వ్యవసాయ మంత్రిత్వ శాఖ
భారతదేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొత్త గుర్తింపు తెచ్చారు... కేంద్ర మంత్రి శ్రీ తోమర్
లఘు ఉద్యోగ భారతి ఏర్పాటు చేసిన స్టార్ట్ అప్ సదస్సును ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ తోమర్
Posted On:
09 APR 2023 7:43PM by PIB Hyderabad
లఘు ఉద్యోగ భారతి గ్వాలియర్ లో ఏర్పాటు చేసిన స్టార్ట్ అప్ సదస్సు 2023 ను కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఈరోజు ప్రారంభించారు. సదస్సును ప్రారంభించిన అనంతరం ఏర్పాటైన సమావేశంలో మాట్లాడిన శ్రీ తోమర్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచంలో భారతదేశం నూతన గుర్తింపు పొందిందన్నారు. బ్రిటిష్ కాలం నాటి బానిస మనస్తత్వం నుంచి భారతదేశం బయటపడిందని దేశంలో మొత్తం దృశ్యం మారి పోయిందన్నారు. ఈ ఘనత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వల్లే సాధ్యమైందని అన్నారు.
దేశంలో ప్రతిభకు ఎప్పుడూ కొరత లేదని శ్రీ తోమర్ అన్నారు. అయితే, ఇంత కాలం ప్రతిభ గుర్తింపుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిభను ప్రదర్శించే వేదిక అందుబాటులో లేకపోవడంతో భారతీయుల ప్రతిభ ప్రపంచానికి తెలియ లేదన్నారు. ప్రతిభకు గుర్తింపు లేకపోవడం తో ప్రతిభావంతులు నిరాశ నిస్పృహలతో విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి కనబరిచారనున్నారు. అయితే, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమలు చేసిన విధానాలతో మొత్తం పరిస్థితి మారిపోయినదని శ్రీ తోమర్ అన్నారు. సానుకూల పరిస్థితి ఏర్పడే విధంగా శ్రీ నరేంద్ర మోదీ అమలు చేసిన విధానాల వల్ల దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం మీద పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు.
2014కి ముందు దేశంలో కేవలం 31 నుంచి 32 స్టార్ట్ అప్ సంస్థలు మాత్రమే ఉండేవని శ్రీ తోమర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన చర్యల వల్ల దేశంలో ప్రస్తుతం 6,500 కి పైగా స్టార్ట్ అప్ సంస్థలు పనిచేస్తున్నాయని ఆయన వివరించారు. వ్యవసాయ రంగంలో 2,000 కి పైగా స్టార్ట్ అప్ సంస్థలు ఏర్పాటయ్యాయని శ్రీ తోమర్ తెలిపారు. ప్రపంచ దేశాలు భారతదేశం సాధించిన ప్రగతిని గుర్తించి, మార్గదర్శకత్వం కోసం భారతదేశం వైపు చేస్తున్నాయన్నారు.
ప్రధాన మంత్రి శ్రీ మోదీ నేతృత్వంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం గుర్తింపు పొందిందని శ్రీ తోమర్ అన్నారు. ప్రపంచంలో భారతదేశ స్థానం కూడా మెరుగైందని శ్రీ తోమర్ అన్నారు. ప్రపంచ వ్యవహారాలలో భారతదేశం పలుకుబడి పెరిగిందన్నారు. భారతీయులను ఉక్రెయిన్ నుంచి తరలించడానికి వీలుగా ప్రధానమంత్రి జోక్యం చేసుకోవడంతో ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధానికి విరామం ప్రకటించడం పెరిగిన భారతదేశం ప్రతిష్టకు నిదర్శనమని శ్రీ తోమర్ అన్నారు.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఒక సమావేశంలో పరిచయం చేసిన సమయంలో అమెరికా అధ్యక్షుడు శ్రీ బిడెన్ ఒక సూర్యుడు, ఒకే ప్రపంచం మరియు ఒక మోడీ అని వ్యాఖ్యానించడం ప్రపంచ దేశాల్లో భారతదేశం సాధించిన గుర్తింపుకు నిదర్శనమని శ్రీ తోమర్ వ్యాఖ్యానించారు.
సదస్సుకు మధ్యప్రదేశ్ ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి శ్రీ ఓంప్రకాష్ సఖలేచా, పార్లమెంట్ సభ్యులు శ్రీ వివేక్ షెజ్వాల్కర్ మరియు లఘు ఉద్యోగ్ భారతి జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ ప్రకాష్ చంద్ర, జాతీయ అధ్యక్షుడు శ్రీ బల్దేవ్‌భాయ్ ప్రజాపతి, భారత ప్రధాన కార్యదర్శి శ్రీ ఘనశ్యామ్ ఓజా మరియు అఖిల భారత కార్యదర్శి శ్రీ సమీర్ ముంద్రా తదితరులు పాల్గొన్నారు.
***
(Release ID: 1915248)
Visitor Counter : 188