రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జీ-20 ఆరోగ్య మంత్రుల సమావేశం తో పాటు 2023 ఆగస్టు నెలలో భారతీయ వైద్య పరికరాల రంగంపై మూడు రోజుల ఇండియా మెడ్‌టెక్ ఎక్స్‌పో 2023


గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో మూడు రోజుల పాటు ఎక్స్‌పో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్న కేంద్ర ఫార్మాస్యూటికల్స్ విభాగం, పరిశ్రమ సంఘాలు

Posted On: 24 APR 2023 1:23PM by PIB Hyderabad

జీ-20 ఆరోగ్య మంత్రుల సమావేశం తో పాటు 2023 ఆగస్టు నెలలో  భారతీయ వైద్య పరికరాల రంగంపై మూడు రోజుల  ఇండియా మెడ్‌టెక్ ఎక్స్‌పో, 2023 నిర్వహించడానికి కేంద్ర ఫార్మాస్యూటికల్స్ విభాగం, పరిశ్రమ సంఘాలు సన్నాహాలు ప్రారంభించాయి. జీ-20 అధ్యక్ష హోదాలో భారతదేశం వ్యవహరిస్తున్న నేపథ్యంలో భారతదేశ వైద్య పరికరాల తయారీ రంగం శక్తి సామర్ధ్యాలు, సాధించిన ప్రగతి, అభివృద్ధి సాధించడానికి గల అవకాశాలను  ప్రపంచ దేశాలకు తెలియజేయాలన్న లక్ష్యంతో ఇండియా మెడ్‌టెక్ ఎక్స్‌పో, 2023 ను నిర్వహిస్తున్నారు. 

 గుజరాత్‌లోని గాంధీ నగర్‌లోని హెలిప్యాడ్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మూడు రోజుల పాటు (18-20 ఆగస్టు 2023) వైద్య పరికరాల తయారీ రంగంపై  తొలిసారిగా జాతీయ స్థాయి ఎక్స్‌పోను నిర్వహించాలని నిర్ణయించింది. జీ-20 ఆరోగ్య మంత్రుల సమావేశం 2023 ఆగస్టు 17-19 మధ్య గాంధీ నగర్‌లో జరగనుంది.

తొలుత ఇండియా మెడ్‌టెక్ ఎక్స్‌పో 2023 ను జనవరిలో నిర్వహించాలని భావించారు. అయితే, పరిశ్రమ వర్గాల నుంచి అందిన సూచనల మేరకు జీ-20 ఆరోగ్య మంత్రుల సమావేశంతో పాటు ఇండియా మెడ్‌టెక్ ఎక్స్‌పో 2023 ను నిర్వహించాలని నిర్ణయించారు. దీనివల్ల భారతదేశ వైద్య పరికరాల తయారీ రంగం ప్రపంచానికి పరిచయం అవుతుంది. పిఎల్ఐ పధకం, మెడికల్ డివైజెస్ పార్క్ పథకం  మొదలైన  కార్యక్రమాల ద్వారా వైద్య పరికరాల తయారీ రంగానికి  ఫార్మాస్యూటికల్స్ శాఖ సహాయ సహకారాలు అందిస్తోంది.అర్రోగ్య సంరక్షణ రంగం మార్కెట్ లో వైద్య పరికరాల తయారీ రంగం వాటా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం వినియోగ వస్తువుల నుంచి ఇంప్లాంట్ చేయగల వైద్య పరికరాలు దేశంలో ఉత్పత్తి అవుతున్నాయి.పిఎల్ఐ పథకం సహకారంతో  సిటీ స్కాన్, ఎంఆర్ఐ, లినక్  వంటి అత్యాధునిక వైద్య పరికరాలు దేశంలో  తయారు చేస్తున్నారు.

ఎక్స్‌పోలో దాదాపు 150 కి పైగా  స్టార్టప్‌లు, 275 కి మించి  భారతీయ, అంతర్జాతీయ వైద్య పరికరాల సంస్థలు, ఎంఎస్ఎంఈ యూనిట్లు, దాదాపు 50 పరిశోధనా సంస్థలు  పాల్గొంటాయి. 200 మంది విదేశీ కొనుగోలుదారులు ఉత్పత్తిదారులతో వ్యక్తిగత చర్చలు జరుపుతారు. 

భారతదేశంలో వైద్య పరికరాల రంగంలో $11 బిలియన్ల వరకు కార్యకలాపాలు జరుగుతున్నాయని  అంచనా. వైద్య పరికరాల తయారీ  రంగం గత దశాబ్దంలో 10-12%  వృద్ధి రేటు సాధించింది.  2030 నాటికి వైద్య పరికరాల తయారీ రంగం $ 50 బిలియన్ల స్థాయికి  చేరుకునే అవకాశం ఉంది. గుజరాత్ లో జరిగే ఎక్స్‌పో ద్వారా ప్రపంచానికి భారతదేశంలో వైద్య పరికరాల తయారీ సంస్థ తెలుస్తుంది. భారతీయ మెడ్‌టెక్ రంగానికి బ్రాండ్ గుర్తింపు కూడా లభిస్తుంది. 

***


(Release ID: 1919183) Visitor Counter : 169