రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

తొలిసారి రూ.లక్ష కోట్ల మార్కు దాటిన రక్షణ రంగ ఉత్పత్తి విలువ


2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.07 లక్షల కోట్లకు చేరిక, 2021-22 కంటే 12% ఎక్కువ

Posted On: 19 MAY 2023 10:29AM by PIB Hyderabad

రక్షణ మంత్రిత్వ శాఖ చేస్తున్న నిరంతర కృషి ఫలితంగా, 2022-23 ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగ ఉత్పత్తి విలువ మొదటిసారిగా రూ.లక్ష కోట్లు దాటింది. ప్రస్తుతం ఆ విలువ రూ.1,06,800 కోట్లుగా ఉంది. రక్షణ రంగంలోని ప్రైవేట్ సంస్థల నుంచి కూడా సమాచారం వచ్చాక ఈ విలువ మరింత పెరుగుతుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఉత్పత్తి విలువ, 2021-22 ఆర్థిక సంవత్సరంలోని రూ.95,000 కోట్లతో పోలిస్తే 12 శాతం పైగా పెరిగింది.

రక్షణ రంగంలోని సంస్థలు, సంఘాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడానికి దేశంలో రక్షణ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరంగా శ్రమిస్తోంది. ఎంఎస్‌ఎంఈలు, అంకుర సంస్థలను సరఫరా గొలుసులోకి తీసుకురావడం సహా 'సులభతర వ్యాపారం' లక్ష్యాన్ని సాధించడానికి అనేక సంస్కరణలు తీసుకొచ్చింది.

ఈ విధానాల కారణంగా ఎంఎస్‌ఎంఈలు, అంకుర సంస్థలు సహా అనేక సంస్థలు రక్షణ రంగ ఉత్పత్తుల రూపకల్పన, అభివృద్ధి, తయారీ కోసం ముందుకు వస్తున్నాయి. గత 7-8 సంవత్సరాల్లో రక్షణ రంగ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అనుమతుల సంఖ్య దాదాపు 200 శాతం పెరిగింది. ఈ చర్యలు దేశంలోని రక్షణ రంగ పారిశ్రామిక ఉత్పాదక వ్యవస్థకు ప్రోత్సాహాన్ని అందించాయి, గణనీయమైన ఉపాధి అవకాశాలను సృష్టించాయి.

 

****



(Release ID: 1925430) Visitor Counter : 163