ప్రధాన మంత్రి కార్యాలయం

మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో రాణి కమలాపతి స్టేషన్ లో వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు పచ్చజెండా ఊపి ప్రారంభించిన ప్రధానమంత్రి


ఇండోర్ లో రామనవమి వేడుకల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి శ్రద్ధాంజలి

‘‘భారత రైల్వేలో అరుదైన ఘట్టం; అతి తక్కువ వ్యవధిలో ఒకే రైల్వే స్టేషన్ ను రెండు సార్లు సందర్శంచిన ప్రధానమంత్రి’’

‘‘నేడు భారతదేశం కొత్త ఆలోచనా ధోరణి, కొత్త వైఖరితో ముందుకు సాగుతోంది’’

‘‘భారతదేశ ఉత్సాహం, ఉత్సుకతకు చిహ్నం వందేభారత్. మన నైపుణ్యం, విశ్వాసం, సామర్థ్యాలకు అది ప్రతినిధి’’

‘‘వారు ఓటుబ్యాంకును సంతృప్తి (తుష్టీకరణ్) పరచడంలోనే బిజీగా ఉన్నారు, మేం పౌరుల అవసరాలు తీర్చడం పైనే (సంతుష్టీకరణ్) దృష్టి సారించాం’’

‘‘ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి’’ కింద ప్రస్తుతం 600 ఔట్ లెట్లు పని చేస్తున్నాయి, స్వల్పకాలంలోనే లక్ష కొనుగోళ్లు నమోదయ్యాయి’’

‘‘దేశంలో సగటు కుటుంబాల సౌకర్యానికి గుర్తుగా భారతీయ రైల్వే మారుతోంది’’

‘‘నేడు మధ్యప్రదేశ్ నిరంతర అభివృద్ధిలో కొత్త శకం రచిస్తోంది’’

‘‘ఒకప్పుడు ‘బీమారు’గా పరిగణించిన మధ్యప్రదేశ్ ఇప్పుడు అభివృద్ధికి చెందిన అన్ని కోణాల్లోనూ ప్రశంసనీయమైన పనితీరు ప్రదర్శిస్తోంది’’

‘‘భారతదేశ పేదలు, మధ్యతరగతి ప్రజలు, గిరిజనులు, దళిత-వెనుకబడిన వర్గాలు ఇప్పుడు నా రక్షణ కదచవ పరిధిలోకి వచ్చారు’

Posted On: 01 APR 2023 5:11PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భోపాల్  నుంచి న్యూఢిల్లీకి నడిచే వందే భారత్  ఎక్స్  ప్రెస్  కు మధ్యప్రదేశ్  లోని భోపాల్  లో రాణి కమలాపతి స్టేషన్లో  పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.  కార్యక్రమం జరిగే ప్రదేశానికి రాగానే ప్రధానమంత్రి రాణి కమలాపతి-న్యూఢిల్లీ వందే భారత్  ఎక్స్  ప్రెస్  ను పరిశీలించి రైలు సిబ్బందితోను, రైలులోని బాలలతోను సంభాషించారు.

ఇండోర్  లోని ఒక దేవాలయంలో రామనవమి ఉత్సవాల సందర్భంగా జరిగిన విషాదం పట్ల విచారం ప్రకటిస్తూ  ప్రమాదంలో మరణించిన వారికి నివాళి అర్పించడంతో ప్రధానమంత్రి తన ప్రసంగం ప్రారంభించారు. మరణించిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. దుర్ఘటనలో గాయపడిన వారు సత్వరం కోలుకోవాలని ఆకాంక్షించారు.

వందేభారత్  రైలు సాధించినందుకు మధ్యప్రదేశ్  ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ రైలు ఢిల్లీ-భోపాల్  మధ్య ప్రయాణ  సమయాన్ని తగ్గిస్తుందన్నారు. యువత, వృత్తి నిపుణులకు పలు సదుపాయాలు, సౌకర్యం అందుబాటులోకి తెస్తుందని చెప్పారు.

నేటి ఈ కార్యక్రమానికి వేదిక అయిన రాణి కమలాపతి స్టేషన్  ను కూడా ప్రారంభించే భాగ్యం తనకు కలిగిందన్న విషయం ప్రధానమంత్రి గుర్తు చేశారు. ఢిల్లీకి వందే భారత్  రైలు ప్రారంభించే అవకాశం తనకు కల్పించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఒక ప్రధానమంత్రి అతి తక్కువ సమయంలో రెండుసార్లు ఒక స్టేషన్  ను సందర్శించిన అరుదైన ఘట్టం నేడు చోటు చేసుకున్నదని ఆయన సూచించారు. ఆధునిక భారతంలో కొత్త ధోరణులు, కొత్తం సాంప్రదాయాలు ప్రారంభమవుతున్నాయనేందుకు నేటి సందర్భం ఒక ఉదాహరణ అన్నారు.

ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో తాను జరిపిన సంభాషణ గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ ఈ రైలు పట్ల వారిలో ఎనలేని ఉత్సుకత, ఆసక్తి కనిపించాయని చెప్పారు. ‘‘ఒక రకంగా వందే భారత్  భారతదేశ ఉత్సుకతకు, ప్రేరణకు చిహ్నం. అది మన నైపుణ్యాలు, విశ్వాసం, సామర్థ్యాలను ప్రతిబింబిస్తుంది’’ అని ప్రధానమంత్రి అన్నారు.

ఈ రైలు ద్వారా పర్యాటకానికి గల ప్రయోజనాల గురించి వివరిస్తూ సాంచి, భింబెట్కా, ఉదయగిరి గుహలకు దీని ద్వారా పర్యాటకుల రాక పెరుగుతుందని ప్రధానమంత్రి చెప్పారు. ఇది ఉపాధి, ఆదాయం, స్వయం-ఉపాధిని కూడా పెంచుతుందన్నారు. 

భారతదేశంలో 21వ శతాబ్దికి చెందిన కొత్త ఆలోచనా ధోరణి, వైఖరి గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. గత ప్రభుత్వాలు పౌరుల సౌకర్యాలను ఫణంగా పెట్టి వారిని బుజ్జగించే చర్యలు చేపట్టేవని అన్నారు. ‘‘వారు ఎప్పుడూ తమ ఓటు బ్యాంకును సంతుష్టులను చేయడానికే (తుష్టీకరణ్) ప్రాధాన్యం ఇచ్చే వారు. కాని మేం  పౌరుల అవసరాలు తీర్చడానికి (సంతుష్టీకరణ్) ప్రాధాన్యం ఇస్తున్నాం’’ అని ఆయన చెప్పారు. భారతీయ రైల్వే సాధారణ కుటుంబాల ప్రయాణ సాధనం అని గుర్తు చేస్తూ గతంలో ఎన్నడూ రైల్వే స్థాయిని పెంచేందుకు గాని, ఆధునికీకరించేందుకు గాని ఎందుకు ప్రయత్నించలేదు అని ప్రశ్నించారు.

ఎప్పుడో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏర్పాటైన రైల్వే నెట్  వర్క్  ను గత ప్రభుత్వాలు తేలిగ్గా అప్  గ్రేడ్  చేసి ఉండవచ్చునని, కాని స్వప్రయోజనాల కారణంగా రైల్వేల అభివృద్ధిని త్యాగం చేశారని ప్రధానమంత్రి చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి దశాబ్దాలు గడిచిపోయినా ఈశాన్య రాష్ర్టాలకు రైల్వే అనుసంధానత కల్పించలేదన్నారు. తమ ప్రభుత్వం భారత రైల్వేను ప్రపంచంలోనే అత్యుత్తమ నెట్  వర్క్  గా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నదని చెప్పారు. 2014 సంవత్సరానికి ముందు భారతీయ రైల్వేలపై  జరిగిన ప్రతికూల ప్రచారం గురించి ప్రస్తావిస్తూ ఈ నెట్  వర్క్  లోని వేలాది మనిషి కాపలా లేని లెవెల్  క్రాసింగ్  ల కారణంగా ప్రాణాంతకమైన ప్రమాదాలు చోటు చేసుకునేవని ప్రధానమంత్రి చెప్పారు. నేడు బ్రాడ్  గేజ్  నెట్  వర్క్  అంతా కాపలా లేని లెవెల్   క్రాసింగ్  ల నుంచి విముక్తి పొందిందన్నారు. గతంలో వందలాది ప్రాణాలను బలిగొన్న, ఆస్తులను ధ్వంసం చేసిన రైలు ప్రమాదాల వార్తలు ప్రముఖంగా వచ్చేవని, కాని నేడు  భారతీయ రైల్వే మరింత భద్రంగా మారిందని ఆయన చెప్పారు.  ప్రయాణికుల భద్రతను పటిష్ఠం చేసేందుకు భారతదేశంలోనే తయారైన ‘కవచ్’ పరిధిని విస్తరింపచేస్తున్నట్టు ఆయన చెప్పారు.

భద్రతా ధోరణి అంటే ప్రమాదాల నివారణ మాత్రమే కాదని, నేడు ప్రయాణంలో ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా తక్షణం దాన్ని పరిష్కరిస్తున్నారని చెబుతూ ఇది మహిళలకు అత్యంత ప్రయోజనకరంగా ఉన్నట్టు ప్రధానమంత్రి చెప్పారు. స్వచ్ఛత, సకాలానికి రైళ్ల రాకపోకలు సాగించడం, నల్లబజారులో టికెట్ల విక్రయం వంటి అంశాల్లో ప్రయాణికుల ఆందోళనలు పరిగణనలోకి తీసుకుని ఆ సమస్యలన్నింటినీ టెక్నాలజీ సహాయంతో పరిష్కరించినట్టు తెలిపారు.

‘‘ఒక స్టేషన్, ఒక ఉత్పత్తి’’ కాన్సెప్ట్  ద్వారా స్థానిక కళాకారులు తయారుచేసిన ఉత్పత్తులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరేలా చేయడంలో రైల్వేలు శక్తివంతమైన సాధనంగా మారాయని శ్రీ మోదీ అన్నారు. ఈ పథకం కింద ప్రయాణికులు సంబంధిత జిల్లాకు చెందిన హస్తకళా ఉత్పత్తులు, చిత్రలేఖనం, పాత్రలు, దుస్తులు, పెయింటింగ్స్  వంటివి స్టేషన్  లోనే కొనుగోలు చేయవచ్చునని ఆయన చెప్పారు. దేశంలో ఇప్పటికే 600 ఔట్  లెట్లు పని చేస్తున్నాయని, లక్షకు పైగా కొనుగోళ్లు నమోదయ్యాయని ఆయన తెలిపారు.

‘‘నేడు భారతీయ రైల్వేలు సామాన్య కుటుంబాల సౌకర్యానికి చిహ్నంగా మారుతున్నాయి’’ అని ప్రధానమంత్రి చెప్పారు. రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, 6000 స్టేషన్లలో వైఫై సదుపాయం, 900 స్టేషన్లలో సిసిటివిలు వంటి వసతుల గురించి ఆయన వివరించారు. వందేభారత్  పట్ల యువతలో ఆకర్షణ పెరిగిందంటూ దేశంలోని ప్రతీ మారుమూల ప్రాంతం నుంచి వందే భారత్  కోసం డిమాండ్లు వస్తున్నాయని చెప్పారు.  

ఈ ఏడాది బడ్జెట్లో రైల్వేలకు రికార్డు స్థాయిలో కేటాయింపులు చేసిన విషయం ప్రధానమంత్రి తెలిపారు. ‘‘చిత్తశుద్ధి, మంచి ఉద్దేశం, సంకల్పం ఉన్నట్టయితే కొత్త మార్గాలు వాటికవే తెరుచుకుంటాయి’’ అన్నారు. గత 9 సంవత్సరాల కాలంలో రైల్వే బడ్జెట్  నిరంతరాయంగా పెరుగుతూ వస్తోందని, 2014 సంవత్సరానికి ముందు మధ్యప్రదేశ్  సగటున అందుకున్న రూ.900 కోట్లతో పోల్చితే ఇప్పుడు రూ.13,000 కోట్ల బడ్జెట్  కేటాయింపులు అందుకుందని ఆయన చెప్పారు.

రైల్వేల ఆధునీకరణకు సంబంధించిన ఉదాహరణ చెబుతూ  ప్రతీ ఒక్క రోజూ దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో 100 శాతం రైల్వే విద్యుదీకరణ పూర్తవుతున్నదని ప్రధానమంత్రి చెప్పారు.  100 శాతం విద్యుదీకరణ సాధించిన 11 రాష్ర్టాల్లో మధ్యప్రదేశ్  కూడా ఒకటిగా ఉన్నదని ఆయన తెలిపారు. రైలు మార్గాల విద్యుదీకరణ వార్షిక సగటు 2014 కన్నా ముందు 600 కిలోమీటర్లుండగా ఇప్పుడు 6000 కిలోమీటర్లకు చేరిందన్న విషయాన్ని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.

‘‘నేడు మధ్యప్రదేశ్  నిరంతర అభివృద్ధి ప్రయాణం సాగిస్తోంది. వ్యవసాయం కావచ్చు లేదా పరిశ్రమలు కావచ్చు అన్నింటిలోనూ భారతదేశం బలాన్ని ఎంపి మరింత పటిష్ఠం చేస్తోంది’’ అని ప్రధానమంత్రి అన్నారు. ఒకప్పుడు  ‘బీమారు’గా పేరు పొందిన మధ్యప్రదేశ్  అభివృద్ధికి సంబంధించిన పలు కోణాల్లో ప్రశంసనీయమైన పనితీరు ప్రదర్శిస్తోందని చెప్పారు. పేదలకు ఇళ్ల నిర్మాణంలో మధ్యప్రదేశ్  దేశంలోని ప్రధాన రాష్ర్టాల్లో ఒకటిగా నిలవడాన్ని ఆయన ఉదాహరణగా చూపారు. ప్రతీ ఒక్క ఇంటికి నీటివసతి కల్పించడంలో రాష్ర్టం మంచి కృషి చేస్తోందన్నారు. మధ్యప్రదేశ్  రైతుల గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ గోధుమ సహా పలు పంటల ఉత్పత్తిలో వారు కొత్త రికార్డులు నమోదు చేస్తున్నారని చెప్పారు. రాష్ర్టంలో పరిశ్రమల గురించి ప్రస్తావిస్తూ అవి నిరంతరం కొత్త ప్రమాణాలు నెలకొల్పుతూ దాని ప్రభావం వల్ల యువతకు అందులేని అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు.

దేశాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు దేశం లోపలి నుంచి, వెలుపలి నుంచి జరుగుతున్న ప్రయత్నాల పట్ల ప్రధానమంత్రి ప్రజలను అప్రమత్తం చేశారు. ‘‘భారతదేశ పేదలు, మధ్యతరగతి ప్రజలు, గిరిజనులు, దళిత-వెనుకబడిన వర్గాలు...ప్రతీ ఒక్కరూ నేడు రక్షణ కవచం పొందారు’’ అని చెప్పారు. దేశాభివృద్ధి పట్ల శ్రద్ధగా ఉండాలని ఆయన కోరారు. ‘‘అభివృద్ధి చెందిన భారత్   లో మధ్యప్రదేశ్  పాత్ర మనం మరింతగా పెంచాల్సిన అవసరం ఉంది. ఈ సంకల్పంలో వందే భారత్  ఎక్స్  ప్రెస్  కూడా ఒకటి’’ అంటూ ఆయన తన ప్రసంగం ముగించారు.

మధ్యప్రదేశ్  గవర్నర్ శ్రీ మంగూభాయ్  పటేల్, మధ్యప్రదేశ్  ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్  సింగ్ చౌహాన్, కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గత చరిత్ర

వందే భారత్ ఎక్స్  ప్రెస్  దేశంలో ప్రయాణికుల ప్రయాణ అనుభూతిని పునర్నిర్వచించింది. భోపాల్  లోని రాణి కమలాపది రైల్వే స్టేషన్ నుంచి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్  మధ్య కొత్త వందే భారత్  రైలు ప్రవేశపెట్టారు. ఇది 11వ వందే భారత్  సర్వీసు కాగా దేశంలో 12వ వందే భారత్  రైలు.  దేశీయంగానే డిజైన్  చేసిన వందే భారత్  రైలు పలు అత్యాధునిక ప్రయాణికుల సౌకర్యాలున్నాయి. రైల్వే వినియోగదారులకు అది మరింత వేగవంతమైన, మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగిస్తూ పర్యాటకానికి ఉత్తేజంగా నిలుస్తోంది. ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతోంది. 

 

***



(Release ID: 1913575) Visitor Counter : 128