ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
సిజిహెచ్ఎస్ లబ్ధిదారులందరికీ భోపాల్, భువనేశ్వర్, పాట్నా, జోధ్‌పూర్, రాయ్‌పూర్ మరియు రిషికేశ్‌లోని 6 ఎయిమ్స్లో నగదు రహిత చికిత్స సౌకర్యాలు
సిజిహెచ్ఎస్ పెన్షనర్లు, సిజిహెచ్ఎస్ కింద అర్హత కలిగిన ఇతర లబ్ధిదారులు ఈ 6 ఎయిమ్స్ లో ఓపీడీ, వైద్య పరీక్షలు, ఆసుప్రతిలో నగదు రహిత చికిత్సకు అర్హులు.
న్యూ ఢిల్లీ ఎయిమ్స్ ,చండీగఢ్ పీజీఐఎంఈఆర్, పుదుచ్చేరి జీఐపిఎంఈఆర్ లో సిజిహెచ్ఎస్ లబ్ధిదారులకు నగదు రహిత చికిత్స
Posted On:
20 MAY 2023 1:25PM by PIB Hyderabad
భోపాల్, భువనేశ్వర్, పాట్నా, జోధ్‌పూర్, రాయ్‌పూర్, రిషికేశ్‌లలో ఉన్న 6 ఎయిమ్స్ లో సిజిహెచ్ఎస్ లబ్ధిదారులందరికీ (సేవ చేస్తున్న మరియు పెన్షనర్లు) నగదు రహిత చికిత్స సౌకర్యాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. దీనికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ సమక్షంలో ఈ ఆరు ఎయిమ్స్ కేంద్రాలు, సిజిహెచ్ఎస్ , కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మధ్య అవగాహన కుదిరింది. అవగాహన ఒప్పందంపై ఈ రోజు సంతకాలు జరగడంతో సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
భోపాల్, భువనేశ్వర్, పాట్నా, జోధ్‌పూర్, రాయ్‌పూర్, రిషికేశ్‌లో పూర్తి స్థాయిలో పనిచేస్తున్న ఆరు ఎయిమ్స్ లో అందుబాటులో ఉన్న పేషెంట్ కేర్ సదుపాయాలు నగదు రహిత ప్రాతిపదికన సిజిహెచ్ఎస్ లబ్ధిదారులకు అందుబాటులోకి వస్తాయి. వ్యక్తిగత రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌లను సమర్పించడం, అనుమతులు పొందడంలో సమస్యలు ఎదుర్కొంటున్న సీనియర్ సిటిజన్‌లకు (సిజిహెచ్ఎస్ పరిధిలోకి వచ్చే పదవీ విరమణ చేసిన లబ్ధిదారులు) ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రయోజనం కలిగిస్తుంది. సిజిహెచ్ఎస్ లబ్ధిదారులకు ఈ ఎయిమ్స్ లో అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్స సౌకర్యాలు పొందడానికి ముందుగా చెల్లింపులు చెల్లించి ఆ తర్వాత సిజిహెచ్ఎస్ నుండి చెల్లించిన మొత్తాన్ని తిరిగి పొందడం లాంటి ఇబ్బందులు లేకుండా చికిత్స, ఇతర సౌకర్యాలు ఎలాంటి చెల్లింపులు లేకుండా పొందడానికి వీలవుతుంది.నూతన విధానం వల్ల సమయం ఆదా అవుతుంది. వ్రాతపని తగ్గుతుంది. వ్యక్తిగత క్లెయిమ్‌ల పరిష్కారంలో జరుగుతున్న జాప్యాన్ని కూడా తగ్గిస్తుంది. ఇప్పటి వరకు, ఎయిమ్స్ లో చికిత్స పొందడానికి సిజిహెచ్ఎస్ పెన్షన్ లబ్ధిదారులు ముందుగా చెల్లింపు చేసి, తర్వాత సిజిహెచ్ఎస్ నుండి రీయింబర్స్‌మెంట్ పొందాల్సి వచ్చేది.
నూతన విధానం ముఖ్య అంశాలు:
1. సిజిహెచ్ఎస్ పెన్షనర్లు, సిజిహెచ్ఎస్ పరిధిలోకి వచ్చే అర్హత కలిగిన ఇతర లబ్ధిదారులు ఈ 6 ఎయిమ్స్ లో ఓపీడీ, వైద్య పరీక్షలు, ఆసుప్రతిలో నగదు రహిత చికిత్సకు అర్హులు.
2. సిజిహెచ్ఎస్, సిజిహెచ్ఎస్ పరిధిలోకి వచ్చే అర్హత కలిగిన ఇతర పెన్షనర్ల క్రెడిట్ బిల్లులను ఈ ఆరు ఎయిమ్స్ కేంద్రాలు సిద్ధం చేయాలి. బిల్లులు అందిన 30 రోజుల లోగా సిజిహెచ్ఎస్ చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.
3. చెల్లుబాటు అయ్యే సిజిహెచ్ఎస్ బెనిఫిషియరీ ఐడీ కార్డు ఆధారంగా ఎయిమ్స్ రోగులను చేర్చుకోవాల్సి ఉంటుంది.
4. సిజిహెచ్ఎస్ లబ్ధిదారుల కోసం ఎయిమ్స్ ప్రత్యేక హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసి ప్రత్యేక అకౌంటింగ్ సిస్టమ్‌ను రూపొందించాలి.
5. ఓపీడీ చికిత్స కోసం లేదా డిశ్చార్జ్ అయిన సమయంలో ఎయిమ్స్ వైద్యులు సూచించిన మందులను లబ్ధిదారులు సిజిహెచ్ఎస్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది.
నూతన విధానం పట్ల ఆరోగ్య కార్యదర్శి హర్షం వ్యక్తం చేశారు." పనిచేస్తున్న, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ద్వారా ఆరోగ్య మంత్రిత్వ శాఖ సౌకర్యాలు కల్పిస్తోంది. దీని ద్వారా పనిచేస్తున్న, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు వైద్య సేవలు పొందవచ్చు" అని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ తెలిపారు." పెరుగుతున్న వైద్య అవసరాలకు అనుగుణంగా అధునాతన తృతీయ సంరక్షణ సౌకర్యాలు అందించేందుకు సిజిహెచ్ఎస్ కింద వైద్య సౌకర్యాలు అందించేందుకు ఆసుపత్రుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది" అని ఆయన వివరించారు. "సమీప భవిష్యత్తులో న్యూఢిల్లీ ఎయిమ్స్ సంస్థలు, చండీగఢ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, పుదుచ్చేరి జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో కూడా ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది" అని శ్రీ రాజేష్ భూషణ్ తెలిపారు.
నూతన విధానం వల్ల అనేక వర్గాలకు ప్రయోజనం కలుగుతుందని శ్రీ రాజేష్ భూషణ్ తెలిపారు. దీని వల్ల సుదీర్ఘ లాంఛనాలను సులభతరం అవుతాయని, వైద్య సంరక్షణ త్వరితగతిన అందుబాటులోకి వస్తుందని ఆయన అన్నారు. ఈ ఒప్పందం వల్ల సిజిహెచ్ఎస్ లబ్ధిదారులు తమ తమ రాష్ట్రాల్లోని ఎయిమ్స్ నుంచి వైద్య సేవలు పొందడానికి వీలవుతుందన్నారు. దేశవ్యాప్తంగా సిజిహెచ్ఎస్ సేవల పరిధి పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. చికిత్స, వైద్య సంరక్షణ యొక్క నిర్దిష్ట రేట్లు సవరించిన సిజిహెచ్ఎస్ రోగులకు వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చిందని ఆయన అన్నారు.
సిజిహెచ్ఎస్ కింద ఉన్న లబ్ధిదారులను ప్రభుత్వ ఆసుపత్రులకు, సిజిహెచ్ఎస్ కింద నమోదైన ప్రైవేటు ఆసుపత్రులకు చికిత్స కోసం సిఫార్సు చేస్తారు. సిజిహెచ్ఎస్ పెన్షనర్లు, సిజిహెచ్ఎస్ పరిధిలోకి వచ్చే అర్హత కలిగిన లబ్ధిదారులు గుర్తించిన ఆసుపత్రులలో నగదు రహిత సౌకర్యాలు పొందడానికి వీలవుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎంపీలు, ఇతర వర్గాలకు చెందిన లబ్ధిదారులకు సమగ్ర ఆరోగ్య సంరక్షణను సిజిహెచ్ఎస్ అందిస్తుంది. ప్రస్తుతం దేశంలోని 79 నగరాల్లో సిజిహెచ్ఎస్ అమలులో ఉంది.
ప్రధాన్ మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (PMSSY) కింద దేశవ్యాప్తంగా కొత్తగా 22 కొత్త ఎయిమ్స్ కేంద్రాలు రానున్నాయి. ఎయిమ్స్ స్థాపన వివిధ దశల్లో ఉంది. నాణ్యమైన వైద్య విద్య, పరిశోధన కోసం సౌకర్యాలు అందించడంతో పాటు ఎయిమ్స్ సంస్థలు కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, యూరాలజీ, కార్డియో వాస్కులర్ థొరాసిక్ సర్జరీ, ఆంకాలజీ మొదలైన వివిధ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ లో ప్రత్యేకమైన సేవలు అందిస్తాయి. అత్యవసర సంరక్షణ సేవలు, బ్లడ్ బ్యాంక్ సౌకర్యాలతో సహా అత్యాధునిక రోగనిర్ధారణ సేవలు ఎయిమ్స్ లో అందుబాటులో ఉంటాయి.
కార్యక్రమంలో సిజిహెచ్ఎస్ అదనపు కార్యదర్శి శ్రీమతి వి. హేకలి జిమోమి, సంయుక్త కార్యదర్శి శ్రీమతి అంకితా మిశ్రా, సంయుక్త కార్యదర్శి డాక్టర్ మనశ్వి కుమార్, సిజిహెచ్ఎస్ డైరెక్టర్, డాక్టర్ జైన్, సీనియర్ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయడానికి ఏర్పాటైన కార్యక్రమంలో ఎయిమ్స్ భువనేశ్వర్, ఎయిమ్స్ పాట్నా, ఎయిమ్స్ రాయ్‌పూర్, ఎయిమ్స్ జోధ్‌పూర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, ఎయిమ్స్ భోపాల్,ఎయిమ్స్ రిషికేశ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
***
(Release ID: 1925948)
Visitor Counter : 270