపీ చర్మ వ్యాధి నిర్ధారణ కోసం కోల్‌కత్తా ప్రాంతీయ వ్యాధుల నిర్ధారణ ల్యాబొరేటరీ (RDDL)కు అధికారం ఇచ్చింది. దీనికి అవసరమైన నిధులు విడుదల చేసింది. ఇదే అంశాన్ని రాష్ట్రానికిసమాచారం అందించారు.
* టీకా కార్యక్రమం: వ్యాధి నియంత్రణ, నివారణ ప్రణాళికలో భాగంగా పశువులకు క్రమం తప్పకుండా టీకాలు వేయాలి అని రాష్ట్రాలకు సూచనలు జారీ అయ్యాయి. వ్యాక్సిన్‌ల కొనుగోలుకు నిర్ణయించిన ధరలను రాష్ట్రానికి తెలియజేయడం జరిగింది. పశ్చిమ బెంగాల్‌తో సహా రాష్ట్రాలకు ASCAD కింద 60: 40 వాటాతో ఆర్థిక సహాయం అందించబడుతుంది.
* కాలింపాంగ్ డార్జిలింగ్ లలో పర్యటించిన వ్యాధుల నిర్ధారణ ల్యాబొరేటరీ అధికారులు: ఈశాన్య ప్రాంతీయ వ్యాధుల నిర్ధారణ ల్యాబొరేటరీ (NERDDL), గౌహతి మరియు కోల్‌కతాలోని ఈస్టర్న్ రీజినల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ లాబొరేటరీ (ERDDL) నుండి ఒక్కొక్క అధికారితో కూడిన కేంద్ర బృందం ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుంది. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని అంచనా వేసిన తర్వాత వ్యాధి నియంత్రణ, నియంత్రణ కోసం అధికారుల బృందం రాష్ట్ర పశుసంవర్ధక శాఖకు సహాయ సహకారాలు అందిస్తుంది.
దేశంలో ఎల్‌ఎస్‌డి సకాలంలో నియంత్రణ, నివారణకు అవసరమైన నిధులు, సాంకేతిక సహకారాన్ని అందిస్తున్న పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోంది. అయితే, పశుసంవర్ధక శాఖ రాష్ట్ర అంశంగా ఉంది. క్షేత్రస్థాయి కార్యక్రమాలు అమలు చేసే అంశం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా ఉంటుంది.
*****
(Release ID: 1926123)
Visitor Counter : 172