కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
తపాలా కార్యాలయాలలో అందుబాటులోకి ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్లు’
Posted On:
01 APR 2023 8:30AM by PIB Hyderabad
దేశ వ్యాప్తంగా తపాలా కార్యాలయాలలో ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్లు’ అందుబాటులోకి వచ్చాయి. గత అర్థరాత్రి ఆర్థిక మంత్రిత్వ శాఖ ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్లు’, 2023కి సంబంధించి ఒక గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనికి తోడు తక్షణం అమలులోకి వచ్చేలా 1.59 లక్షల పోస్టాఫీసుల్లో ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్లు’ అందుబాటులో ఉంచబడ్డాయి. ఈ పథకాన్ని 2023-24 బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ జ్ఞాపకార్థం ప్రకటించారు. బాలికలతో సహా మహిళల ఆర్థిక చేరిక పెంచడం సాధికారత దిశగా ఇదొక ముఖ్యమైన ముందడుగు. రెండు సంవత్సరాల కాలవ్యవధితో కూడిన ఈ పథకం ఆకర్షణీయమైన 7.5 శాతం స్థిర వడ్డీతో త్రైమాసికానికి అనువైన పెట్టుబడి సాధనంగా మహిళలకు అందుబాటులోకి వచ్చింది. పాక్షిక ఉపసంహరణ ఎంపికలతో పాటుగా గరిష్టంగా ₹ రెండు లక్షల వరకు సొమ్మును విత్ డ్రా చేసుకునే అవకాశం ఇందులో అందుబాటులో ఉంది. ఈ పథకం 31 మార్చి 2025 వరకు రెండేళ్ల కాలానికి చెల్లుబాటులో ఉండనుంది. జాతీయ పొదుపు (నెలవారీ ఆదాయ ఖాతా) పథకం, 2019 జాతీయ పొదుపు (నెలవారీ ఆదాయ ఖాతా) (సవరణ) పథకం, 2023 ద్వారా సవరించబడింది. ఒక్క ఖాతా గరిష్ట పెట్టుబడి పరిమితిని ₹ నాలుగు లక్షల యాభై వేల నుండి ₹ తొమ్మిది లక్షలకు పెంచబడింది. 1 ఏప్రిల్ 2023 నుండి జాయింట్ ఖాతాల పరిమితిని కూడా ₹ తొమ్మిది లక్షల నుండి ₹ 15 లక్షలకు పెంచబడింది. అదేవిధంగా, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్- 2019, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ (సవరణ) పథకం- 2023 ద్వారా సవరించబడింది. నేటి నుండి అమలులోకి వచ్చిన ఈ విధానంలో గరిష్ట పెట్టుబడి పరిమితి ₹ 15 లక్షల నుండి ₹ 30 లక్షలకు పెంచబడింది. సేవింగ్స్ డిపాజిట్ మరియు పీపీఎఫ్ మినహా అన్ని చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు పెంచబడినాయి. ఈ పెంపు 1 ఏప్రిల్ 2023 నుండి అమలులోకి వచ్చేలా సవరించబడ్డాయి. ఈ చర్యలు పోస్టాఫీసు చిన్న పొదుపు వినియోగదారులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి. పోస్టాఫీసుల ద్వారా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో మరియు బాలికలు, మహిళలు, రైతులు, చేతివృత్తులవారు, సీనియర్ సిటిజన్లు, ఫ్యాక్టరీ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు మరియు ఇతర విభాగాల ద్వారా ఈ పథకాలలో మరింత పెట్టుబడిని ఆకర్షించబడతాయి. చిన్న మొత్తాల పొదుపు పథకాలలో వారు పెట్టుబడికి మంచి రాబడిని పొందుతారు. మరిన్ని వివరాల కోసం, దయచేసి www.indiapost.gov.in ని సందర్శించండి.
***
(Release ID: 1912900)
Visitor Counter : 357