వ్యవసాయ మంత్రిత్వ శాఖ
వారణాసిలో రేపటి నుంచి మూడు రోజుల పాటు (2023 ఏప్రిల్ 17-19) జీ-20 వ్యవసాయ ముఖ్య శాస్త్రవేత్తల (ఎంఏసీఎస్) సమావేశం సమావేశాన్ని ప్రారంభించనున్న జనరల్ (రిటైర్డ్) వి.కే.సింగ్
Posted On:
16 APR 2023 5:55PM by PIB Hyderabad
వారణాసిలో రేపటి నుంచి మూడు రోజుల పాటు (2023 ఏప్రిల్ 17-19) జీ-20 వ్యవసాయ ముఖ్య శాస్త్రవేత్తల (ఎంఏసీఎస్) సమావేశం జరగనున్నది. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ అనుబంధ వ్యవసాయ పరిశోధన,విద్య విభాగం (డేర్) సమావేశాన్ని నిర్వహిస్తుంది. జీ-20 సభ్యదేశాలు- అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారతదేశం, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు, అతిధి దేశాలైన బంగ్లాదేశ్, ఈజిప్ట్,మారిషస్, నెథర్లాండ్స్,నైజీరియా, ఒమాన్,సింగపూర్,స్పెయిన్,యూఏఈ, వియత్నాం దేశాల ప్రతినిధులు, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఎఫ్ ఎస్ బి,ఓఈసీడీ, ఏయూ, ఏయూడీఏ, ఆసియాన్ సంస్థల ప్రతినిధులు, భారతదేశం ఆహ్వానించిన ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, సీడీఆర్, ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రతినిధులు మూడు రోజుల పాటు జరిగే సమావేశంలో పాల్గొంగారు.
వ్యవసాయ మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు కూడా సమావేశానికి హాజరవుతారు. వ్యవసాయ రంగంలో పరిశోధన, అభివృద్ధి, ఆహార భద్రత, పౌష్టికాహారం, వాతావరణ హిత వ్యవసాయం, డిజిటల్ వ్యవసాయం,ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం లాంటి అంశాలు సమావేశంలో చర్చకు రానున్నాయి. 'చిరుధాన్యాలు, ఇతర సంప్రదాయ వ్యవసాయ ఉత్పత్తుల రంగంలో అంతర్జాతీయ పరిశోధన (మహర్షి) కార్యక్రమాలు చేపట్టే అంశం కూడా సమావేశంలో చర్చకు వస్తుంది. జీ-20 అధ్యక్ష హోదాలో భారతదేశం మహర్షి కార్యక్రమాన్ని ప్రతిపాదించింది. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం సందర్భంగా చిరుధాన్యాలు, ఇతర సంప్రదాయ వ్యవసాయ ఉత్పత్తులకు తగిన ప్రచారం కల్పించడానికి భారతదేశం మహర్షి కార్యక్రమాన్ని అమలు చేయాలనీ ప్రతిపాదించింది.
సమావేశాలకు హాజరవుతున్న ప్రతినిధులకు భారతదేశ సంస్కృతి, సంప్రదాయం, వారసత్వ విలువలు తెలియజేసే విధంగా వారణాసి లో కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూరి చేసింది. వారణాసి విమానాశ్రయంలో సాంప్రదాయ పద్ధతిలో ప్రతినిధులకు స్వాగతం పలుకుతారు. ప్రతినిధులకు వారణాసిలో వసతి కల్పించిన యంత్రాంగం రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసింది. సమావేశం జరిగే ప్రాంగణం, ప్రతినిధులు బస చేసే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
సుస్థిర వ్యవసాయం, ప్రజల ఆరోగ్యం కోసం ఆహార వ్యవస్థ అనే అంశంపై మూడు రోజుల సమావేశంలో విస్త్రుత్వ చర్చలు జరుగుతాయి. ప్రారంభ సమావేశానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ సహాయ మంత్రి జనరల్ (రిటైర్డ్)వి.కే.సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఆహార భద్రత, పౌష్టికాహారం, పటిష్ట వ్యవసాయ విధానాలు, డిజిటల్ వ్యవసాయం, విలువ ఆధారిత వ్యవసాయం,వ్యవసాయ రంగంలో ప్రభుత్వ,ప్రైవేటు రంగం భాగస్వామ్యంతో పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం లాంటి అంశాలపై నిపుణులు ప్రసంగిస్తారు. మహర్షి కార్యక్రమంపై జరిగే ప్రత్యేక సమావేశంలో నిపుణులు, జీ-20 సభ్య దేశాలు, ఆహ్వానిత దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ప్రసంగిస్తారు. సదస్సు 2వ రోజున వ్యవసాయ ముఖ్య శాస్త్రవేత్తల (ఎంఏసీఎస్) సమావేశం జరుగుతుంది. అదే రోజు సమావేశం తీర్మానాన్ని ఆమోదిస్తుంది.
జీ-20 అధ్యక్ష హోదాలో ఒక భూమి, ఒక కుటుంబం,ఒకే భవిష్యత్తు స్పూర్తితో కార్యక్రమాలు అమలు చేయాలని భారతదేశం నిర్ణయించింది. ప్రపంచ దేశాల మధ్య అవగాహన, సమన్వయం సాధించి సమగ్ర సంపూర్ణ అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో భారతదేశం కార్యక్రమాలు రూపొందించింది.
2023 ఏప్రిల్ 17న సమావేశానికి హాజరవుతున్న ప్రతినిధులు గంగా హారతి ని తిలకిస్తారు. అనంతరం ప్రతినిధులకు తాజ్ గంగాస్‌లో విందు కార్యక్రమంలో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు తిలకిస్తారు. జీ-20 ప్రతినిధుల గౌరవార్ధం ఇస్తున్న విందులో జనరల్ (రిటైర్డ్) వి.కే.సింగ్ పాల్గొంటారు.
2023 ఏప్రిల్ 18న ప్రతినిధులు సారనాధ్ సందర్శిస్తారు. సారనాధ్ మ్యూజియం, బుద్ధ స్థూపం సందర్శించి లైట్ అండ్ సౌండ్ షోను కూడా చూస్తారు. తదనంతరం, బుద్ధ థీమ్ పార్క్ ప్రశాంతమైన పరిసరాల్లో ప్రతినిధుల కోసం సాంస్కృతిక ప్రదర్శన, విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ప్రతినిధులు 2023 ఏప్రిల్ 19 న ట్రేడ్ ఫెసిలిటేషన్ సెంటర్‌ను సందర్శిస్తారు. స్థానిక కళాకారులు తమ ఉత్పత్తులను ప్రత్యక్షంగా తయారు చేసి చూపిస్తారు. ప్రతినిధులకు వారణాసి వస్త్ర చరిత్ర వివరాలు తెలియజేసే విధంగా యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్,రాష్ట్ర వ్యవసాయ శాఖకు చెందిన ప్రముఖ సంస్థల ఆధ్వర్యంలో ప్రదర్శనలు జరుగుతాయి. వేదిక వద్ద వేడి వేడి చిరుధాన్యాల వంటకాలను ప్రతినిధులు రుచి చూస్తారు. హోటల్ తాజ్ గంగాస్‌లో వీడ్కోలు విందు, సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయి.
2023 ఏప్రిల్ 20 న ప్రతినిధులు తమ తమ దేశాలకు తిరుగు ప్రయాణం అవుతారు.
***
(Release ID: 1917160)
Visitor Counter : 235