ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

`సమీకృత వైద్య రంగంలో వైద్యపరిశోధనలను పరస్పర సమన్వయం, సహకారంతో మరింత వేగవంతం చేసేందుకు అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేసిన ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌, ఆయుష్‌ మంత్రిత్వశాఖ.


`ఈ అవగాహనా ఒప్పందం సంప్రదాయ వైద్య విజ్ఞానాన్ని, ఆధునిక పరిశోధనలతో మేళవించి, శాస్త్రీయ ఆధారాల పునాదిమీద ఆయుర్వేదం తన గుర్తింపును మరింత సుస్థిరం చేసుకోవడాన్ని ప్రోత్సహించేందుకు ఉపకరిస్తుంది.

Posted On: 11 MAY 2023 2:47PM by PIB Hyderabad

దేశ ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసిన విషయాన్ని ,ఆయుష్‌ ను ప్రధానస్రవంతిలోకి తేవడంతోపాటు దానిని మరింత వేగవంతం చేసేందుకు  ఆరోగ్య మంత్రిత్వ శాఖ కిందగల  ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసిఎంఆర్‌), ఆయుష్‌ మంత్రిత్వశాఖ ల మధ్య ఒక అవగాహనా ఒప్పందం కుదిరింది. సమీకృత వైద్య రంగంలో పరిశోధన, సమన్వయానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఎం.ఒ.యుపై ఆయుష్‌ మంత్రిత్వశాఖ కార్యదర్శి వైద్య శ్రీ రాజేష్‌ కొటేచా, డిహెచ్‌ఆర్‌, డిజి, ఐసిఎంఆర్‌ కార్యదర్శి డాక్టర్‌ రాజీవ్‌ బహల్‌ సంతకాలు చేశారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి  డాక్టర్‌ మన్‌సుఖ్‌ మాండవీయ , కేంద్ర ఆయుస్‌ శాఖ మంత్రి శ్రీ శర్వానంద్‌ సోనోవాల్‌, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి డాక్టర్‌ భారతి ప్రవీణ్‌ పవార్‌, నీతిఆయోగ్‌ సభ్యుడు (ఆరోగ్య) డాక్టర్‌ వి.కె.పాల్‌ తదితరుల సమక్షంలో ఈ ఎం.ఒ.యు కుదుర్చుకున్నారు.

 

ఆయుష్‌, ఐసిఎం ఆర్‌ లమధ్య పరిశోధనలు, సమన్వయం విషయంలొ పరస్పర సహకారానికి ఈ ఎం.ఒ.యు
ఉపకరిస్తుంది. రెండు సంస్థల మధ్య సమీకృత ఆరోగ్య పరిశోధనలు, పరిశోధనల సామర్ధ్యాన్ని బలోపేతం చేసేందుకు ఇది ఉపకరిస్తుంది. అలాగే జాతీయ ప్రాధాన్యతగల వ్యాధుల విషయంలో ప్రజారోగ్య పరిశోధనలను ఆయుష్‌ మంత్రిత్వశాఖ, ఐసిఎంఆర్‌ తో కలిసి మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు వీలు కల్పిస్తుంది.
ఆరోగ్యానికి సంబంధించి జాతీయ ప్రాధాన్యతగల నిర్దేశిత అంశాలు, వ్యాధుల విషయంలో అత్యున్నత నాణ్యతగల పరిశోధనలను , క్లినికల్‌ పరీక్షలను నిర్వహించేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఆయుష్‌ చికిత్సలకు విస్తృత ఆమోదం లభించేలా చేసేందుకు అనువైన పరిశోధన సమాచారాన్ని సేకరించేందుకు కూడా ఈ ఒప్పందం అవకాశం కల్పిస్తుంది.  ఇందుకు సంబంధించి ఆయుష్‌ మంత్రిత్వశాఖ, ఐసిఎంఆర్‌ మధ్య సంయుక్త వర్కింగ్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈవర్కింగ్‌ గ్రూప్‌ ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశమై పరస్పర సమన్వయానికి వీలుగల అంశాలు, ఫలితాల సాధనపై దృష్టిపెట్టనుంది. 

ఈ రెండు సంస్థలూ సంయుక్త పరిశోధనలకు  సంబంధించిన ప్రాజెక్టులు, కార్యక్రమాల విషయంలో తగిన విధివిధానాలను రూపొందించుకుంటాయి. అలాగే ఈ కార్యకలాపాలపై సంయుక్త పర్యవేక్షణ చేస్తాయి. అలాగే సదస్సులు, కార్యశాలలు, సమావేశాలను ఈ రంగంలోని పరిశోధకుల క్రియాశీలక భాగస్వామ్యంతో సంయుక్తంగా నిర్వహిస్తారు. దీనికి తోడుగా ఈ ఉమ్మడి సమన్వయంలో భాగంగా రెండు సంస్థలకు చెందిన స్కాలర్లు, శిక్షణ పొందుతున్నవారు, పరిశోధకులు, ఫాకల్టీ సభ్యులు అధునాతన పరికరాలను ప్రస్తుత నియమనిబంధనలకు లోబడి ఉపయోగించేందుకు వీలు కల్పిస్తారు.ఉభయ సంస్థలూ పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కృషిచేస్తాయి. ఇతర దేశాలు ఆయుష్‌ వ్యవస్థలకు శాస్త్రీయ   గుర్తింపును ఇచ్చేందుకు అవసరమైన ఆధారాలను  సేకరించడంలో ఉభయ సంస్థలూ కృషిచేస్తాయి.

ఆయుష్‌ మంత్రిత్వశాఖ చూపిన ఈ చొరవను కేంద్ర మంత్రి డాక్టర్‌ మాండవీయ ప్రశంసించారు.సంప్రదాయ వైద్య విజ్ఞానాన్ని , ఆధునిక పరిశోధన ఆవిష్కరణలతో మమేకం చేయడానికి ఆయుష్‌ మంత్రిత్వశాఖ, ఐసిఎంఆర్‌ ల మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందం ఆయుర్వేదానికి మరింత గుర్తింపును శాస్త్రీయ ఆధారాలతో పొందడానికి వీలు కలుగుతుందన్నారు. ఈ ఒప్పందాన్ని అభినందిస్తూ కేంద్ర ఆరోగ్యమంత్రి, ఈ రెండు సంస్థలమధ్య భాగస్వామ్యం, సమీకృత వైద్యవిధానంలో చెప్పుకోదగిన పరిశోధన అభివృద్ధికి దోహదపడనున్నదని తెలిపారు.
  సమీకృత పరిశోధనలపై ఈ కొలాబరేషన్‌ ప్రభావం మరింతగా ఉంటుందని ఆరోగ్య శాఖ మంత్రి అన్నారు. అలాగే జాతీయ ప్రాధాన్యత గల ఆరోగ్య అంశాలలో ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో శాస్త్రీయ విజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తుందన్నారు. ఉభయ సంస్థలు పరస్పర సమన్వయంతో సాగించే క్లినికల్‌ ట్రయల్స్‌,విస్తృత ఆమోదంతో సమీకృత చికిత్సలకు తగిన ఆధారాలను సమకూర్చనున్నాయని తెలిపారు.

ఆయుష్‌ శాఖ మంత్రి శ్రీ శర్వానంద్‌ సోనోవాల్‌ మాట్లాడుతూ, ఈ అవగాహనా ఒప్పందం, ఆధార సహిత పరిశోధనల సామర్ధాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఇది ఉభయ సంస్థల సామర్ధ్యాలను పెంపొందించేదిశగా వనరులను సద్వినియోగం చేస్తూ సానుకూల ఫలితాలను రాబట్టగలదన్నారు.
డాక్టర్‌ వి.కె.పాల్‌ మాట్లాడుతూ, ఈ కొలాబరేషన్‌ తో ఎయిమ్స్‌లోని ఆయుష్‌ విభాగాలు, దేశంలోని మొత్తం ఎయిమ్స్‌ మౌలికసదుపాయాలలో భాగంగా సమీకృత వైద్యవిభాగాలుగా రూపుదిద్దుకుంటాయన్నారు. ఇది వైద్య రంగంలో అద్భుతమైన అడుగు అని ఆయన అన్నారు. ఇది దేశానికి జరుగుతున్న అద్భుతమైన సేవగా ఆయన అభివర్ణించారు.
సమీకృత ఆరోగ్య పరిశోధన అనేది బహుళ రంగాలకు సంబంధించినది. ఆధునిక వైద్యంతోపాటు సంప్రదాయ, ప్రత్యామ్నాయ, అనుషంగిక వైద్య విధానాలను సమ్మిళితం చేసి సమాజానికి , వ్యక్తులకు సమగ్ర ఆరోగ్య సంరక్షణ విధానాలను అందించడంగా చెప్పుకోవచ్చు.

***

 


(Release ID: 1923947) Visitor Counter : 173