సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో 8వ అఖిలభారత పెన్షన్‌ అదాలత్‌


శాఖాంతర సంప్రదింపుల ద్వారా 50 దీర్ఘకాలిక కేసుల పరిష్కారం;

వీటిలో 12కుపైగా కేసుల విచారణకు పెన్షన్లు-పెన్షనర్లసంక్షేమ విభాగం

కార్యదర్శి శ్రీ వి.శ్రీనివాస్‌ అధ్యక్షత… నివేదిక సమర్పించాల్సిందిగారక్షణ/

హోమ్‌/ఆరోగ్యం/పౌర విమాన యానం/తపాలా/యువజన-క్రీడా వ్యవహారాలు/సమాచార-ప్రసార తదితర మంత్రిత్వ శాఖలకు సూచన;

సకాలంలో పెన్షన్ల చెల్లింపు… సీజీహెచ్‌ పథకం ద్వారా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలకు భరోసా లక్ష్యంగా 50వ రిటైర్మెంట్‌ పూర్వ కౌన్సెలింగ్‌ కార్యశాల నిర్వహణ

Posted On: 17 MAY 2023 4:06PM by PIB Hyderabad

ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ఇవాళ 8వ అఖిలభారత పెన్షన్‌ అదాలత్ నిర్వహించిన నేపథ్యంలో వివిధ శాఖల మధ్య సంప్రదింపులు-సమన్వయం ద్వారా 50 దీర్ఘకాలిక కేసులు పరిష్కృతమయ్యాయి. వీటిలో 12కుపైగా కేసుల విచారణకు పెన్షన్లు-పెన్షనర్ల సంక్షేమ విభాగం కార్యదర్శి శ్రీ వి.శ్రీనివాస్ స్వయంగా అధ్యక్షత వహించారు. ఇందులో భాగంగా ఈ కేసులపై నివేదిక సమర్పించాలని రక్షణ, హోమ్, ఆరోగ్యం, పౌర విమానయానం, తపాలా, యువజన-క్రీడా వ్యవహారాలు, సమాచార-ప్రసార తదితర మంత్రిత్వ శాఖలను ఆయన కోరారు.

సందర్భంగా శ్రీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ- పెన్షన్‌ అదాలత్‌లో భాగంగా 50వ ‘రిటైర్మెంట్‌ పూర్వ కౌన్సెలింగ్‌’ (పిఆర్‌సి) కార్యశాలను కూడా నిర్వహించిన నేపథ్యంలో ఈ రోజుకు ప్రాధాన్యం ఏర్పడిందని ఆయన అన్నారు. పెన్షనర్లకు తీవ్ర ఆర్థిక భద్రత సమస్యల పరిస్థితి ఉంటుంది కాబట్టి వారికి సకాలంలో పెన్షన్ల చెల్లింపు, ‘సీజీహెచ్‌’ పథకం ద్వారా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవల భరోసా కల్పన ఈ కార్యశాల జంట లక్ష్యాలని వివరించారు. దేశంలో పెన్షన్లు పంపిణీ చేసే 18 బ్యాంకులు తొలిసారి ‘పిఆర్‌సి’లో పాల్గొని, తమ ఉత్పత్తులను ప్రదర్శించాయని ఆయన తెలిపారు. అన్ని మంత్రిత్వశాఖలు/విభాగాల పరిధిలో రాబోయే 12 నెలల వ్యవధిలో ఉద్యోగ విరమణ చేసే 1200 మంది అధికారుల కోసం 50వ ‘పిఆర్‌సి’ కార్యశాల నిర్వహించబడిందని వెల్లడించారు.

దేశవ్యాప్తంగా 70 ప్రదేశాల్లో పెన్షన్‌ అదాలత్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా అనుసంధానించారు. ఈ వేదికపై వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు సంక్లిష్ట కేసుల విచారణను చేపట్టాయి. కాగా, పెన్షన్లు-పెన్షనర్ల సంక్షేమ విభాగం ఇప్పటిదాకా 7 సార్లు అఖిలభారత పెన్షన్ అదాలత్ నిర్వహించింది. వీటిద్వారా 24,218 కేసులు విచారణకు స్వీకరించగా 17,235 పరిష్కృతమయ్యాయి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన ఈ ఏడాది ఫిబ్రవరిలో మేధోమథన శిబిరం నిర్వహించడాన్ని శ్రీ శ్రీనివాస్‌ గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యక్ష పరిష్కార నమూనాలను రూపొందించాల్సిందిగా పిలుపునిచ్చారని పేర్కొన్నారు. తదనుగుణంగా పెన్షన్ల ప్రత్యక్ష చెల్లింపు ప్రక్రియ డిజిటలీకరణ దిశగా అన్ని మంత్రిత్వ శాఖలూ ‘భవిష్య’ సాఫ్ట్‌’వేర్‌ వినియోగించడాన్ని తప్పనిసరి చేసినట్లు తెలిపారు. ప్రపంచంలోని అత్యుత్తమ పోర్టళ్లలో ‘భవిష్య’ వ్యవస్థ ఒకటని కార్యదర్శి వెల్లడించారు. ఈ మేరకు 2021నాటి ‘ఎన్‌ఇఎస్‌డిఎ’ మూల్యాంకనం ప్రకారం ఇది అన్ని కేంద్ర ప్రభుత్వ ఇ-పరిపాలన సేవాప్రదాన పోర్టళ్లలో 3వ స్థానం పొందిందని ఆయన తెలిపారు.

కార్యక్రమంలో పెన్షన్లు-పెన్షనర్ల సంక్షేమ విభాగం అదనపు కార్యదర్శి శ్రీ ఎస్‌.ఎన్‌.మాధుర్‌ స్వాగతోపన్యాసం చేశారు. త్వరలో ఉద్యోగ విరమణ చేయనున్న కేంద్ర ప్రభుత్వ పౌర ఉద్యోగులకు ఈ కార్యశాల ఎంతో ప్రయోజనకరమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రిటైర్మెంట్‌ ప్రయోజనాలతోపాటు సకాలంలో పెన్షన్‌ పొందడానికి అవసరమైన ప్రక్రియల గురించి ఈ కార్యక్రమం వివరిస్తుందన్నారు. ఈ మేరకు ‘భవిష్య’ పోర్టల్‌ పని విధానం, ఈ వేదికపై పెన్షన్‌ ఫారం నింపడం వంటివాటిపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. అలాగే రిటైరయ్యాక అందే ‘సీజీహెచ్‌ఎస్‌’/నిర్దిష్ట వైద్య భత్యాలు, వృద్ధులు/పెన్షనర్లకు లభించే ఆదాయపు పన్ను ప్రోత్సాహకాలు, ‘డిఎల్‌సి’, ఫేస్ అథెంటికేషన్, పెన్షనర్ల సంఘాలు, ఉద్యోగంలో ఉండగా విశిష్ట సేవల వివరాలు తెలిపే ‘అనుభవ్‌’ వేదిక తదితరాల గురించి ఈ కార్యశాల సమగ్ర సమాచారం ఇస్తుందని చెప్పారు.

పెన్షన్లు-పెన్షనర్ల సంక్షేమ విభాగం ఇప్పటిదాకా 49 ‘పిఆర్‌సి’ కార్యశాలలు నిర్వహించింది. వీటిలో 29 ఢిల్లీలోని వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలకు సంబంధించినవి కాగా, మిగిలినవి న్యూఢిల్లీ, జలంధర్, షిల్లాంగ్, కోల్‌కతా, తేకన్‌పూర్, జమ్ము, జోధ్‌పూర్, గువహటి ప్రాంతాల్లో గల సీఆర్పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, అస్సాం రైఫిల్స్ వంటి కేంద్ర సాయుధ పోలీసు బలగాల సిబ్బంది కోసం నిర్వహించారు. ఈ 20 కార్యశాలల్లో 6,972 మంది రిటైర్ కాబోయే సిబ్బందికి వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలో పెన్షనర్లందరి జీవన సౌలభ్యం దిశగా తమ పరిధిలోని అన్ని పోర్టళ్లనూ ఏకీకృతం చేయడంలోగల హేతుబద్ధతను ఈ విభాగం గుర్తించింది. తదనుగుణంగా పెన్షన్‌ చెల్లించే బ్యాంకు పోర్టళ్లుసహా ‘అనుభవ్‌, సి-పెన్‌గ్రామ్స్‌, సీజీహెచ్‌ఎస్‌’ వగైరాలను కొత్తగా రూపొందించిన ‘సమీకృత పెన్షన్‌ పోర్టల్‌’ (https://ipension.nic.in)లో ఏకీకృతం చేయనుంది. ఇందులో భాగంగా ‘ఎస్‌బిఐ’, కెనరా బ్యాంకుల పెన్షన్‌ సేవా పోర్టళ్లను ‘భవిష్య పోర్టల్‌’తో ఏకీకృతం చేసే పని ఇప్పటికే పూర్తయింది. దీంతో పెన్షనర్లు ఇకపై తమ పెన్షన్ స్లిప్, లైఫ్ సర్టిఫికేట్/ఫారం-16 సమర్పణ స్థితి వంటి వివరాలను సమీకృత పోర్టల్‌ ద్వారా పొందగలుగుతారు. దేశంలో పెన్షన్ పంపిణీ చేసే మొత్తం 18 బ్యాంకులూ ఈ సమీకృత పోర్టల్‌లో విలీనం చేయబడతాయి.

పెన్షన్లు-పెన్షనర్ల సంక్షేమ విభాగం 2017 నుంచి ప్రయోగాత్మకంగా పెన్షన్‌ అదాలత్‌ నిర్వహణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పెన్షనర్ల సమస్యల సత్వర పరిష్కారంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరుసటి ఏడాది (2018)లోనే జాతీయ పెన్షన్‌ అదాలత్‌ను నిర్వహించింది. నిర్దిష్ట సమస్య విషయంలో సంబంధిత భాగస్వాములందర్నీ ఉమ్మడి వేదికపైకి తెచ్చి, అవసరమైన ప్రక్రియలను పూర్తి చేయడం ద్వారా సకాలంలో పెన్షన్‌ చెల్లింపు ప్రారంభమయ్యేలా శ్రద్ధ వహించడమే ఈ కార్యక్రమంలో అనుసరిస్తున్న విధానం.

 

*****




(Release ID: 1925106) Visitor Counter : 145