రాష్ట్రపతి సచివాలయం
మహారాజ శ్రీరామచంద్ర భంజ దేవ్ విశ్వవిద్యాలయ 12వ స్నాతకోత్సవానికి హాజరైన భారత రాష్ట్రపతి
Posted On:
06 MAY 2023 2:04PM by PIB Hyderabad
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము శనివారంనాడు (మే6, 2023) ఒడిషాలోని బరిపాదాలో గల మహారాజా శ్రీరామ్ చంద్ర భంజ్ దేవ్ విశ్వవిద్యాలయ 12వ స్నాతకోత్సవానికి హాజరై, విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, మహారాజా శ్రీరామచంద్ర భంజ్ దేవ్ విశ్వవిద్యాలయం తక్కువకాలంలోనే ఉన్నత విద్య, పరిశోధన రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని రాష్ట్రపతి అన్నారు.
గిరిజన సంస్కృతి, సంప్రదాయాల ఆచరణలకు మూలమైన పవిత్ర వనాన్ని విశ్వవిద్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసినందుకు రాష్ట్రపతి విశ్వవిద్యాలయాన్ని ప్రశంసించారు. ఈ పవిత్ర వనమనేది పర్యావరణ,స్థానిక జీవవైవిధ్య పరిరక్షణకు కీలకమని ఆమె అన్నారు. సామాజిక ఆధారిత సహజ వనరుల నిర్వహణకు ఇది ఉత్తమ ఉదాహరణలలో ఒకటని పేర్కొన్నారు.
ప్రపంచం మొత్తం భూతాపాన్ని (గ్లోబల్ వార్మింగ్), పర్యావరణ మార్పుకు సంబంధించి భారీ సవాళ్ళను ఎదుర్కొంటోందని రాష్ట్రపతి అన్నారు.
ప్రకృతి అనుకూల జీవనశైలిని అవలంబించడంలో ప్రపంచానికి భారత్ ఒక ఉదాహరణగా నిలిచిందని, దీనినే పర్యావరణం కోసం జీవనశైలి లేదా లైఫ్ (LiFE) అంటారని పేర్కొన్నారు. మన సంప్రదాయంలో చెట్లు, మొక్కలు, పర్వతాలు, నదులు అన్నింటికీ ప్రాణం ఉంటుందని, కేవలం మానవులు మాత్రమే కాక అన్ని జీవరాశులు ప్రకృతి బిడ్డలేనని ఆమె అన్నారు. కనుక, ప్రకృతితో సామరస్యంతో జీవించడం మానవులందరి బాధ్యత అన్నారు. జీవవైవిధ్య పరంగా, ఈ ప్రాంతంలోని సిమిలిపాల్ జాతీయ పార్క్ ప్రపంచంలోనే కీలక స్థానాన్ని కలిగి ఉందని ఆమె తెలిపారు. తమ పరిశోధన, ఆవిష్కరణ ద్వారా జీవవైవిధ్యాన్ని పరిరక్షించేందుకు విశ్వవిద్యాలయంలోని విద్యార్ధులు, అధ్యాపకులు మార్గాన్ని అన్వేషిస్తారనే విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు.
పట్టాలను పొందుతున్న విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, డిగ్రీని అందుకోవడం అంటే విద్యా ప్రక్రియ పూర్తి అయినట్టు కాదని రాష్ట్రపతి పేర్కొన్నారు. విద్య అనేది నిరంతర ప్రక్రియ. ఉన్నత విద్య పట్టాను పొందిన తర్వాత వారిలో కొందరు ఉద్యోగం చేస్తారని, మరికొందరు వ్యాపారం, పరిశోధన చేస్తారని, కానీ ఉపాధిని కల్పించాలన్న ఆలోచన అన్నది ఉద్యోగం చేద్దామన్న ఆలోచనకు మెరుగైందన్నారు. ఈ విశ్వవిద్యాలయం ఇన్‌క్యుబేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, విద్యార్ధులు, పూర్వ విద్యార్ధులు, సాధారణ ప్రజలు స్టార్టప్‌లు ప్రారంభించడంలో తోడ్పాటును అందించడం ప్రశంసనీయమని, హర్షాన్ని వ్యక్తం చేశారు.
పోటీ అనేది జీవితంలో అనివార్య కోణమని రాష్ట్రపతి తెలిపారు. జీవితంలోని ప్రతి జీవనవృత్తిలోనూ అందరూ పోటీని ఎదుర్కోవలసిందేనని అన్నారు. పోటీలో విజయాన్ని సాధించేందుకు విద్యార్ధులు నిరంతరం కృషి చేస్తుండాలని, అందుకోసం ఉన్నత నైపుణ్యాలను సంపాదించి, మరింత సామర్ధ్యం దిశగా ప్రయాణించాలని ఆమె ఉద్బోధించారు. అప్పుడు వారు తమ దృఢ సంకల్పంతో అసాధ్యాన్ని సాధ్యం చేయగలరని ఆమె అన్నారు.
పోటీ అనేది జీవితపు సహజ కోణమని, అయితే సహకారమనేది జీవితపు అందమైన కోణమని రాష్ట్రపతి పేర్కొన్నారు. జీవితంలో ముందుకు పురోగమిస్తున్నప్పుడు, వారు వెనుతిరిగి చూసుకుంటే, సమాజంలో కొందరు వ్యక్తులు తమతో పోటీపడగల సామర్ధ్యం లేనివారనే విషయాన్ని తెలుసుకుంటారని ఆమె విద్యార్ధులకు చెప్పారు. అణచివేతకు గురైన వారి చేతులు పట్టుకుని, వారిని కూడా ముందుకు తీసుకురావలసిందిగా ఆమె విద్యార్ధులకు సలహా ఇచ్చారు. ఉదారత, సహకారం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలమని ఆమె అన్నారు. కేవలం తమ స్వంత ఆనందం, ప్రయోజనం గురించి ఆలోచించడమే కాక సమాజ, దేశ సంక్షేమం కోసం ఆలోచించవలసిందిగా విద్యార్ధులకు విజ్ఞప్తి చేశారు.
***
(Release ID: 1922326)
Visitor Counter : 234