ఆర్థిక మంత్రిత్వ శాఖ
2023-24 కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన విధంగా, కోవిడ్-19 కాలానికి ఎం.ఎస్.ఎం.ఈ. లకు ఉపశమనం కోసం ప్రభుత్వం "వివాద్-సే-విశ్వాస్" పథకాన్ని ప్రారంభించింది
పథకం కింద దావాలను సమర్పించడానికి చివరి తేదీ 30.06.2023
Posted On:
02 MAY 2023 4:27PM by PIB Hyderabad
ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యయ శాఖ, కోవిడ్-19 కాలానికి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్.ఎం.ఈ.లకు) ఉపశమనం అందించడం కోసం “వివాద్-సే-విశ్వాస్ I – ఎం.ఎస్.ఎం.ఈ. లకు ఉపశమనం” అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ 2023-24 కేంద్ర బడ్జెట్ లో ప్రకటించారు. కేంద్ర బడ్జెట్ ప్రసంగం లోని 66వ పేరాలో, శ్రీమతి. సీతారామన్ ఈ విధంగా ప్రకటించారు:-
“కోవిడ్ కాలంలో ఒప్పందాలను అమలు చేయడంలో ఎం.ఎస్.ఎం.ఈ. లు విఫలమైన సందర్భాల్లో, బిడ్ లేదా పనితీరు భద్రతకు సంబంధించి నష్టపోయిన మొత్తంలో 95 శాతాన్ని ప్రభుత్వం, లేదా, ప్రభుత్వ సంస్థల ద్వారా వారికి తిరిగి చెల్లించడం జరుగుతుంది. ఇది ఎం.ఎస్.ఎం.ఈ. లకు ఉపశమనం కలిగిస్తుంది”.
పథకం విస్తృత నిర్మాణాన్ని సూచిస్తూ 06.02.2023 తేదీన, ఆర్థిక మంత్రిత్వ శాఖ, వ్యయ విభాగం, ఒక ఉత్తర్వును జారీ చేసింది. దీనికి సంబంధించి తుది సూచన, మరిన్ని కేసులను కవర్ చేయడానికి ఉపశమనాన్ని పొడిగిస్తూ, రీఫండ్ల పరిమితులను సడలిస్తూ 11.04.2023 తేదీన జారీ చేయడం జరిగింది. 17.04.2023 తేదీన ప్రారంభమైన ఈ పథకం కింద క్లెయిమ్ ల సమర్పణకు చివరి తేదీ 30.06.2023.
మానవ చరిత్రలో అతిపెద్ద సంక్షోభాల్లో ఒకటైన కోవిడ్-19 మహమ్మారి ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగాఎస్.ఎస్.ఎం.ఈ. లపై వినాశకరమైన ప్రభావాన్ని చూపింది. ఈ పథకం కింద అందించబడిన ఉపశమనం ఎం.ఎస్.ఎం.ఈ. రంగాన్ని ప్రోత్సహించడంలో, నిలబెట్టడంలో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కొనసాగింపుగా ఉంది.
ఈ పథకం కింద, కోవిడ్-19 మహమ్మారి సమయంలో జప్తు చేయబడిన / కోత విధించబడిన పనితీరు భద్రత, బిడ్ భద్రత మరియు లిక్విడేటెడ్ నష్టాలను వాపసు చేయాల్సిందిగా మంత్రిత్వ శాఖలను కోరడం జరిగింది. కోవిడ్-19 కాలంలో ఒప్పందాలను అమలు చేయడంలో డిఫాల్ట్గా డిబార్ చేయబడిన ఎంఎస్.ఎం.ఈ.లకు కూడా నిర్దిష్ట ఉపశమనం అందించబడింది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఈ పథకం ద్వారా, కోవిడ్-19 కాలంలో ప్రభావితమైన అర్హత కలిగిన ఎం.ఎస్.ఎం.ఈ అందజేసే అదనపు ప్రయోజనాలు ఈ విధంగా ఉన్నాయి:
- నష్టపోయిన పెరఫార్మెన్స్ సెక్యూరిటీ లో 95శాతం తిరిగి చెల్లించబడుతుంది.
- నష్టపోయిన బిడ్ సెక్యూరిటీ లో 95 శాతం తిరిగి చెల్లించబడుతుంది.
- తీసివేయబడిన లిక్విడేటెడ్ డ్యామేజెస్ (ఎల్.డి) లో 95 శాతం తిరిగి చెల్లించబడుతుంది.
- గ్రహించిన రిస్క్ కొనుగోలు మొత్తంలో 95 శాతం తిరిగి చెల్లించబడుతుంది.
- అటువంటి ఒప్పందాలను అమలు చేయడంలో డిఫాల్ట్ కారణంగా మాత్రమే ఏదైనా సంస్థ డిబార్ చేయబడినట్లయితే, సేకరణ సంస్థ తగిన ఉత్తర్వును జారీ చేయడం ద్వారా అటువంటి డిబార్మెంట్ కూడా రద్దు చేయబడుతుంది.
ఏదేమైనప్పటికీ, మధ్యంతర వ్యవధిలో డీబార్మెంట్ కారణంగా ఏదైనా కాంట్రాక్ట్ ను ప్లేస్మెంట్ చేయడానికి ఒక సంస్థ విస్మరించబడినట్లయితే, (అనగా ఈ ఆర్డర్ కింద డిబార్మెంట్ తేదీ మరియు రద్దు తేదీ), ఎలాంటి దావా స్వీకరించబడదు.
- ఆ విధంగా వాపసు చేసిన మొత్తానికి వడ్డీ చెల్లించబడదు.
భారత ప్రభుత్వ అన్ని మంత్రిత్వ శాఖలు / శాఖల కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు/ నిర్వాహకులకు వ్యయ విభాగం జారీ చేసిన ఆఫీస్ మెమోరాండం ప్రకారం, ఎం.ఎస్.ఎం.ఈ. లతో ఏదైనా మంత్రిత్వ శాఖ / విభాగం / అనుబంధిత లేదా సబార్డినేట్ ఆఫీస్ / స్వయంప్రతిపత్తి సంస్థ / ప్రభుత్వ రంగ సంస్థలు (సి.పి.ఎస్.ఈ) / కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకులు / ఆర్ధిక సంస్థలు మొదలైన వాటి ద్వారా కుదుర్చుకున్న వస్తువులు, సేవల సేకరణ కోసం అన్ని ఒప్పందాలలో ఉపశమనం అందించబడుతుంది. ఇది క్రింది ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది:
- సరఫరాదారు / కాంట్రాక్టర్ ద్వారా క్లెయిమ్ చేసిన తేదీన ఎంఎస్.ఎం.ఈ. మంత్రిత్వ శాఖ సంబంధిత పథకం ప్రకారం మధ్యస్థ, చిన్న లేదా సూక్ష్మ సంస్థగా నమోదై ఉండాలి. వస్తువులు, సేవలకు చెందిన ఏదైనా వర్గం కోసం ఎం.ఎస్.ఎం.ఈ. నమోదు చేసి ఉండవచ్చు.
- ఒరిజినల్ డెలివరీ పీరియడ్ / కాంట్రాక్ట్ లో నిర్దేశించిన పూర్తి వ్యవధి 19.02.2020 నుండి 31.03.2022 మధ్య (రెండు తేదీలు కలుపుకొని ఉంటాయి) ఉండాలి.
ఈ పథకం అమలు కోసం ప్రభుత్వ ఇ-మార్కెట్ప్లేస్ (జి.ఈ.ఎం) ఒక ప్రత్యేక వెబ్ పేజీని అభివృద్ధి చేసింది. అర్హత గల దావాలను జి.ఈ.ఎం. ద్వారా మాత్రమే పరిశీలించడం జరుగుతుంది.
*****
(Release ID: 1921669)