వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

అనేక అవకాశాలు భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయ వ్యాపార, పెట్టుబడి గమ్యస్థానాలలో ఒకటిగా మార్చాయి: రోమ్‌ లో జరిగిన సి.ఈ.ఓ. ల పరస్పర వ్యాపార చర్చా కార్యక్రమంలో శ్రీ పీయూష్ గోయల్


కొత్త అవకాశాలు, సామర్ధ్యాల నేపథ్యంలో భారత్-ఇటలీ భాగస్వామ్యంలో అధిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి: శ్రీ గోయల్


భారత్ - ఇటలీ దేశాలు రెండు కలిసి ఎదగాలి, కలిసి సాధించాలి, కలిసి జయించాలి: శ్రీ గోయల్


సంప్రదాయం, సంస్కృతి, భాగస్వామ్య విలువలు, చట్టబద్ధమైన పాలనతో సహా మరిన్ని సాధించడానికి, ఒకటిగా పని చేయాలనే ఆకాంక్షతో, భారత్-ఇటలీ దేశాలు రెండూ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయి: శ్రీ గోయల్

Posted On: 14 APR 2023 11:20AM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, జౌళి శాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయల్, ఇటలీలోని రోమ్‌లో నిన్న జరిగిన సి.ఈ.ఓ. పరస్పర వ్యాపార చర్చా గోష్ఠి లో మాట్లాడుతూ, అనేక అవకాశాలు భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయ వ్యాపార, పెట్టుబడి గమ్యస్థానాలలో ఒకటిగా మార్చాయని పేర్కొన్నారు. ఈ.యు., ఈ.ఎఫ్.టి.ఏ. లతో జరుగుతున్న వాణిజ్య చర్చలతో, గ్లోబల్ లింకేజీలతో భారతదేశం మరింత ఉదారంగా  వ్యవహరిస్తుందనీ పేర్కొన్నారు. 

భారత్-ఇటలీ దేశాల భాగస్వామ్యంలో అధిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలనీ, ముఖ్యంగా ఇటీవల వృద్ధి చెందిన వ్యూహాత్మక భాగస్వామ్యం నేపథ్యంలో చాలా కొత్త అవకాశాలు ఉన్నాయనీ, పేర్కొన్నారు.   గత రెండేళ్లలో మొత్తం ఎగుమతుల్లో భారతదేశం 55 శాతం వృద్ధిని సాధించిందని ఆయన చెప్పారు.  భారతదేశంలో దాదాపు ఏడూ వందల ఇటలీ కంపెనీలు పనిచేస్తున్నాయనీ, భారత్‌ లో ఉండేందుకు ఇదే అత్యంత అనువైన సమయమనీ, ఆయన అన్నారు.  భారతదేశం పునరాలోచన మార్పులతో చాలా పటిష్టమైన, ముందుచూపుతో కూడిన విధాన కార్యాచరణ ను అందిస్తుందని కూడా మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. 

ఇటలీ ఉప ప్రధానమంత్రి, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ఆంటోనియో తజానీ కూడా ఇంటరాక్టివ్ సెషన్‌ లో పాల్గొని పరిశ్రమ కెప్టెన్లను ఉద్దేశించి ప్రసంగించారు.  ఎం.ఎస్.ఎం.ఈ. లు, పరిశ్రమలకు మద్దతు ఇవ్వడం ద్వారా రెండు దేశాల్లో తదుపరి తరానికి మెరుగైన జీవితాన్ని సృష్టించేందుకు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని శ్రీ తజని సూచించారు. 

భారత్-ఇటలీ దేశాల భాగస్వామ్యం వృద్ధి చెందడానికి అద్భుతమైన అవకాశం ఉందనీ, తమ పర్యటన ద్వారా కొత్త ఆలోచనలు ఉద్భవించాయనీ శ్రీ గోయల్ పేర్కొంటూ, పటిష్టమైన ఈ ఒప్పందం పట్ల శ్రీ తజనీ ని ఎంతో మెచ్చుకున్నారు.  సంప్రదాయం, సంస్కృతి, భాగస్వామ్య విలువలు, చట్టబద్ధమైన పాలనతో సహా, మరిన్ని సాధించడానికి, ఒకటిగా పని చేయాలనే ఆకాంక్షతో, ఇరుదేశాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.   భారత్-ఇటలీ రెండూ కలిసి వృద్ధి చెందుతాయనీ, కలిసి సాధిస్తాయనీ, కలిసి జయిస్తాయనీ కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఇటలీలోని రోమ్‌ నగరంలో ఉన్న భారత రాయబార కార్యాలయంలో భారత పరిశ్రమల సమాఖ్య (సి.ఐ.ఐ) కాన్ఫిండస్ట్రియాతో కలిసి, సి.ఈ.ఓ. లతో వ్యాపార పరస్పర చర్చా గోష్ఠిని నిర్వహించింది.  ఈ కార్యక్రమంలో, భారత-ఇటలీ దేశాలకు చెందిన 70 మందికి పైగా సి.ఈ.ఓ. లు  పాల్గొన్నారు.

ఇటలీ వ్యాపారానికి స్పార్కిల్, ఎలెట్ట్రోనికా, పియాజియో, లంబోర్ఘిని, ఐ.టి.ఏ. మొదలైన దిగ్గజ సంస్థలు ప్రాతినిధ్యం వహించాయి.  భారతదేశం ఒక ముఖ్యమైన ఆర్థిక వ్యవస్థ అనీ, ప్రభుత్వ, పరిశ్రమ స్థాయిలో సహకారాన్ని పెంచుకోవాల్సిన సమయం ఆసన్నమైందనీ, సి.ఈ.ఓ. లు పేర్కొన్నారు.  భారతదేశంలో ఉన్న వివిధ పెట్టుబడి అవకాశాలను ఇటలీ సంస్థలు అన్వేషిస్తున్నాయని కూడా వారు తెలియజేశారు. 

సి.ఐ.ఐ. ఉపాధ్యక్షుడు, ఐ.టి.సి. సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ సంజీవ్ పురీ మాట్లాడుతూ, భారతదేశం - ఈ.యు. ఎఫ్.టి.ఏ. ఒప్పందం భారత్-ఇటలీ దేశాల సంబంధాన్ని మరింత మెరుగుపరచడానికి ఉత్ప్రేరకంగా ఉంటుందని ఉద్ఘాటించారు.  సి.ఐ.ఐ. డైరెక్టర్ జనరల్ శ్రీ చంద్రజిత్ బెనర్జీ కాన్ఫిన్డస్ట్రియా వారి సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, సహకారానికి అవకాశం ఉన్న వివిధ రంగాలను సూచించారు.  భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య - ఎఫ్.ఐ.ఈ.ఓ. అధ్యక్షుడు డా. ఎ. శక్తివేల్ మాట్లాడుతూ, పటిష్టమైన విధానం కారణంగా 2022-23 ఆర్ధిక సంవత్సరంలో భారతదేశం 770 బిలియన్ల అమెరికా డాలర్ల మేర ఎగుమతులను సాధించిందనీ, ఇటాలీ వ్యాపారులు భారతదేశాన్ని తమ ఎగుమతి కేంద్రంగా చూడాలని సూచించారు.  భారతదేశంలోని తమ సంస్థలకు ఎఫ్.ఐ.ఈ.ఓ. మద్దతునిస్తుందని ఆయన చెప్పారు. 

కాన్ఫిండస్ట్రియా నుండి రాయబారి రాఫెల్ లాంగెల్లా మాట్లాడుతూ భారతదేశం చాలా ముఖ్యమైన ఆర్థిక దశలో ఉందనీ, సహకారాన్ని మరింతగా పెంచాల్సిన సమయం ఆసన్నమైందనీ, పేర్కొన్నారు.  పియాజియో సి.ఈ.ఓ. శ్రీ మట్టేయో కొలానిన్నో మాట్లాడుతూ, రెండు ప్రభుత్వాలు, అవకాశాలను అన్వేషించి, తమ తమ దేశాలలో సంస్థలను ప్రారంభించడానికి, రెండు దేశాలు వేగంగా కృషి చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.  శ్రీ జై ష్రాఫ్, యు.పి.ఎల్., మాట్లాడుతూ, ఆహార సుస్థిరత, సహకారం ప్రాముఖ్యతపై బలమైన అనుబంధాలను వ్యక్తం చేశారు. 

శ్రీ గోయల్ తన ఇటలీ పర్యటన సందర్భంగా ఎస్.ఓ.ఎల్., ఎస్.పి.ఏ., పియాజియో, సి.ఐ.బి.జె.ఓ., నయారా ఎనర్జీ, ఎనెల్ గ్రీన్ పవర్ వంటి కొన్ని ప్రముఖ కంపెనీల ఇటాలియన్ సి.ఈ.ఓ. లతో చాలా ఉత్పాదకమైన పరస్పర సమావేశాలు నిర్వహించారు.  భారతదేశంలో పెట్టుబడుల వాతావరణం, విధాన సంస్కరణలు, భారతదేశంలో పెట్టుబడులు పెట్టడం, విస్తరించడం వంటి అవకాశాలను ఆయన వారికి వివరించారు.  భారత మార్కెట్లతో పాటు ఎగుమతులకు అనుగుణంగా భారతదేశంలో కార్యకలాపాలను విస్తరించాలని చూస్తున్నట్లు సీ.ఈ.ఓ.లు మంత్రి కి తెలియజేశారు. వీటి వల్ల ఉత్పత్తి విస్తరణ, ఉపాధి కల్పనకు దారితీయడంతో పాటు, భారతదేశం నుండి ఎగుమతులు కూడా పెరుగుతాయి. 

స్టీల్ స్క్రాప్, ఎనర్జీ సెక్టార్‌లో పనిచేస్తున్న ఒక కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, డానియెలీ సి. ఎస్.పి.ఏ. శ్రీ ఆండ్రియా డయాస్పర్రో తో శ్రీ గోయల్ సమావేశమయ్యారు.  భారత మార్కెట్ అనేక అవకాశాలతో పెద్దదిగా ఉందనీ, భారతదేశం క్రమంగా గ్రీన్ స్టీల్ తయారీకి వెళ్లాలని కోరుకుంటోందనీ, అక్కడ వారు విస్తరించడానికి గొప్ప అవకాశం ఉందని మంత్రి వారికి సూచించారు.

 

 

*****



(Release ID: 1916814) Visitor Counter : 196