జౌళి మంత్రిత్వ శాఖ

31 వస్తువులకు సంబంధించి 2 నాణ్యతా నియంత్రణ ఉత్తర్వులు జారీచేసిన కేంద్రం


సాంకేతిక వస్త్రాలకు భారత ప్రమాణాల బ్యూరో ధ్రువీకరణ తప్పనిసరి చేస్తూ జౌళి మంత్రిత్వ శాఖ నాణ్యతా నియంత్రణ ఉత్తర్వులు (క్యు సి ఓ) ప్రవేశపెట్టింది.

నాణ్యతా నియంత్రణ ఉత్తర్వుల వల్ల సాంకేతిక పరమైన వస్త్రాల ప్రమాణాలు, నాణ్యతకు హామీ లభిస్తుంది. మరియు ఇండియాలో ఈ పరిశ్రమ పెరుగుదలకు ప్రోత్సాహం లభిస్తుంది.

Posted On: 11 APR 2023 1:27PM by PIB Hyderabad

       జౌళి మంత్రిత్వ శాఖ 31 వస్తువులకు సంబంధించి  02 నాణ్యతా నియంత్రణ ఉత్తర్వులను జారీచేసింది. సాంకేతిక నియంత్రణ ప్రక్రియ పూర్తయిన తరువాత మొదటి దశ జారీ చేసిన ఉత్తర్వులలో నిర్మాణ రంగంలో ఉపయోగించే వస్త్రాలు /బట్టలు 19 మరియు సంరక్షణ సంబంధ వస్త్రాలు 12 రకాలు ఉన్నాయి.  

      ఈ ఉత్తర్వులు ఇండియానుంచి సాంకేతిక వస్త్రాల పరిశ్రమకు సంబంధించి జారీయైన ఆజ్ఞ లలో మొదటివని జౌళి మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ శ్రీ రాజీవ్ సక్సేనా మంగళవారం ఒక పత్రికా గోష్టిలో తెలిపారు.  

      పర్యావరణం, మానవాళి ఆరోగ్యం,  జంతువులు  మరియు మొక్కల జీవనం మరియు ఆరోగ్యం పరిరక్షణ కోసం ప్రజా ప్రయోజనం దృష్ట్యా  భూ వస్త్రాలు (జియో టెక్స్టైల్స్) , సంరక్షణ  వస్త్రాల ప్రామాణికతను, నాణ్యతను పెంచవలసిన అవసరం ఉందని కేంద్రం అభిప్రాయపడుతోంది.     జియో టెక్స్టైల్స్ నిర్మాణ, మౌలిక సదుపాయాల కల్పనా  ప్రాజెక్టులలో , రహదారులు, రైలు మార్గాల నిర్మాణంలో గట్లు స్థిరీకరించడానికి వాడుతారు.  అంతేకాక పర్యావరణ  అవసరాలకు ఉపయోగిస్తారు.  కాగా  సంరక్షణ  అవసరాల కోసం ఉపయోగించే వస్త్రాలను ప్రమాదకర, ప్రతికూల పని పరిస్థితులలో  మనుష్యుల ప్రాణ రక్షణ కోసం ఉపయోగిస్తారు.  
నాణ్యతా నియంత్రణ ఉత్తర్వులను ప్రవేశపెట్టడం వల్ల తయారీదారులు నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేస్తారు.  వినియోగదారులకు వారి డబ్బుకు సరైన విలువ లభిస్తుంది.  తద్వార భారత ఉత్పత్తుల నాణ్యత ప్రపంచ ప్రమాణాలకు సరితూగే విధంగా ఉంటుంది.  

   ఇప్పుడు జారీచేసిన ఉత్తర్వులలో ఉన్న 31 వస్తువులలో 19 జియో టెక్స్టైల్స్ వర్గానికి చెందినవి.  వాటిలో పొరలు పొరలుగా ఉన్న హై డెన్సిటీ పోలీయేతేలీన్ (హెచ్ డి పి ఇ) ,  నీరు ఇంకని లైనింగ్ కోసం అల్లిన జియోమెంబ్రేన్, పి వి సితో చేసిన జియోమెంబ్రేన్, జవుళితో తయారు చేసిన జియో టెక్స్టైల్స్ ,  తాటి నార, కొబ్బరి పీచుతో వంటి ప్రకృతిలో తయారైన వస్తువులతో తయారు చేసినవి  ఉన్నాయి.  పీచు ఉత్పత్తులను డ్రైనేజీ పనులలో , పేవ్ మెంట్ల నిర్మాణంలో  ఉపయోగిస్తారు.  జియో టెక్స్టైల్స్ ను  కుషన్లుగా కూడా వాడతారు.  నిర్మాణ పనులలో భూమి స్థిరీకరణ కోసం కూడా వాడుతారు.   మట్టి కొట్టుకుపోకుండా ఇవి ఆపి ఉంచుతాయి.  

         మిగిలిన 12 వస్తువులు సంరక్షణ సంబంధమైనవి.  వాటిలో కర్టెన్లు, పైన కప్పి ఉంచే అలంకరణ వస్త్రాలు ఉన్నాయి.  అగ్నిమాపక దళ సిబ్బంది వేసుకునే దుస్తులు,  ఎండనక, వాననక శ్రమించే కార్మికులు వేసుకునే దుస్తులు ఉన్నాయి.   వేడి నుంచి , మంట నుంచి వారికి రక్షణ కల్పిస్తాయి.   బుల్లెట్లు తాకని జాకెట్లు,   నీరు చొరని బహుళార్ధక దుస్తులు కూడా వాటిలో ఉన్నాయి.

           జియో టెక్స్టైల్స్ మరియు సంరక్షణ సంబంధ వస్త్రాల తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం అధికారిక గెజిట్ ప్రచురించిన 180 రోజుల తరువాత వెంటనే అమలులోకి వస్తుంది.   ఈ ప్రమాణాలు దేశీయ తయారీదారులకు, విదేశాల నుంచి ఇండియాకు తమ వస్తువులను ఎగుమతి చేసే విదేశీ తయారీ దార్లకు కూడా వర్తిస్తాయి.  

           జౌళి మంత్రిత్వ శాఖ మరో రెండు నాణ్యతా ప్రమాణాల ఉత్తర్వులను జారీ చేయాలని సంకల్పించింది.    రెండవ దశలో 28 వస్తువులతో  ఉత్తర్వు జరీ చేస్తారు.  వాటిలో 22 వ్యవసాయ సంబంధ వస్త్రాలు మరియు 06 వైద్యపరమైన వస్త్రాలు,  మూడవ దశలో 30కి మించి సాంకేతిక పరమైన జౌళి వస్తువులను చేర్చి ఉత్తర్వులు జారీచేసే విషయం పరిశీలనలో ఉంది.
     
       నాణ్యతా నియంత్రణ ఉత్తర్వుల వల్ల సాంకేతిక పరమైన వస్త్రాల ప్రమాణాలు, నాణ్యతకు హామీ లభిస్తుంది. మరియు ఇండియాలో ఈ పరిశ్రమ పెరుగుదలకు ప్రోత్సాహం లభిస్తుంది.  తద్వారా  నాణ్యమైన ఉత్పత్తులు తయారై  పోటీ ధర లభిస్తుంది.  



 

*****



(Release ID: 1915743) Visitor Counter : 191